మంత్రి హెలికాప్టర్ కోసం నీరు వృధా

16 Apr, 2016 17:43 IST|Sakshi
మంత్రి హెలికాప్టర్ కోసం నీరు వృధా

ముంబై: మహారాష్ట్రలోని లాతూర్‌లో తాగేందుకు కూడా గుక్కెడు నీళ్లు దొరక్క ప్రజలు అలమటిస్తుంటే అక్కడ ఓ రాష్ట్ర మంత్రిగారి హెలికాప్టర్ దిగేందుకు అధికారులు ఏకంగా 10 వేల లీటర్ల నీటిని వినియోగించడం వివాదాస్పదమైంది. కరవు కాటకాలను ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో సమీక్షించడానికి వచ్చిన రెవెన్యూ మంత్రి ఎక్‌నాథ్ ఖడ్సే హెలికాప్టర్ కోసమే నీటిని దుర్వినియోగం చేయడం పెద్ద ఐరనీ. లాతూర్ జిల్లాలోని బెల్‌కుండ్ గ్రామానికి శుక్రవారం మంత్రి వచ్చినప్పుడు ఈ ఉదంతం చోటుచేసుకుంది. హెలికాప్టర్ వల్ల దుమ్మురేగకుండా ఉండడం కోసమే తాము నీటితో నేలను తడిపామని అధికారులు సమర్థించుకుంటున్నారు.

 నీళ్లతో హెలిపాడ్‌ను తడపకపోయినట్లయితే దుమ్మురేగి చుట్టుపక్కలున్న ప్రజలకు, హెలికాప్టర్ పెలైట్‌కు బ్రీతింగ్ సమస్యలు వచ్చేవని, పైగా ఆ సమయంలో మంత్రి కూడా అనారోగ్యంతో బాధ పడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్‌సీ షైనా వివరణ ఇచ్చారు. ఇది చిన్న విషయమని, పెద్దిదిచేసి చూపించవద్దని ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు. కరవు కాటకాలతో అల్లాడిపోతున్న లాతూరు ప్రాంతానికి ఇటీవలనే ముంబై నుంచి ఐదు లక్షల లీటర్ల మంచినీటిని రైలులో సరఫరా చేసిన విషయం తెల్సిందే. నీటి ఎద్దడి కారణంగానే మహారాష్ట్రలో తదుపరి ఐపీఎల్ మ్యాచ్‌లను బాంబే హైకోర్టు రద్దు చేసిన విషయం తెల్సిందే.

 మంత్రి ఏక్‌నాథ్ చర్య అసమంజసమని, ఇలా నీటిని వృధా చేయడానికి బదులు ఆయన రోడ్డు మార్గాన వెళ్లి ఉండాల్సిందని కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ వ్యాఖ్యానించారు. అంతలా హెలికాప్టర్‌లో వెళ్లాలనుకుంటే లాతూర్ హెలిపాడ్ 47 కిలోమీటర్ల దూరంలోనే ఉందని, అక్కడ దిగి, అక్కడి నుంచి రోడ్డు మార్గాన వెళ్లాల్సిందని ఆయన విమర్శించారు.

మరిన్ని వార్తలు