ఛేజింగ్‌లో అతడు చిరుతపులి: అక్తర్

2 Feb, 2018 18:49 IST|Sakshi

కరాచీ: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి సూపర్ ఛేజింగ్ సెంచరీకి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్‌ అక్తర్ ఫిదా అయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో ఛేజింగ్‌లో సెంచరీ చేసిన కోహ్లిని అక్తర్ ప్రశంసల్లో ముంచెత్తాడు.
సాధారణంగా భారత క్రికెటర్లు అంటేనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసే అక్తర్ సైతం విరాట్ బ్యాటింగ్‌ను కొనియాడాడు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా కోహ్లిని చిరుతపులితో పోల్చాడు. 'ఛేజింగ్లో కోహ్లి మరో సూపర్ ఇన్నింగ్ ఆడాడు. ఛేజింగ్ అంటే చాలు అతడు చిరుతపులిలా మారిపోతాడు. ఛేజింగ్ లో అతడు కోహ్లినా.. లేక చిరుతపులా అని డౌట్ వస్తుంది. యువ క్రికెటర్లు కోహ్లిని ఆదర్శంగా తీసుకుని ఎంతో నేర్చుకోవాలని' ట్వీట్ చేశాడు 'రావల్ఫిండి ఎక్స్‌ప్రెస్' అక్తర్.

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో ఓపెనర్లు త్వరగా ఓటైనా అజింక్య రహానే(79)తో కలిసి కెప్టెన్ కోహ్లి మూడో వికెట్‌కు భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఛేజింగ్‌లో తాను ఎంతటి ప్రమాదకారో కోహ్లి తన శతక ఇన్నింగ్స్‌తో మరోసారి నిరూపించాడు. కెరీర్‌లో 33వ వన్డే సెంచరీని 106 బంతుల్లో చేసిన కోహ్లికి మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. కాగా, చాలాగ్యాప్‌ తర్వాత, అదికూడా భారీ పరుగుల ఛేజింగ్ విజయం సాధించడంపై టీమిండియా మాజీ క్రికెటర్లతో పాటు పాక్ ఆటగాళ్లు సైతం కోహ్లి సేనను ప్రశంసిస్తున్నారు.

మరిన్ని వార్తలు