బ్యాంకును మోసం చేసిన 39 మందిపై కేసు

22 May, 2014 23:13 IST|Sakshi

ఠాణే: తప్పుడు పత్రాలతో 3.7 కోట్ల రూపాయలు రుణంగా తీసుకుని వాహనాలు కొనుగోలు చేసిన ఓ ఆటోమోబైల్ డీలర్‌తోసహా 39 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఠాణేలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర జోనల్ కార్యాలయం చీఫ్ మేనేజర్ ఎన్.ఎ.దుసానే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫిర్యాదులోని వివరాల ప్రకారం... 2013 సెప్టెంబర్‌లో డోంబివిలీ బ్రాంచ్ అత్యధిక వాహన రుణాలు ఇచ్చింది.

అధికారులు విచారించగా 2012లో సునీల్ మదాల్కర్ అనే వ్యక్తి కారు కొనుగోలు కోసం 14 లక్షల రూపాయలు రుణం తీసుకున్నట్టుగా తేలింది. ఈ డబ్బును మౌలీ ఆటోమోటివ్ ఖాతాలో జమ చేశారు. అయితే అందులో పొందుపరిచిన కొటేషన్స్, దస్తావేజులు అన్నీ నకిలీవని తేలింది. అయితే మదాల్కర్ అనే వ్యక్తి వాహనాన్ని కొనుగోలు చేసినట్టు ఎలాంటి పత్రాలు బ్యాంకుకు సమర్పించలేదు. దీంతో విచారించగా తేలిందేమంటే మదాల్కర్ అనే వ్యక్తి అసలు కారే కొనుగోలు చేయలేదు.

 మౌలీ ఆటోమోటివ్ యజమాని నితిన్ పి డోంగ్రేతో కుమ్మక్కై నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకుకు 14లక్షల రూపాయలు నష్టం కలిగించినట్లు పోలీసులు తెలిపారు. ఇదే విధంగా మరో 37 మంది వ్యక్తులు ఆటోమోబైల్ డీలర్లతో కుమ్కక్కై బ్యాంక్‌ను మోసగించారని వెల్లడైంది. మదాల్కర్, డోంగ్రేలతో పాటు మరో 37 మందిపై మోసం, నకిలీ పత్రాల సృష్టి, సంబంధిత ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన ఠాణే పోలీసు ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు చేస్తోంది.

>
మరిన్ని వార్తలు