ఆ రికార్డును అడ్డుకోవాలనుకున్నాం!

10 Feb, 2017 13:51 IST|Sakshi
ఆ రికార్డును అడ్డుకోవాలనుకున్నాం!

కరాచీ:దాదాపు 18 ఏళ్ల క్రితం భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తన బౌలింగ్ తో చెలరేగిపోయి పదికి పది వికెట్లతో  అరుదైన మైలురాయిని తన ఖాతాలో వేసుకున్న సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. 1999వ సంవత్సరం, ఫ్రిబ్రవరి 7వ తేదీన పాకిస్తాన్తో ఫిరోజ్షా కోట్ల మైదానంలో జరిగిన టెస్టు మ్యాచ్లో కుంబ్లే తన మాయాజలాన్ని ప్రదర్శించి పది వికెట్లను నేలకూల్చాడు. చివరి రోజు ఆటలో భాగంగా పాకిస్తాన్ కు 420 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్.. అనిల్ కుంబ్లే సంచలన బౌలింగ్తో చిరస్మరణీయమైన గెలుపును సొంతం చేసుకుంది.

అయితే అనిల్ కుంబ్లేకు పది పదికి వికెట్లను ఇచ్చి చెత్త రికార్డును మూట గట్టుకోకుండా ఉండేందుకు పాకిస్తాన్ చాలానే ప్రణాళికలే రచించిందట. పాక్ తొమ్మిది వికెట్లను కూల్చేసిన తరువాత పదో వికెట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ కుంబ్లే ఇవ్వకూడదనే పాక్ భావించిందట. ఈ విషయాన్ని తాజాగా వసీం అక్రమ్ వెల్లడించాడు. అవసరమైతే రనౌట్ గా అయినా పదో వికెట్ను సమర్పించుకుందామని తాము భావించినట్లు అక్రమ్ తెలిపాడు. 'పదో వికెట్ ను కుంబ్లేకు ఇవ్వకుండా  రికార్డును అడ్డుకోవాలనే అనుకున్నాం. ఈ క్రమంలోనే  క్రీజ్ లో ఉన్న నా దగ్గరకు వకార్ వచ్చి ఏమి చేద్దాం అని అడిగాడు. రనౌట్ అయితే ఎలా ఉంటుంది అని నాతో వకార్ చర్చించాడు. కాకపోతే దానికి నేను ఒప్పుకోలేదు. ఆ వికెట్ ను కుంబ్లేకు ఎట్టి పరిస్థితుల్లోనూ నేనైతే ఇవ్వను. ఆ విషయంలో నీకు నేను పూర్తి హామి ఇస్తున్నాను అని వకార్ కు చెప్పా. కానీ ఆ వికెట్ ను నేనే కుంబ్లే కు సమర్పించుకోవడం అతను అరుదైన మైలురాయిని సొంతం చేసుకోవడం జరిగిపోయాయి' అని ఆనాటి జ్ఞాపకాల్ని వసీం అక్రమ్ నెమరువేసుకున్నాడు.

మరిన్ని వార్తలు