ఇదీ సఫారీ పంచ్

16 Feb, 2015 00:57 IST|Sakshi
ఇదీ సఫారీ పంచ్

 జింబాబ్వేపై దక్షిణాఫ్రికా గెలుపు
 మిల్లర్, డుమిని శతకాల మోత
 ఐదో వికెట్‌కు ప్రపంచ
 రికార్డు భాగస్వామ్యం

 
 83 పరుగులకే నాలుగు వికెట్లు... ఈ స్థితిలో ఏ జట్టైనా 300కు పైగా పరుగులు సాధించగలుగుతుందా..? భీకర ఫామ్‌లో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు దీన్ని సుసాధ్యం చేసి చూపించింది. ‘కిల్లర్’ మిల్లర్, డుమిని కలిసి జట్టు ఇన్నింగ్స్‌కు పునాది వేస్తూనే విధ్వంసం సృష్టించారు. దాదాపు 30 ఓవర్లు క్రీజులో ఉండి అజేయ శతకాలతో రెచ్చిపోయారు. అంతేనా.. ఐదో వికెట్‌కు 265 పరుగుల అజేయ భాగస్వామ్యంతో ప్రపంచ రికార్డు సృష్టించారు. అయితే వీరితో పోలిస్తే పసికూనే అయినప్పటికీ జింబాబ్వే కూడా బాగానే పోరాడింది. ఈ మ్యాచ్ ద్వారా తమను తేలిగ్గా తీసుకోవద్దని తమ గ్రూపులో ఇతర జట్లకు హెచ్చరికలను కూడా పంపింది.
 
 హామిల్టన్: ఈసారి కచ్చితంగా కప్ కొట్టాలనే కసితో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు తమ ప్రారంభ మ్యాచ్‌లోనే విశ్వరూపం ప్రదర్శించింది. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎలా ముందుకెళ్లాలనే ప్రణాళికలతో చక్కగా సమన్వయం చేసుకుంటూ అద్భుత విజయాన్ని అందుకుంది. డేవిడ్ మిల్లర్ (92 బంతుల్లో 138 నాటౌట్; 7 ఫోర్లు; 9 సిక్సర్లు), డుమిని (100 బంతుల్లో 115; 9 ఫోర్లు; 3 సిక్సర్లు) మిడిలార్డర్‌లో దుమ్మురేపుతూ అజేయ శతకాలతో విజృంభించారు. ఫలితంగా ఆదివారం గ్రూప్ ‘బి’లో భాగంగా సెడాన్ పార్క్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో సఫారీ 62 పరుగులతో గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సఫారీ 50 ఓవర్లలో నాలుగు వికెట్లకు 339 పరుగుల భారీ స్కోరు చేసింది.
 
  నిజానికి ప్రత్యర్థి పసికూనే అయినప్పటికీ దక్షిణాఫ్రికా ఆటతీరు ప్రారంభంలో అందుకు తగ్గట్టుగా సాగలేదు. పేసర్లు రెచ్చిపోవడంతో డి కాక్ (7), ఆమ్లా (26 బంతుల్లో 11; 1 ఫోర్), డు ప్లెసిస్ (32 బంతుల్లో 24; 1 సిక్స్), డి విలియర్స్ (36 బంతుల్లో 25; 1 ఫోర్; 1 సిక్స్) 83 పరుగులకే పెవిలియన్‌లో కూర్చున్నారు. ఈ దశలో 1999 ప్రపంచకప్ ఫలితం పునరావృతమవుతుందా అనిపించినా... మిల్లర్, డుమిని జోడి ఆదుకోవడంతో గట్టెక్కింది. అనంతరం భారీ లక్ష్యం కోసం బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే పోరాట పటిమ చూపుతూ 48.2 ఓవర్లలో 277 పరుగులు చేసింది. చిబాబ (82 బంతుల్లో 64; 10 ఫోర్లు), మసకద్జ (74 బంతుల్లో 80; 8 ఫోర్లు; 2 సిక్సర్లు), టేలర్ (40 బంతుల్లో 40; 4 ఫోర్లు; 1 సిక్స్) రాణించారు. తాహిర్‌కు మూడు, ఫిలాండర్, మోర్కెల్‌లకు రెండేసి వికెట్లు, స్టెయిన్, డుమినిలకు ఒక్కో వికెట్ దక్కింది. మిల్లర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
 
 రికార్డు భాగస్వామ్యం
 ముందుగానే బ్యాటి ంగ్‌కు దిగడంతో ప్రొటీస్ టాప్ ఆర్డర్ భీకరంగా ఆడుతారేమో అనుకున్నా అలా జరుగలేదు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జింబాబ్వే కెప్టెన్ చిగుంబురా నిర్ణయాన్ని బౌలర్లు సద్వినియోగం చేస్తూ 20.2 ఓవర్లలోనే నలుగురు ప్రమాదకర బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేయగలిగారు. ఇలా 100 పరుగుల్లోపే నలుగురు సఫారీ ఆటగాళ్లను అవుట్ చేయడం గత పదేళ్లలో జింబాబ్వేకిదే తొలిసారి కావడం విశేషం.

