ఇది చాలా అవమానం .. ధోనిని తీసేస్తారా?

16 Jan, 2020 15:51 IST|Sakshi

ముంబై: భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు ప్రకటించిన ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్ట్‌ జాబితాలో ఎంఎస్‌ ధోనికి అవకాశం ఇవ్వకపోవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. భారత్ క్రికెట్‌ జట్టును ఉన్నత స్థానంలో నిలపడమే కాకుండా  వన్డే వరల్డ్‌కప్‌, టీ20 వరల్డ్‌కప్‌, చాంపియన్స్‌ ట్రోఫీలను సాధించి పెట్టిన ధోనిని కాంట్రాక్ట్‌ జాబితా నుంచి తొలగించడం వెనుక పరమార్థం ఏమిటో అంతుచిక్కడం లేదు. తాను ఇక అంతర్జాతీయ క్రికెట్‌ ఆడబోనని ధోని చెప్పిన సందర్భంలోనే బీసీసీఐ ఇలా చేసిందా అనేది క్రికెట్‌ విశ్లేషకుల్లో చర్చకు దారి తీస్తే, అభిమానుల మాత్రం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అసలు బీసీసీఐకి సిగ్గుందా అంటూ సోషల్‌ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. ఈ క్రమంలోనే ట్వీటర్‌లో బీసీసీఐపై విమర్శల వర్షం కురుస్తోంది. (ఇక్కడ చదవండి: ధోనికి బీసీసీఐ ఝలక్‌)

‘ఇది నిజంగా సిగ్గుచేటు.. మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించిన ఆటగాడికి కాంట్రాక్ట్‌ జాబితాలో చోటివ్వకపోవడం బీసీసీఐకి బరవై పోయిందా’ అని ఒక అభిమాని విమర్శించగా, ‘ ధోని కెరీర్‌ ముగిసిందా.. లేకా ఇంకా ఉందా. ఏమీ అర్థం కావడం లేదు. ఇది దేనికి సంకేతం’ అని మరొక అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ ధోని కాంట్రాక్ట్‌ జాబితాలో లేడంటే ఇక ఆట ముగిసినట్లే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. బీసీసీఐ సాగనంపుతుందా.. లేక ధోనినే స్వయంగా తన అభిప్రాయాన్ని చెప్పాడా?’ అని మరొకరు ప్రశ్నించారు. ‘ ఈ ఏడాది ఐపీఎల్‌లో ధోని ఆడబోతున్నాడు. అదే సమయంలో టీ20 వరల్డ్‌కప్‌ కూడా ఉంది. మరి ఈ సమయంలో ధోనికి కాంట్రాక్ట్‌ జాబితాలో ఎందుకు చోటివ్వలేదు. దీని అర్థం ఏమిటి. ఇక ధోని శకం ముగిసినట్లేనా?, ఒకవేళ ధోని రిటైర్మెంట్ చెబితే బహిరంగంగానే చెబుతాడు కదా.. పొమ్మనలేక పొగబెడుతున్నారా’ అని మరొకరు నిలదీశారు.

 
 

మరిన్ని వార్తలు