బళ్లారి ముద్దుబిడ్డ

8 Aug, 2019 08:25 IST|Sakshi
బళ్లారిలో సాముహిక వివాహాలు, వరమహాలక్ష్మీ పూజలో పాల్గొన్న సుష్మాస్వరాజ్‌(ఫైల్‌)

సుష్మాస్వరాజ్‌ మరణంతో బళ్లారిలో విషాదం  

జిల్లాతో అపారమైన అనుబంధం  

బళ్లారి ముద్దుబిడ్డగా కీర్తిగాంచిన బీజేపీ అగ్ర నాయకురాలు,మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ ఆకస్మిక మృతి జిల్లవాసులతో పాటు యావత్‌ కర్ణాటకలో అశేష అభిమానులకు తీవ్ర శోకాన్నిమిగిల్చింది. రాష్ట్రం నుంచి ఎంతో మంది బీజేపీ నాయకులు, అభిమానులు ఢిల్లీకి వెళ్లి ఆమెకు నివాళులర్పించారు.కన్నడనాటతో బలమైన అనుబంధం ఉన్న ఆమె అస్తమయం బళ్లారి ప్రాంతానికి తీరనిలోటుగా అభిమానులు ఆవేదనచెందుతున్నారు.

సాక్షి, బళ్లారి:   రాష్ట్రంలో, ముఖ్యంగా బళ్లారిలో బీజేపీకి, నాయకులకు సుష్మాస్వరాజ్‌ వెన్నుదన్నుగా ఉండేవారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో అనుకోని విధంగా కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ బళ్లారి నుంచి పోటీ చేయడంతో ఆమెపై పోటీకి సుష్మాస్వరాజ్‌ సై అన్నారు. దీంతో బళ్లారిలో ఒక్కసారిగా బీజేపీకి గట్టి పునాది ఏర్పడింది. మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీరాములు, హరపనహళ్లి ఎమ్మెల్యే గాలి కరుణాకరరెడ్డి, బళ్లారి సిటీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డిలు ఆ ఎన్నికల్లో సుష్మాస్వరాజ్‌ వెంట నడిచి ఆమె గెలుపునకు తీవ్రంగా కృషి చేశారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ గాలి వీయడంతో పాటు సోనియాగాంధీ గెలుపొందడంతో సుష్మాస్వరాజ్‌ ఓటమి చెందారు.  ఆమె ఓటమి పాలైనా నిరుత్సాహ పడక బళ్లారిపై అమితమైన ప్రేమను పెంచుకున్నారు. 

పేదల పెళ్లిళ్లకు పెద్ద అతిథి
 
ఈక్రమంలో గాలి సోదరులు, శ్రీరాములుకు సుష్మాస్వరాజ్‌ అండ లభించింది. సుష్మస్వరాజ్‌ను గాలి జనార్దనరెడ్డి, శ్రీరాములు తల్లిగా భావిస్తూ ఆమెకు అమితమైన గౌరవం ఇవ్వడంతో పాటు ఆమె ఆధ్వర్యంలో బళ్లారిలో ఏటా వరమహాలక్ష్మీ పూజను చేయడం ప్రారంభించారు. 2000 సంవత్సరం నుంచి బళ్లారిలో వరమహాలక్ష్మీ వ్రతం రోజున గాలి కుటుంబం జరిపించే ఉచిత సామూహిక వివాహాల్లో సుష్మాస్వరాజ్‌ పాల్గొంటూ వేలాది పేద జంటలకు ఆశీస్సులు అందించారు. 2008లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి కూడా సుష్మాస్వరాజ్‌ ఎంతో కృషి చేశారు. సుష్మాస్వరాజ్‌ ఇక లేరన్న వార్త బళ్లారిలో ప్రతి ఒక్కరిని కలిచివేసింది. 

మరిన్ని వార్తలు