ముప్పు తిప్పలు పెట్టి.. మూడంకెల స్కోరు!

1 Dec, 2019 12:31 IST|Sakshi

సెంచరీతో ఇరగదీసిన యాసిర్‌ షా

అడిలైడ్‌:  ఆసీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో పాకిస్తాన్‌ సీనియర్‌ స్పిన‍్నర్‌ యాసిర్‌ షా ఇప్పటివరకూ నాలుగు వికెట్లు మాత్రమే తీసి నాలుగు వందలకు పైగా పరుగులిచ్చి చెత్త గణాంకాలు నమోదు చేశాడు. దాంతో యాసిర్‌ షాను పాక్‌ మాజీలు ఏకిపారేశారు. అదే యాసిర్‌ షాలో కసిని పెంచిందేమో.. ఏకంగా సెంచరీతో సమాధానం చెప్పాడు.  తాను పరుగులు ఇవ్వడమే కాదు.. పరుగులు కూడా చేయలగను అని బ్యాట్‌తోనే అందుకు బదులిచ్చాడు. పాకిస్తాన్‌ జట్టు కష్టాల్లో పడ్డ సమయంలో శతకంతో మెరిశాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఆసీస్‌ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. చివరకు మూడంకెల స్కోరు నమోదు చేసి ఇది తన పవర్‌ అని నిరూపించుకున్నాడు.

పాక్‌ ఆటగాడు బాబర్‌ అజామ్‌(97) తృటిలో సెంచరీని కోల్పోతే, యాసిర్‌ షా మాత్రం శతకం సాధించాడు.  ఏడో వికెట్‌కు అజామ్‌తో కలిసి 105 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన యాసిర్‌ షా.. మహ్మద్‌ అబ్బాస్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను పునః నిర్మించాడు. ఈ క్రమంలోనే 192 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో సెంచరీ మార్కును చేరాడు. యాసిర్‌ షాకు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం.  యాసిర్‌ షా రాణించడంతో పాకిస్తాన్‌ తేరుకుంది. 87 ఓవర్లు ముగిసే సరికి ఎనిమిది వికెట్లు కోల్పోయి 273 పరుగులతో ఉంది.

అంతకుముందు 96/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన పాకిస్తాన్‌కు బాబర్‌ అజామ్‌ ఆదుకునే యత్నం చేశాడు. యాసిర్‌ షాతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని సాధించాడు.  కాగా, అజామ్‌ ఏడో వికెట్‌గా ఔటై తృటిలో సెంచరీ కోల్పోయాడు. అజామ్‌ 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌ చేరాడు. స్టార్క్‌ బౌలింగ్‌లో పైన్‌కు క్యాచ్‌ ఔటయ్యాడు. అనంతరం షాహిన్‌ ఆఫ్రిది గోల్డెన్‌ డక్‌ అయ్యాడు.దాంతో స్టార్క్‌ ఖాతాలో ఆరో వికెట్‌ చేరగా,  పాకిస్తాన్‌ 194 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ను కోల్పోయింది. అటు తర్వాత యాసిర్‌ షా- మహ్మద్‌ అబ్బాస్‌లు  స్కోరు బోర్డును కాస్త గాడిలో పెట్టారు.

>
మరిన్ని వార్తలు