Sakshi News home page

ఇక పేదల ఇళ్ల స్థలాలకూ  ‘భూదాన్‌’ భూములు

Published Sun, Oct 1 2023 4:56 AM

solution to the age old Bhoodan Act problems - Sakshi

సాక్షి, అమరావతి: పేదలకు మేలు చేయడమే లక్ష్యంగా భూములకు సంబంధించి పలు చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం భూదాన్‌ బోర్డు విషయంలోనూ అదే ఒరవడిని కొనసాగించింది. భూదాన్‌ బోర్డుకి సైతం పేదలకు ఇళ్ల స్థలాలిచ్చే అధికారాన్ని ఇచ్చింది. ఇందుకోసం 1965 ఏపీ భూదాన్, గ్రామదాన్‌ చట్టాన్ని సవరించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశా­ల్లో ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందింది.

భూస్వాములు తమకున్న భూమిలో కొంత పేదలకు ఇవ్వాలని కోరుతూ 1950వ దశకంలో గాంధేయవాది ఆచార్య వినోబా భావే భూదాన్‌ ఉద్యమాన్ని చేపట్టారు. ఆయన స్ఫూర్తితో దేశ­వ్యాప్తంగా పలువురు భూమిని దానం చేశారు. ఇలా సంపన్నులు దానం చేసిన భూములను పేదలకు పంచే విధానాన్ని సూచిస్తూ కేంద్రం భూదాన్, గ్రామదాన్‌ చట్టాన్ని రూపొందించగా దానికి అను­గు­ణంగా ఆయా రాష్ట్రాలు చట్టాలను చేసుకున్నా­యి. మన రాష్ట్రం కూడా 1965లో ఏపీ భూదాన్, గ్రామదాన్‌ చట్టాన్ని చేసింది. దాని ప్రకారం భూ­దాన్‌ యజ్ఞ బోర్డును నియమించి దాని ద్వారా భూదాన్‌ భూములకు సంబంధించిన వ్యవహారాలు నడిపారు.

2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోని భూదాన్‌ భూముల పరిస్థితి అగమ్యగోచరంగా మా­రింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని భూముల వ్యవ­హారాలన్నింటినీ పరిష్కరించేందుకు ఒక క్రమ­పద్ధతిలో పనిచేస్తున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం భూ­దాన్‌ భూముల విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా భూదాన్‌ యజ్ఞ బోర్డు చైర్మన్‌ను నియమించింది. అలాగే భూదాన్‌ భూముల సమస్యలను పరిష్కరించడంతో పాటు వాటి ద్వారా పేదలకు ప్రయోజనం కలిగించే ఉద్దేశంతో తాజాగా భూదాన్‌ చట్టాన్ని సవరించింది. ఆచార్య వినోబా భావే లేకపోతే ఆయన నామినేట్‌ చేసిన వ్యక్తి సూచనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు భూదాన్‌ బోర్డు చైర్మన్, వైస్‌ చైర్మన్, సభ్యులను నియమించాలి. 

ఇవీ సవరణలు

  •  గత చట్టంలో భూదాన్‌ భూమిని వ్యవసాయం, ప్రభుత్వం, స్థానిక సంస్థలు, సామాజిక ప్రయోజ­నాల కోసం ఉపయోగించాలని నిర్దేశించారు. 
  • తాజా సవరణలో సామాజిక ప్రయోజనంతో­పాటే బలహీనవర్గాలు, పేదల ఇళ్ల స్థలాల కోసం భూమిని కేటాయించే అధికారాలను భూదాన్‌ బోర్డుకి ఇచ్చారు. 
  • గతంలో ఇళ్ల స్థలాలకు కోసం భూదాన్‌ భూము­ల­ను వినియోగించే అవకాశం ఉండేది కాదు. ఇ­ప్పు­డు వాటికి వినియోగించే అవకాశం ఏర్పడింది. 
  • వినోబా భావే మృతి చెందిన 41 సంవత్సరాలు దాటిపోవడంతో ఆయన ఎవరిని నామినేట్‌ చేశారనే దానిపై స్పష్టత లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని ఒకటి, రెండు సంస్థలు భూదాన్‌ బోర్డులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడడంతో పలు రాష్ట్రాలు చట్టాలను సవరించుకున్నాయి. ఇప్పుడు మన రాష్ట్రంలోనూ ప్రభుత్వమే భూదాన్‌ బోర్డు చైర్మన్, వైస్‌ చైర్మన్, సభ్యులను నియమించేలా చట్టంలో మార్పు చేశారు. 
  • భూదాన్‌ భూమిని పొందిన వ్యక్తి వరుసగా రెండు సాగు సంవత్సరాలు వ్యవసాయం చేయక­పోతే ఆ భూమిని స్వాధీనం చేసుకునే అధికారంతోపాటు భూమి పొందిన వ్యక్తి కాకుండా వేరే వ్యక్తులు భూమిపై ఉన్నప్పుడు వారి నుంచి భూమిని తిరిగి తీసుకునే అధికారాన్ని తహసీల్దా­ర్‌కు ఇస్తూ ఇప్పుడు చట్టంలో అవకాశం కల్పించారు. తద్వారా అన్యాక్రాంతమైన భూదాన్‌ భూ­ము­­లను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు వీలు ఏర్పడింది. 
  • అర్బన్‌ ప్రాంతాల్లో వ్వవసాయం చేయకుండా ఆగిపోయిన భూదాన్‌ భూములను వ్యవసాయే­తర ప్రయోజనాలకు వినియోగించుకునే అవకా­శాన్ని చట్టంలో కల్పించారు. 

పేదలకు ఇంకా మంచి చేయాలని
సీఎం వైఎస్‌ జగన్‌ ఎప్పుడూ పేదల గురించే ఆలోచిస్తారనడానికి ఈ చట్ట సవరణ ఒక ఉదాహరణ. భూదాన్‌ భూముల సమస్యలను పరిష్కరించడంతో పాటు వాటి ద్వారా పేదలకు ఇంకా మంచి చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ భూముల వివరాలన్నింటినీ సేకరిస్తున్నాం. సీఎం ఆలోచనలకు అనుగుణంగా భూదాన్‌ భూములపై నిర్ణయాలు తీసుకుంటాం. – తాడి విజయభాస్కర్‌రెడ్డి, ఛైర్మన్, ఏపీ భూదాన్‌ యజ్ఞ బోర్డు

Advertisement

What’s your opinion

Advertisement