ఎలాంటి ఆందోళన లేదు!

15 Mar, 2019 03:42 IST|Sakshi

ప్రపంచ కప్‌ జట్టుపై స్పష్టత ఉంది  ∙ విరాట్‌ కోహ్లి వ్యాఖ్య  

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా చేతిలో వన్డే సిరీస్‌ ఓడిపోవడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదని భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అభిప్రాయపడ్డాడు. చాలా కాలంగా తాము అద్భుతమైన క్రికెట్‌ ఆడుతున్నామని, ఈ ఓటమితో ఏదో ప్రమాదం ముంచుకొచ్చినట్లు ఏమాత్రం భావించడం లేదని అతను అన్నాడు. ‘డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఒక్క ఆటగాడు కూడా తాజా పరాజయంతో ఆందోళన చెందడం లేదు. ఈ ఓటమి సహాయక సిబ్బందిని కూడా బాధపెట్టలేదు. ఎందుకంటే చివరి మూడు మ్యాచ్‌లలో ఏం చేయాలనేది మేం ముందే నిర్ణయించుకున్నాం. నిజాయితీగా చెప్పాలంటే ఏదో ఘోరం జరిగిపోయినట్లుగా ఏమీ అనిపించడమే లేదు. ఎందుకంటే ఇటీవల మేం చాలా బాగా ఆడుతూ వచ్చాం.

అటు వైపు ఆసీస్‌ కూడా చాలా బాగా ఆడింది. కీలక సమయాల్లో వారు పైచేయి సాధించగలిగారు’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. వరల్డ్‌ కప్‌లో ఆడబోయే తుది 11 మంది జట్టుపై కూడా తమకు స్పష్టత ఉందని అతను వెల్లడించాడు. ‘జట్టు కూర్పుపరంగా చూస్తే అంతా బాగుంది. అవసరమైతే ఏదో ఒక మార్పు మాత్రం జరగొచ్చు తప్ప జట్టు సమతూకంగా కనిపిస్తోంది. హార్దిక్‌ పాండ్యా తిరిగొస్తే బ్యాటింగ్‌ బలం పెరుగుతుంది. బౌలింగ్‌లో కూడా ప్రత్యామ్నాయం లభిస్తుంది. 11 మంది గురించి సమస్య లేదు. చేయాల్సిందల్లా ఒత్తిడి సమయాల్లో సరైన నిర్ణయం తీసుకోవడమే’ అని విరాట్‌ చెప్పాడు.

ప్రయోగాలు చేయడం వల్లే ఓడిపోయామనే మాటతో కోహ్లి ఏకీభవించలేదు. ‘అవకాశం వచ్చిన ప్రతీ ఒక్కరు క్లిష్ట పరిస్థితుల్లో కూడా బాగా ఆడాలని మేం ఆశించాం. అందుకే సిరీస్‌ నిర్ణాయక మ్యాచ్‌లో కూడా వారిని ఆడించాం. కొన్ని సార్లు అది పని చేయకపోవచ్చు. అయితే ప్రయత్నిస్తే తప్ప దాని గురించి తెలియదు కదా. ఈ సిరీస్‌లో మేం అదే చేశాం’ అని అతడు విశ్లేషించాడు. విరామం లేకుండా మ్యాచ్‌లు ఆడుతున్న తమ జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉన్నానని... ఇక ఈ కఠిన సిరీస్‌లను మరచి ఐపీఎల్‌ను సంతోషంగా ఆస్వాదించాలని కెప్టెన్‌ నవ్వుతూ చెప్పాడు.   

మరిన్ని వార్తలు