ఢిల్లీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం నేతల లాబీయింగ్ షురూ! | Sakshi
Sakshi News home page

ఢిల్లీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం నేతల లాబీయింగ్ షురూ!

Published Thu, May 22 2014 11:04 PM

BJP leaders  lobbying on  Delhi  president Post

సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న హర్షవర్ధన్ చాందినీచౌక్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందడం, మోడీ మంత్రి మండలిలో ఆయనకు చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో హర్షవర్ధన్ స్థానం కోసం పార్టీలో లాబీయింగ్ జోరందుకుంది. మంత్రిమండలిలో హర్షవర్ధన్‌కు చోటుదక్కితే ఆయన జాతీయ రాజకీయాలకే పరిమితం కావాల్సి వస్తుందని, దీంతో ఢిల్లీ బీజేపీ అధ్యక్ష పదవి ఖాళీ అవుతుందని భావిస్తున్న బీజేపీ నేతలు అధ్యక్ష పదవిని తమకు ఇవ్వాలని పార్టీ అధిష్టానం వద్ద లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. ముందుగా అధ్యక్ష పీఠం దక్కితే ఆ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా చెబుతున్నారు. ఈ అభిప్రాయంతో ఉన్న నేతల్లో దాదాపు అరడజను మంది ఢిల్లీ బీజేపీ అధ్యక్షపదవి కోసం లాబీయింగ్ కూడా ప్రారంభించినట్లు సమాచారం.
 
 వీరిలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన జగ్‌దీశ్ ముఖీ, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ప్రవేశ్ వర్మ, మాజీ ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా, ఢిల్లీ బీజేపీ ఉపాధ్యక్షుడు ఆశీష్ సూద్, ఢిల్లీ మాజీ మేయర్ ఆర్తీ మెహ్రా, పృథ్వీరాజ్ సహానీ, విజయ్ జోలీలతోపాటు సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ సతీష్ ఉపాధ్యాయ తదితరుల పేర్లు  వినిపిస్తున్నాయి. పార్టీ అగ్రనేతలు, ఆర్‌ఎస్‌ఎస్ నేతలను సంప్రదించి కొత్త అధ్యక్షుణ్ని నియమించనుండడంతో పార్టీ అధ్యక్షపీఠం దక్కించుకోవాలనుకుంటున్న బీజేపీ నేతలు ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయం కేశవ్‌కుంజ్ చుట్టూ, బీజేపీ అగ్రనేతల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. వీరిలో  జగ్‌దీశ్ ముఖీకి, ప్రవేశ్ వర్మకు అవకాశాలు అధికంగా ఉన్నాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎన్నికలలో సత్తా నిరూపించుకున్న ఈ ఇరువురికీ ఆర్‌ఎస్‌ఎస్ అండదండలు కూడా ఉన్నాయంటున్నారు. అనుభవజ్ఞుడైన నేతను ఎంపికచేయాలనుకుంటే  జగ్‌దీశ్ ముఖీని, యువనేతను ఎంపిక చేయాలనుకుంటే ప్రవేశ్ వర్మను ఢిల్లీ బీజేపీ అధ్యక్షపీఠంపై కూర్చోబెట్టే అవకాశం ఉందంటున్నారు.
 

Advertisement
Advertisement