సంక్షోభ కారకులు మీరే

22 Jun, 2014 22:57 IST|Sakshi

న్యూఢిల్లీ: నగరంలో విద్యుత్ సంక్షోభానికి బీజేపీయే కారణమంటూ ఆప్ నాయకుడు అరవింద్ విమర్శనాస్త్రాలు సంధించారు. స్థానిక ఆదర్శ్‌నగర్‌వ మెట్రో స్టేషన్ సమీపంలోని మైదానంలో ఆదివారం జరిగిన ఇ-రిక్షా సంఘం సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లతో బీజేపీ కుమ్మక్కైందని ఆరోపించారు. బీజేపీ కూడా కాంగ్రెస్ సర్కారు బాటలోనే నడుస్తున్నట్టు అనిపిస్తోందన్నారు. నగరంలోని అనేక ప్రాం తాలు విద్యుత్ కోత, నీటి సమస్యల్లో చిక్కుకుపోయాయన్నారు. తన ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్సిడీలను కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. శాసనసభ ఎన్నికలకు తమ పార్టీ అన్నివిధాలుగా సిద్ధంగా ఉందన్నారు. భారీ మెజారిటీతో విజయం సాధించడం తథ్యమంటూ ధీమా వ్యక్తం చేశారు.
 
 వచ్చే ఎన్నికల్లోనూ అభ్యర్థులు వారే...
 శాసనసభ ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలనే అభ్యర్థులుగా బరిలోకి దించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి దిలీప్ పాండే వెల్లడించారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ స్క్రీనింగ్ ప్రక్రియ ఆఖరి దశలో ఉందని అన్నారు. ఇక తాము ఓడిపోయిన స్థానాల్లో కొత్త అభ్యర్థులను బరిలోకి దించుతామన్నారు. లక్ష్మీనగర్, రాజౌరీ గార్డెన్‌లలో కొత్త అభ్యర్థులే పోటీ చేస్తారన్నారు. లక్ష్మీనగర్ నియోజక వర్గానికి బహిష్కృత ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు