ఢిల్లీకి దీప శిబిరం

30 Jun, 2017 03:59 IST|Sakshi
ఢిల్లీకి దీప శిబిరం

దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీప మద్దతుదారులు ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రపతి, ప్రధాని, హోం శాఖ కార్యాలయాల్లో వినతిపత్రాలు సమర్పించారు. పళనిస్వామి సర్కారుపై ఫిర్యాదులు చేశారు. ప్రభుత్వాన్ని డిస్మిస్‌ చేయాలని డిమాండ్‌చేశారు. దీపకు ప్రాణహాని ఉందని, ఆమెకు భద్రత కల్పించాలని వేడుకున్నారు.
హా అందరికీ వినతి పత్రాలు.

పళని సర్కారుపై ఫిర్యాదులు
డిస్మిస్‌కు డిమాండ్‌
భద్రతకు వేడుకోలు

సాక్షి, చెన్నై : జయలలిత మరణం తదుపరి అన్నాడీఎంకే ముక్కలైన విషయం తెలిసిందే. సీఎం పళనిస్వామి, మాజీ సీఎం పన్నీరుసెల్వం, అన్నాడీఎంకే ఉపప్రధాన కార్యదర్శి దినకరన్‌ శిబిరాలు ఓవైపు సాగుతుంటే, మరోవైపు తానే మేనత్తకు నిజమైన వారసురాలు అంటూ జయలలిత సోదరుడు జయకుమార్‌ కుమార్తె దీప రాజకీయంగా ఎదిగే ప్రయత్నంలో ఉన్నారు. ఎంజీయార్, అమ్మ దీప పేరవై పేరుతో ముందుకు సాగుతున్నారు.

రాజకీయంగానే కాదు, మేనత్త ఆస్తులకు వారసురాలినని పేర్కొంటూ వివాదాలను కొని తెచ్చుకుంటున్నారు. పోయెస్‌ గార్డెన్‌ వేదికగా కొద్ది రోజుల క్రితం తనమీద దాడి కూడా జరిగినట్టు దీప ఆరోపించిన సందర్భం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో సీఎం పళనిస్వామి సర్కారు తీరును, అన్నాడీఎంకేలో సాగుతున్న పరిణామాలను, తనకు జరుగుతున్న అన్యాయాన్ని జాతీయస్థాయిలోకి తీసుకెళ్లే పనిలో దీప నిమగ్నం అయ్యారు. ప్రధాని అనుమతిస్తే కలిసేందుకు సిద్ధం అని ప్రకటించినా, అందుకు తగ్గ పిలుపు ఢిల్లీ నుంచి ఇంతవరకు రాలేదు. దీంతో తమ ఫిర్యాదులు, విజ్ఞప్తుల్ని ఢిల్లీకి వినిపించుకునేందుకు దీప మద్దతు నేతలు సిద్ధం అయ్యారు.

బిజీ బీజీగా దీప మద్దతుదారులు
దీప ప్రతినిధులుగా ఆ పేరవై కీలక నాయకుడు, న్యాయవాది పసుం పొన్‌ పాండియన్, మాజీ ఎమ్మెల్యేలు సరస్వతి రామచంద్రన్, వెంకట్‌ తదితరులు ఢిల్లీ వెళ్లారు. దీప శిబిరం వర్గాలు ఢిల్లీలో గురువారం బిజీ అయ్యాయి. అక్కడి అన్నాడీఎంకే మద్దతు తమిళుల్ని తమ వైపునకు ఆకర్షించే విధంగా ముందుకు సాగాయి. రాష్ట్రపతి , ప్ర«ధాని, హోం శాఖ కార్యాలయాల్లో వారు వినతిపత్రాలను సమర్పించారు.

సీఎం పళనిస్వామి ప్రభుత్వం అన్ని రకాలుగా పాలనాపరంగా విఫలం అయిందని అందులో వివరించారు. శాంతి భద్రతలు క్షీణించాయని,  తమిళనాడు ప్రభుత్వాన్ని డిస్మిస్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దీపకు ప్రాణహాని ఉందని, ఆమె భద్రతకు కేంద్రం చర్యలు తీసుకోవాలని విన్నవించారు. అన్నాడీఎంకేలో జరిగిన, జరుగుతున్న పరిణామాలు, రాజకీయంగా దీపను అణగదొక్కేందుకు సాగుతున్న ప్రయత్నాలు, జయలలిత ఆస్తుల వ్యవహారం తదితర అంశాలను కూడా ఆ వినతి పత్రంలో వివరించినట్టు సంకేతాలు వెలువడ్డాయి.

మరిన్ని వార్తలు