ఆ రజతం వాళ్ల దగ్గరే ఉంచండి

1 Sep, 2016 08:52 IST|Sakshi
ఆ రజతం వాళ్ల దగ్గరే ఉంచండి

రెజ్లర్ కుదుఖోవ్ మరణంతో అతని కుటుంబం బాధలో ఉంది
భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ అభ్యర్థన 


న్యూఢిల్లీ: లండన్ ఒలింపిక్స్‌లో తాను గెలిచిన కాంస్య పతకంతో సంతృప్తిగా ఉన్నానని... రష్యా దివంగత రెజ్లర్ బెసిక్ కుదుఖోవ్ డోప్ పరీక్షలో విఫలమైనప్పటికీ... అతని రజత పతకం వెనక్కి తీసుకొని తనకు ఇవ్వాల్సిన అవసరం లేదని భారత స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్ (యుడబ్ల్యూడబ్ల్యూ), అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధికారులకు విజ్ఞప్తి చేశాడు. మానవతా దృక్పథంతో వ్యవహరించి కుదుఖోవ్ కుటుంబ సభ్యుల వద్దే ఈ రజత పతకం ఉండేలా చూడాలని 2012 లండన్ ఒలింపిక్స్‌లో 60 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గిన యోగేశ్వర్ దత్ అన్నాడు.

‘రజత పతకం వెనక్కి తీసుకుంటే కుదుఖోవ్ కుటుంబానికి బాధ కలుగుతుంది. పతకం రూపంలోనైనా కుదుఖోవ్ తల్లిదండ్రులకు తమ కుమారుడి జ్ఞాపకాలు మిగిలి ఉంటారుు. 2013 డిసెంబరులో కుదుఖోవ్ కారు ప్రమాదంలో చనిపోయాడని తెలిసింది. ఒకవేళ అతను బతికిఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ అతను ఈ లోకంలో లేడు. నిన్ననే అతని కుటుంబసభ్యులు, తల్లిదండ్రుల గురించి ఆలోచించాను. కేవలం తమ కుమారుడి జ్ఞాపకాలతోనే వారు జీవిస్తున్నారు.

కుదుఖోవ్ డోప్ పరీక్షలో విఫలమయ్యాడనేది అనవసరం. కొడుకు సాధించిన పతకం జ్ఞాపకంతో జీవిస్తున్న ఆ కుటుంబం నుంచి నేను దానిని తీసుకోదల్చుకోలేదు. రజత పతకం వారి వద్దే ఉండటం సబబుగా ఉంటుంది’ అని యోగేశ్వర్ దత్ అభిప్రాయపడ్డాడు. ‘డోప్ పరీక్షలో కుదుఖోవ్ విఫలమయ్యాక నేను సాధించిన కాంస్యం రజతం అవుతున్న వార్త విని అంతగా సంతోషపడలేదు. కుదుఖోవ్ నాకు మంచి మిత్రుడు. లండన్ ఒలింపిక్స్‌కంటే ముందు రష్యాలో నేను రెండు నెలలు ప్రాక్టీస్ చేశాను. నా కాంస్యం నా వద్దే ఉంది. ఇప్పుడు ఏ పతకమున్నా పెద్దగా తేడా ఉండదు’ అని హరియాణా పోలీసు విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న యోగేశ్వర్ అన్నాడు.

 
యోగేశ్వర్ శాంపిల్‌నూ పరీక్షిస్తారు...

లండన్ ఒలింపిక్స్ సందర్భంగా యోగేశ్వర్ దత్ వద్ద సేకరించిన డోప్ పరీక్షల ఫలితాలు క్లీన్‌గా వస్తేనే అధికారికంగా అతనికి రజత పతకం ఖరారు చేస్తారు. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) కొత్త నిబంధనల ప్రకారం అంతర్జాతీయ టోర్నీలలో క్రీడాకారుల నుంచి సేకరించిన శాంపిల్స్‌ను 10 ఏళ్లపాటు డీప్‌ఫ్రీజ్‌లో పెడుతున్నారు. తాజా టెక్నాలజీని ఉపయోగించి బీజింగ్, లండన్ ఒలింపిక్స్‌లలో క్రీడాకారుల నుంచి సేకరించిన నమూనాలను మళ్లీ పరీక్షిస్తున్నారు. ఈ పరీక్షల ద్వారానే కుదుఖోవ్ లండన్ ఒలింపిక్స్‌లో నిషేధిత ఉత్ప్రేరకాలు వాడాడని తేలింది.

మరిన్ని వార్తలు