వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం

25 Nov, 2023 02:52 IST|Sakshi

తిరుపతి జిల్లాలో స్కూల్‌ బస్సును ఢీకొట్టిన కారు, నలుగురు మృతి 

కావలిలో మహిళను, కంటైనర్‌ను ఢీకొన్న కారు, ముగ్గురు మృతి 

నారాయణవనం/కావలి: తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి... తిరుపతి జిల్లా, పుత్తూరు మండలం, పరమేశ్వరమంగళానికి చెందిన రమేశ్‌ నాయుడు (60), భార్య పుష్ప (55), వదిన వనజాక్షి (60), సమీప బంధువులు భాను, శివమ్మ కారులో నిశ్చితార్థానికి చెన్నైలోని పెరంబూరు వెళ్లారు.

తిరుగు ప్రయాణంలో కారు నారాయణవనం బైపాస్‌ వద్ద వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేయబోయి,  ఎదురుగా వస్తున్న కాలేజ్‌ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో రమేశ్‌ నాయుడు, పుష్ప, వనజాక్షి, భాను అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడ్డ శివమ్మను పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరో ఘటనలో... హైదరాబాద్‌ నుంచి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కారులో తిరుమల వచ్చారు.

తిరుగు ప్రయాణంలో కారు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కావలి సమీపంలోని మద్దూరుపాడు వద్ద గడ్డిమోపుతో రోడ్డు దాటుతున్న కరకమిట్ల సుబ్బమ్మ (55)ను ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం అంతే వేగంతో ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మహంకాళి సునీత (40), డ్రైవర్‌ జీవన్‌కుమార్‌ (45) అక్కడికక్కడే మృతి చెందగా, భవాని (57), శేఖర్‌ (58) తీవ్రంగా గాయపడ్డారు.  

మరిన్ని వార్తలు