అదుపు తప్పి డివైడర్‌పైకి వెళ్లిన కంటైనర్‌

21 Jan, 2018 09:57 IST|Sakshi

ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టిన వైనం

బస్సు కోసం నిల్చున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లిన లారీ

ఇద్దరికి తీవ్ర గాయాలు

జాతీయ రహదారిపై డేంజర్‌ జోన్ల వద్ద ఏర్పాటు చేస్తున్న వేగ నిరోధకాలు కొన్ని సార్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. పోలీసుల ఉద్దేశం మంచిదే అయినా భారీ కంటైనర్లతో వచ్చే లారీలకు వేగ నిరోధకాలు అడ్డుగోడలుగా మారి ప్రమాదానికి హేతువుగా మారుతున్నాయి. కోమర్తి వద్ద శనివారం ఇదే తరహాలో వేగనిరోధకాల వద్ద ఓ కంటైనర్‌ అదుపు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకుంది.

నరసన్నపేట: మండలంలోని కోమర్తి కూడలి వద్ద జాతీయ రహదారిపై శనివారం ఓ కంటైనర్‌ అదుపు తప్పింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మరికొందరు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. విశాఖ నుంచి బరంపురం వైపు వెళ్తున్న కంటైనర్‌ వేగనిరోధకాలను క్రాస్‌ చేస్తుండగా అదుపు తప్పి డివైడర్‌పైకి ఎక్కింది. అదే సమయంలో ఎదురుగా కోల్‌కతా నుంచి హైదరాబాద్‌ వైపునకు వస్తున్న లారీని ఢీకొట్టింది. వెంటనే లారీ బోల్తా పడి  బస్‌ కోసం రో డ్డు పక్కన నిల్చున్న వారివైపు దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గమనించిన రాజాంకు చెందిన బత్తుల వీర్రాజు పాటు మరో ముగ్గురు పరుగులు తీయగా ఉర్లాంకు చెందిన నడిమింటి గోవిందరావు దొరికిపోయాడు. ఈయనపై లారీలో ఉన్న పశువుల దాణా బస్తాలు మీద పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు.

వెంటనే క్షతగాత్రున్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కంటైనర్‌ డ్రైవర్‌ సి.యాదవ్‌కు  గాయాలయ్యాయి. రోడ్డుపై లారీ, కంటైనర్‌లు అడ్డంగా ఉండటంతో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. నరసన్నపేట సీఐ పైడిపినాయుడు, ఎస్‌ఐ నారాయణస్వామి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు