'వాటిని కోహ్లి వదులుకున్నాడు'

5 Nov, 2017 15:27 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెట్లో ప్రస్తుతం అసాధారణ ఫామ్ లో  ఉన్న ఆటగాడు విరాట్ కోహ్లి. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డులకు వారసుడిగా మన్ననలు అందుకుంటూ దూసుకుపోతున్న క్రికెటర్.  బ్యాట్ పట్టుకుంటే చాలు రికార్డులు కొల్లగొట్టడమే లక్ష్యంగా కోహ్లి  బ్యాటింగ్ సాగుతోంది. తన మెరుగైన ప్రదర్శన కోసం కొన్నేళ్లక్రితం ఫిట్ నెస్ పైనే ప్రధానంగా దృష్టి సారించిన కోహ్లి..  ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఈరోజు(నవంబర్ 5) 29వ పుట్టినరోజును కోహ్లి  జరుపుకుంటున్న సందర్భంగా అతని గురించి చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ అనేక విషయాల్ని షేర్ చేసుకున్నాడు. ప్రధానంగా విరాట్ కోహ్లి తన డైట్ విషయంలో పాటించే నిబద్ధత  ఏ స్థాయిలో ఉందో రాజ్ కుమార్ వెల్లడించాడు.

'కోహ్లి గురించి చెప్పాలంటే అతనొక భోజన ప్రియుడు. మితిమీరి తింటూ ఉండేవాడు. ముఖ్యంగా బట్టర్ చికెన్, మటన్ రోల్స్ అంటే అతనికి చాలా ఇష్టం. ప్రతీరోజూ అతని ఆహారంలో అవి తప్పకుండా ఉండాల్సిందే. ఇదంతా అతను ఫిట్ నెస్ పై పూర్తిస్థాయి దృష్టి పెట్టకముందు వరకే. ఎప్పుడైతే ఫిట్ నెస్ పై కోహ్లి సీరియస్ గా దృష్టి పెట్టాడో.. అప్పుడే వాటిని వదిలేశాడు. కోహ్లికి ఎంతో ఇష్టమైన బట్టర్ చికెన్, మటన్ రోల్స్ ను తినడం ఆపేశాడు.. ప్రస్తుతం అతని డైట్ లో వాటికి స్థానం లేదు. ప్రధానంగా వేగవంతమైన సింగిల్స్ తీయడానికే ఆ రెండింటిని కోహ్లి త్యాగం చేశాడు. ఒక కెప్టెన్ గా జట్టు సభ్యులుగా ఏమైనా మనం చెప్పాలంటే ముందు మనం పాటించాలనే తత్వం కోహ్లిది. ఇదే విషయాన్నిఒకానొక సందర్భంగో కోహ్లి నాకు చెప్పాడు కూడా'  అని క్రికెట్ నెక్స్ట్ తో మాట్లాడిన రాజ్ కుమార్ శర్మ స్పష్టం చేశాడు. ఒక యువ క్రికెటర్ స్ధాయి నుంచి పరుగుల మెషీన్ గా కోహ్లి రూపాంతరం చెందడంలో ట్రైనర్స్ పాత్ర వెలకట్టలేనదన్నాడు.


 

మరిన్ని వార్తలు