అటు ఫీల్డింగ్ కూడా ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు డి విలియర్స్ అవుటైన క్యాచ్‌ను చూస్తే తెలుస్తుంది. లాంగ్ ఆఫ్‌లో తను భారీ షాట్ ఆడగా ఇర్విన్ అమాంతం గాల్లోకి ఓ పక్కకు ఎగిరి ఎడమ చేత్తో బంతిని అందుకున్నాడు. అయితే తను కచ్చితంగా లైన్‌పై పడతానని గమనించి వెంటనే బంతిని లోనికి విసిరి తాను మరోసారి ఇటువైపు వచ్చి క్యాచ్ తీసుకున్నాడు. పిచ్ ప్రమాదకరంగా మారడంతో డుమిని, మిల్లర్ ఆచితూచి ఆడారు. రిస్కీ షాట్లకు వెళ్లకుండా సింగిల్స్‌ను నమ్ముకుంటూ ముందుకు వెళ్లారు. 40 ఓవర్ల దాకా బాగానే కట్టడి చేసిన జింబాబ్వే బౌలర్లు ఆ తర్వాత పూర్తిగా గతి తప్పారు. క్రమంగా మిల్లర్ జూలు విదల్చడంతో పరుగులు వరదలా వచ్చాయి. 81 బంతు ల్లో తను తొలి ప్రపంచకప్ సెంచరీని సాధించాడు. ఇక 48వ ఓవర్‌లో విశ్వరూపమే చూపుతూ మూడు ఫోర్లు, 3 సిక్సర్లతో 30 పరుగులు రాబట్టాడు.

చివరి ఓవర్ తొలి బంతికి డుమిని కూడా సెంచరీ మార్కు అందుకున్నాడు. వీరిద్దరు కలిసి ఐదో వికెట్‌కు అజేయంగా  రికార్డు స్థాయిలో 265 పరుగులు జోడిం చారు. చివరి 10 ఓవర్లలో జట్టు 146 పరుగులు సాధించింది. భారీ లక్ష్యమైనప్పటికీ జింబాబ్వే ఇన్నింగ్ ఆదిలో బాగానే సాగింది. మసకద్జ క్రీజులో ఉన్నంత సేపు పరిస్థితి జింబాబ్వేకు కాస్త అనుకూలంగానే కనిపించింది. 32వ ఓవర్‌లో తాహిర్ అతడిని అవుట్ చేయడంతో ఆశలు సన్నగిల్లాయి. ఆ తర్వాత టేలర్ కాస్త మెరుపులు మెరిపించినా ప్రయోజనం లేకపోయింది.
 
 స్కోరు వివరాలు
 దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డి కాక్ (సి) ఎర్విన్ (బి) చటారా 7; ఆమ్లా (బి) పన్యాంగర 11; డు ప్లెసిస్ (సి) టేలర్ (బి) చిగుంబురా 24; డి విలియర్స్ (సి) ఎర్విన్ (బి) కమున్‌గోజి 25; మిల్లర్ నాటౌట్ 138; డుమిని నాటౌట్ 115; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (50 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 339.


 వికెట్ల పతనం: 1-10, 2-21, 3-67, 4-83.
 బౌలింగ్: పన్యాంగర 10-2-73-1; చటారా 10-1-71-1; మిరే 6-0-61-0; చిగుంబురా 4-0-30-1; విలియమ్స్ 8-0-44-0; కమున్‌గోజి 8-0-34-1; సికందర్ రజా 3-0-19-0; మసకద్జ 1-0-6-0.


 జింబాబ్వే ఇన్నింగ్స్: చిబాబ (సి) డుమిని (బి) తాహిర్ 64; రజా (బి) ఫిలాండర్ 5; మసకద్జ (సి) ఆమ్లా (బి) తాహిర్ 80; టేలర్ (సి) ఫిలాండర్ (బి) మోర్కెల్ 40; విలియమ్స్ (సి) డి కాక్ (బి) డుమిని 8; ఎర్విన్ (సి) డి  విలియర్స్ (బి) స్టెయిన్ 13; చిగుంబురా (రనౌట్) 8; మిరే (సి) డి విలియర్స్ (బి) ఫిలాండర్ 27; పన్యాంగర (సి) డి విలియర్స్ (బి) తాహిర్     4; చటారా (సి అండ్ బి) మోర్కెల్ 6; కమున్‌గోజి నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (48.2 ఓవర్లలో ఆలౌట్) 277.


 వికెట్ల పతనం: 1-32; 2-137; 3-191; 4-214; 5-218; 6-236; 7-240; 8-245; 9-272; 10-277.
 బౌలింగ్: ఫిలాండర్ 8-0-30-2; మోర్కెల్ 8.2-1-49-2; స్టెయిన్ 9-0-64-1; బెహర్డీన్ 5-0-40-0; డుమిని 8-0-45-1; తాహిర్ 10-0-36-3.
 

మరిన్ని వార్తలు