చిక్కుల్లో ఎమ్మెల్యేలు

23 Feb, 2015 03:32 IST|Sakshi
చిక్కుల్లో ఎమ్మెల్యేలు

సాక్షి, చెన్నై:  అన్నాడీఎంకేతో వైర్యం ఏర్పడ్డ నాటి నుంచి డీఎండీకే వర్గాలు సంక్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. ఏ చిన్న వ్యాఖ్య చేసినా, ఆరోపణలు గుప్పించినా పరువు నష్టం దావాలు దాఖలవుతూ వచ్చాయి. అసెంబ్లీలో ఆ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ పర్వం కొనసాగుతూనే ఉంది.  ఈ ఏడాది తొలి అసెంబ్లీ సమావేశం గత వారం ఆరంభమైంది. ఈ సమావేశాల్లో భాగంగా గురువారం వివాదం రాజుకుంది. తమ గళాన్ని నొక్కేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన డీఎండీకే సభ్యులు అధికార పక్షంతో గట్టిగానే ఢీ కొట్టారు.

అసెంబ్లీ వేదికగా వివాదం ముదరడంతో మార్షల్స్ ద్వారా బయటకు వారిని స్పీకర్ ధనపాల్ గెంటించారు. అలాగే, క్రమ శిక్షణ చర్యగా తాజా సమావేశాలు, తదుపరి సమావేశాలకు వారిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. చివరకు తగ్గిన స్పీకర్ ధనపాల్ ఈ సమావేశాలకు మాత్రమే సస్పెండ్ చేస్తున్నట్టు మరుసటి రోజు ప్రకటించారు. సస్పెన్షన్‌లో సవరణలు జరిగినా, డీఎండీకే ఎమ్మెల్యేలకు అసలు చిక్కంతా మార్షల్స్ రూపంలో కాచుకు కూర్చుంది.
 
చిక్కుల్లో...ముగ్గురు టార్గెట్
బయటకు గెంటివేసే క్రమంలో డీఎండీకే ఎమ్మెల్యేలు మార్షల్స్‌తో ఢీ కొట్టారు. ఈ క్రమంలో విజయన్ అనే సబ్ ఇన్‌స్పెక్టర్ గాయ పడ్డారు. ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ద్వారా డీఎండీకే ఎమ్మెల్యే భరతం పట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అదే సమయంలో, డీఎండీకే సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సచివాలయం పోలీసులకు అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ ఫిర్యాదు చేయ డం చర్చనీయాంశంగా మారింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సబ్ ఇన్‌స్పెక్టర్ విజయన్‌ను సచివాలయం పోలీసులు శనివారం సాయంత్రం కలుసుకుని వివరణ తీసుకున్నారు. సంఘటన ఎలా జరిగింది, దాడి చేసిన ఎమ్మెల్యేల వివరాల్ని సేకరించారు.

జమాలుద్దీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎండీకే ఎమ్మెల్యేలు మోహన్ రాజ్, శేఖర్, దినకరన్‌లపై కేసుల నమోదుకు ప్రయత్నాలు వేగవంతం చేశారు. నగర కమిషనర్ జార్జ్‌తో సచివాలయం పోలీసులు సమావేశమై కేసుల నమోదుకు సంబంధించి చర్చించడం గమనార్హం. వీరిపై ఎలాంటి సెక్షన్లను నమోదు చేయాలోనని న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ప్రభుత్వ  ఉద్యోగిని తన విధుల్ని నిర్వర్తించకుండా అడ్డుకోవడం, దాడి చేయడం వంటి సెక్షన్లను నమోదు చేయడానికి సచివాలయం పోలీసులు సిద్ధం అయ్యారని సమాచారం. అయితే, సోమవారం అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు కావడంతో మరుసటి రోజు డీఎండీకే ఎమ్మెల్యేల భరతం పట్టేవిధంగా కేసుల నమోదు, అరెస్టులకు కార్యాచరణ సిద్ధం చేసినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి.

మరిన్ని వార్తలు