పాండ్యాపై కోహ్లి ప్రశంసలు

28 Jan, 2019 19:08 IST|Sakshi

మౌంట్‌ మాంగనీ : న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఏడు వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా రెండు వన్డేలు మిగిలి ఉండగానే కోహ్లి సేన 3-0 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడిన కెప్టెన్‌ కోహ్లి... ఇది జట్టు సభ్యుల సమిష్టి విజయమని కొనియాడాడు. ఈ క్రమంలో సస్పెన్షన్‌ అనంతరం మూడో వన్డే ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యాపై ప్రశంసలు కురిపించాడు.

‘హార్ధిక్‌ రాకతో జట్టులో సమతౌల్యం ఏర్పడింది. తను తల దించుకునే ఉన్నాడు. కానీ జట్టుకు కావాల్సిందేమిటో తనకు తెలుసు. అందుకే ఆటపై దృష్టి పెట్టాడు. తన బాధ్యత నెరవేర్చాడు. ఈరోజు తన ఆట తీరు అద్భుతం. అతడి రాక సంతోషాన్నిచ్చింది. ’ అని వాఖ్యానించాడు. అదేవిధంగా శుభ్‌మన్‌ గిల్‌, విజయ్‌ శంకర్‌ వంటి యువ ఆటగాళ్లు జట్టుతో చేరడం ఎంతో ఆనందంగా ఉందన్నాడు. ‘ శుభ్‌మన్‌ ప్రతిభావంతుడైన ఆటగాడు. నెట్స్‌లో తను ప్రాక్టీస్‌ చేసే తీరు అద్భుతం. నేను తన వయస్సులో ఉన్నపుడు.. అందులో కనీసం పదో శాతం కూడా అలా ఆడలేదు’ అంటూ ప్రశంసించాడు. యువ ఆటగాళ్లకు సరైన ప్రాతినిథ్యం కల్పించి వారి సేవలను చక్కగా వినియోగించుకుంటామని పేర్కొన్నాడు.

కాగా టీవీ షోలో మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న హార్ధిక్‌ పాండ్యా మౌంట్‌ మాంగనీ వన్డే ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. అద్భుతమైన క్యాచ్‌తో కివీస్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ను పెవిలియన్‌కు చేర్చి పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. చహల్‌ వేసిన 17వ ఓవర్‌ తొలి బంతిని విలియమ్సన్‌ ముందుకొచ్చి షాట్‌ ఆడగా.. ఫార్వార్డ్‌ ఫీల్డింగ్‌లో ఉన్న పాండ్యా సూపర్‌ డైవ్‌తో బంతిని ఒడిసిపట్టుకున్నాడు. బాధ్యతాయుతంగా ఆడుతున్న విలియమ్సన్‌(28) అవుట్‌ కావడంతో కివీస్‌ విజయావకాశాలు దెబ్బతిన్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో మెరుపు ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్న పాండ్యా రెండు వికెట్లు తీశాడు.

మరిన్ని వార్తలు