మమ్మల్ని ఆడనివ్వండి.. నిజాయితీగా ఉండండి

23 May, 2020 10:33 IST|Sakshi

విదేశీ లీగ్‌లకు అనుమతి ఇవ్వండి

బీసీసీఐని వేడుకున్న ఊతప్ప

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికితే కానీ విదేశీ లీగ్‌లు ఆడటానికి భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) అనుమతి ఇవ్వకపోవడంపై భారత క్రికెట్‌లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అసలు అంతర్జాతీయ క్రికెట్‌ను వదులుకుంటేనే విదేశీ లీగ్‌లు ఆడటానికి బీసీసీఐ అనుమతి ఇవ్వడాన్ని ఇప్పటికే ఇర్ఫాన్‌ పఠాన్‌, హర్భజన్‌ సింగ్‌లు వ్యతిరేకించగా, తాజాగా ఆ జాబితాలో వెటరన్‌ క్రికెటర్‌ రాబిన్‌ ఊతప్ప చేరిపోయాడు. ఎటువంటి షరతులు లేకుండా భారత క్రికెటర్లను విదేశీ లీగ్‌లో ఆడుకోవడానికి అనుమతి ఇవ్వాలని బీసీసీఐని వేడుకున్నాడు. ఒకవైపు భారత క్రికెట్‌లో చోటు లేకుండా, మరొకవైపు విదేశీ లీగ్‌లు ఆడనివ్వకుండా చేయడం తగదన్నాడు. భారత క్రికెటర్లు విదేశీ లీగ్‌లు ఆడితే నష్టమేమీ లేనప్పుడు దానికి ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. (‘బౌలౌట్‌’ విజయం.. పూర్తి క్రెడిట్‌ అతడికే!)

ఇక నుంచైనా ఎటువంటి నిబంధనలు లేకుండా తాము ఎక్కడైనా ఆడుకోవడానికి అనుమతి ఇవ్వాలన్నాడు. ఈ విషయంలో బీసీసీఐ నిజాయితీగా వ్యవహరించాలన్నాడు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్య్యూలో ఊతప్ప మాట్లాడుతూ.. ‘మమ్మల్ని విదేశీ లీగ్‌లు ఆడటానికి వెళ్లనివ్వండి. నిజాయితీగా ఉండండి. భారత క్రికెటర్లకు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పకపోతే విదేశీ లీగ్‌లకు బీసీసీఐ నుంచి అనుమతి లేదు. ఇది బాధాకరమే కాదు.. మమ్మ్మల్ని తీవ్రంగా వేధిస్తోంది. మిగతా దేశాల క్రికెటర్లు విదేశీ లీగ్‌లు ఆడుతున్నట్లు మాకు అనుమతి ఇస్తే అది చాలా బాగుంటుంది. ఒక క్రికెటర్‌గా గేమ్‌లో ఏదైనా నేర్చుకోవాలంటే ఆడుతూ ఉండాలి. ఇందుకు విదేశీ లీగ్‌లు ఆడాల్సి ఉంది’ అని రాబిన్‌ ఊతప్ప పేర్కొన్నాడు. గతేడాది యువరాజ్‌ సింగ్‌కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. కెనడా లీగ్‌ ఆడే క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికితే కానీ బీసీసీఐ ఎన్‌ఓసీ ఇవ్వలేదు. ఇదే విషయాన్ని ఇప్పుడు అంతా తప్పుబడుతున్నారు. ఏ దేశ క్రికెట్‌ బోర్డుకు లేని నిబంధన బీసీసీఐ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉ‍న్న సౌరవ్‌ గంగూలీ చొరవ తీసుకుని ఈ నిబంధనకు చరమగీతం పాడాలని కోరుతున్నారు. (సఫారీ పర్యటనకు మాటివ్వలేదు: ధుమాల్‌)

మరిన్ని వార్తలు