బ్యాట్‌ విసిరేసిన కోహ్లి

3 Dec, 2017 15:18 IST|Sakshi

ఢిల్లీ: తాను సరిగా పాట పాడలేక, మద్దెలను బాగా వాయించలేదని నిందించాడు ఓ ఘనుడు. ఈ క్రమంలో వచ్చిందే 'ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు' అనే సామెత. తన అసమర్ధతకు ఇతరులను నిందించే వాణ్ణి ఉద్దేశించి ఈ సామెతను వాడటం పరిపాటి.  ఇప్పుడు ఆ సామెత అచ్చంగా శ్రీలంక క్రికెటర్లకు సరిపోతుందేమో. ఒకవైపు భారత్‌ క్రికెట్‌ జట్టు ధాటిగా బ్యాటింగ్‌ చేస్తుంటే వాతావరణ కాలుష్యం అంటూ కొత్త పల్లవి అందుకున్నారు లంకేయులు.

అసలేం జరిగిందంటే.. శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులోనూ  భారత్‌ పరుగుల వరద పారిస్తున్న  సమయంలోనే లంక ఆటగాళ్లు.. కాలుష్య ప్రభావం గురించి అంపైర్లకు ఫిర్యాదు చేశారు. దీనిలో భాగంగా లంచ్‌ తరువాత పలువురు లంక ఆటగాళ్లు మాస్క్‌లు ధరించి ఫీల్డ్‌లోకి దిగారు. కాలుష్య ప్రభావం తీవ్రంగా ఉందని, మ్యాచ్‌ను నిలిపివేయాలని  అంపైర్లకు పదే పదే విజ్ఞప్తి చేశారు. ఈ దశలో ఇరుజట్ల కోచ్‌లు జోక్యం చేసుకోవడంతో మ్యాచ్‌ కొంతసేపు కొనసాగింది.  అయితే కొంతసేపు ఆట కొనసాగిన అనంతరం మరోసారి మ్యాచ్‌ కొనసాగింపుపై మ్యాచ్‌ రిఫరీ డేవిడ్‌ బూన్‌ తో పాటు అంపైర్లు చర్చలు జరిపారు.  మళ్లీ మ్యాచ్‌ కాసేపు ఆగింది. అదే సమయంలో కోహ్లి స్టేడియం నుంచి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి వచ్చేయాలంటూ ఫీల్డ్‌లో ఉన్న జడేజా, సాహాలకు సంకేతాలిచ్చాడు. ఫీల్డింగ్‌ మనమే చేద్దాం.. లంకను బ్యాటింగ్‌ చేయనిద్దాం అనే అర్థం వచ్చేలా ఫీల్డ్‌లో ఆటగాళ్లకు సైగ చేశాడు. దాంతో భారత్‌ జట్టు స్కోరు ఏడు వికెట్ల నష్టానికి 536 పరుగుల వద్ద ఉండగా ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

ఏకాగ్రతను దెబ్బతీసిన లంకేయులు..

మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్‌ కోహ్లి డబుల్‌ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో విశ్వరూపం ప్రదర్శించిన కోహ్లి 243 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. దాంతో టెస్టుల్లో ట్రిపుల్‌ సెంచరీ కొడతాడని భావించిన సగటు భారత క్రికెట్‌ అభిమానికి నిరాశే ఎదురైంది. ఇదిలా ఉంచితే, ఆదివారం రెండో రోజు ఆటలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా లంచ్‌ తరువాత లంక క్రికెటర్లు మాస్క్‌లు ధరించి వచ్చి హైడ్రామా క్రియేట్‌ చేశారు. మైదానంలో వాతావరణ కాలుష్యం భరించలేకుండా ఉందంటూ అంపైర్లకు పదే పదే ఫిర్యాదు చేశారు. దాంతో మ్యాచ్‌ను సజావుగా సాగుకుండా లంక క్రికెటర్లు పలుమార్లు ఫిర్యాదు చేయడంతో విసుగుచెందిన కోహ్లి బ్యాట్‌ను విసిరేసి అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆ క్రమంలోనే ఏకాగ్రత కోల్పోయిన కోహ్లి ఆపై వెంటనే తన వికెట్‌ను కూడా సమర్పించుకున్నాడు.

లంక క్రికెటర్ల హైడ్రామా : బ్యాట్‌ విసిరేసిన కోహ్లి  

మరిన్ని వార్తలు