బ్యాట్‌పై అసభ్య పదజాలం.. ఐసీసీ మందలింపు

4 Jun, 2018 15:56 IST|Sakshi

హెడింగ్లే: ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మందలించింది. మరొకవైపు అభిమానులు సైతం బట్లర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన బ్యాట్‌పై ఉన్న అసభ్యకరమైన పదాలే ఇందుకు ప్రధాన కారణం. తొలి టెస్టులో పరాజయం పాలైన ఇంగ్లండ్‌ ఆ తర్వాత పుంజుకుని రెండో టెస్టులో ఇన్నింగ్స్‌ తేడాతో ఘన విజయం సాధించింది.  ఇంగ్లండ్‌ విజయంలో బట్లర్‌ కీలకపాత్ర పోషించి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు. కాగా, బట్లర్‌ బ్యాట్‌పై ఉన్న అసభ్య పదజాలం అతన్ని ఇరకాటంలో పడేసింది.

వివరాల్లోకి వెళితే.. రెండో టెస్టు మ్యాచ్‌ మధ్యలో డ్రింక్స్‌ విరామ సమయంలో బట్లర్‌ తన హెల్మెట్‌తో పాటు బ్యాట్‌ను మైదానంలో ఉంచాడు. ఈ క్రమంలోనే బట్లర్‌ బ్యాట్‌ హ్యాండిల్‌పై రాసిన అసభ్య పదజాలం కాస్తా కెమెరా కంటికి చిక్కింది. అదే సమయంలో ఇది గమనించిన అభిమానులు ఫొటోలు తీసేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టేశారు. దీంతో ఇది కాస్త వైరల్‌గా మారింది. ‘బట్లర్‌ తన బ్యాట్‌పై ఏమి రాసుకున్నాడో చూశారా’ అంటూ నెటిజన్లు ఈ ఫొటోను తెగ షేర్‌ చేసేస్తున్నారు. అది వాడకూడని పదజాలం కావడంతో ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.  మరొకసారి ఇలా వ్యవహరించకూడదంటూ బట్లర్‌కు మందలింపుతో సరిపెట్టింది.

మరిన్ని వార్తలు