ప్రపంచంలో ఎవరితోనైనా పోటీపడగలం: కోహ్లి

19 Feb, 2020 11:37 IST|Sakshi

వెల్లింగ్‌టన్‌: న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యామని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పేర్కొన్నాడు. ప్రత్యర్థి జట్టులో నైపుణ్యం గల బౌలర్లు.. మెరుగైన ఫీల్డర్లు ఉన్నారు కాబట్టి వారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తున్నామని తెలిపాడు. అయితే సొంతగడ్డపై సిరీస్‌ ఆడటం కివీస్‌కు కలిసి వచ్చే అంశమని అభిప్రాయపడ్డాడు. టీ20 సిరీస్‌లో కివీస్‌ను క్లీన్‌స్వీప్‌ (0-5) చేసిన టీమిండియా... వన్డే సిరీస్‌లో మాత్రం ఆ జట్టు చేతిలో వైట్‌వాష్‌కు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం వెల్లింగ్‌టన్‌లో జరుగనున్న తొలి టెస్టు మ్యాచ్‌కు ఇరుజట్లు సమాయత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో... టెస్టు సిరీస్‌ ట్రోఫీని బుధవారం ఆవిష్కరించిన అనంతరం ఇరుజట్ల కెప్టెన్లు కోహ్లి, విలియమ్సన్‌ ఫొటోలకు పోజులిచ్చారు.(కోహ్లి వికెట్‌ తీస్తేనే మజా: బౌల్ట్‌)

ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్‌ కోహ్లి మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలోని ఏ జట్టుతోనైనా సునాయాసంగా తలపడే రీతిలో మేం సిద్ధమయ్యాం. ఫిట్‌నెస్‌ పరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. పూర్తి విశ్వాసం, సానుకూల దృక్పథంతో ఈ సిరీస్‌ను ప్రారంభించబోతున్నాం. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో మైదానంలోని ప్రేక్షకులు కీలక పాత్ర పోషిస్తారు. ముఖ్యంగా న్యూజిలాండ్‌లో ఆటగాళ్లతో పాటు క్రికెట్‌ అభిమానులు కూడా పూర్తి క్రమశిక్షణతో ఉంటారు. వాళ్లు కూడా ఫిట్‌గా ఉంటారు. వారు రోజంతా మైదానంలోనే కూర్చుని.. ఆటగాళ్ల సహనాన్ని పరీక్షిస్తూ ఉంటారు. కాబట్టి ఏ వైపు నుంచి ఎటువంటి కౌంటర్‌ వస్తుందో ఊహించలేం. సో.. ఆఫ్‌ ఫీల్డ్‌ కంటే కూడా ఆన్‌ఫీల్డ్‌పై ఎక్కువ దృష్టి సారించాల్సి ఉంటుంది. ఈ సిరీస్‌లో తలపడేందుకు పరిపూర్ణమైన జట్టుతో మైదానంలోకి దిగబోతున్నాం’’ అని తెలిపాడు. అదే విధంగా సొంతగడ్డపై కెప్టెన్‌గా విలియమ్సన్‌ విజయాల గురించి తనకు అవగాహన ఉందని.. అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని కోహ్లి పేర్కొన్నాడు. టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న తాము.. వన్డే సిరీస్‌ను కోల్పోయామని.. గెలుపోటములు సహజమే కాబట్టి.. సానుకూల దృక్పథంతో టెస్టు సిరీస్‌ సిద్ధమవుతున్నామని చెప్పుకొచ్చాడు.(అభిమానులకు థ్యాంక్స్‌ చెప్పిన కోహ్లి!)

మరిన్ని వార్తలు