వినేశ్‌ ‘కంచు’పట్టు

19 Sep, 2019 02:34 IST|Sakshi

టోక్యో ఒలింపిక్స్‌కూ అర్హత

ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌

నూర్‌ సుల్తాన్‌ (కజకిస్తాన్‌): ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ బంగారానికి దూరమైనా... బంగారంలాంటి అవకాశాన్ని మాత్రం వదులుకోలేదు. రెపిచేజ్‌లో విరామమెరుగని పోరాటం చేసిన ఆమె వరుస విజయాలతో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించడంతో పాటు కాంస్య పతకాన్ని చేజిక్కించుకుంది.  25 ఏళ్ల వినేశ్‌ మూడు ప్రపంచ రెజ్లింగ్‌ ఈవెంట్లలో తలపడినా... ఒక్కసారి కూడా పతకాన్ని నెగ్గలేకపోయింది. నాలుగోసారి బరిలోకి దిగిన ఆమెకు గురువారం ముగ్గురు క్లిష్టమైన ప్రత్యర్థులే ఎదురయ్యారు. చివరకు అందరిని ఓడిస్తూ అనుకున్నది సాధించింది. మహిళల 53 కేజీల రెపిచేజ్‌ తొలి బౌట్‌లో 5–0తో యులియా (ఉక్రెయిన్‌)ను ఓడించింది.

రెండో బౌట్‌లో వినేశ్‌ 8–2తో ప్రపంచ నంబర్‌వన్‌ సారా అన్‌ హిల్డెబ్రంట్‌ (అమెరికా)ను మట్టికరిపించింది. దీంతో సెమీఫైనల్‌కు చేరి ఒలింపిక్స్‌కు అర్హత పొందిన ఆమె... కాంస్య పతక పోరులో 4–1తో మరియా ప్రివొలరకి (గ్రీస్‌)ను చిత్తు చేసింది. నాన్‌ ఒలింపిక్‌ 59 కేజీల కేటగిరీలో పూజ ధండా సెమీఫైనల్లో ఓడింది. రష్యా రెజ్లర్‌  ఒచరొవా 10–0తో పూజను ఓడించింది. నేడు జరిగే కాంస్య పతక పోరులో గుల్నోరా (ఉజ్బెకిస్తాన్‌) లేదా జింగ్‌రు పె (చైనా)లతో పూజ తలపడుతుంది. 50 కేజీల రెపిచేజ్‌ బౌట్‌లో సీమా 3–11తో పొలెస్‌చుక్‌ (రష్యా) చేతిలో ఓడింది.

►5 చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గిన ఐదో భారతీయ మహిళా రెజ్లర్‌ వినేశ్‌. గతంలో అల్కా తోమర్‌ (2006), ‘ఫొగాట్‌ సిస్టర్స్‌’ గీత  (2012), బబిత (2012), పూజ ధండా (2018) ఈ ఘనత సాధించారు. వీరందరూ కాంస్య పతకాలే గెలిచారు.  

మరిన్ని వార్తలు