‘ఆప్’కు ఊపు

4 Aug, 2014 22:32 IST|Sakshi
‘ఆప్’కు ఊపు

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఊహించని రీతిలో ఘోరపరాజయం తర్వాత డీలాపడిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఆదివారం నాటి ర్యాలీ నూతనోత్సాహాన్ని ఇచ్చింది. జంతర్‌మంతర్ వద్ద జరిగిన  ర్యాలీకి పెద్ద ఎత్తున మద్దతుదారులు హాజరుకావడంతో తమ నేత ఆరవింద్ కేజ్రీవాల్‌పై జనానికి మక్కువ తగ్గలేదన్న నమ్మకం ఆ పార్టీ నాయకులకు కలిగింది. గతంలో మాదిరిగానే గోడలు, చెట్లు, పార్క్ చేసిన వాహనాలపై ఎక్కి మరీ జనం కేజ్రీవాల్‌ను చూసేందుకు పోటీపడటం ఆప్ కార్యకర్తలలో ఆనందాన్ని నింపింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆప్‌కు గట్టి మద్దతు ఇచ్చిన ఆటోడ్రైవర్లు ఈ సభకు భారీ సంఖ్యలో హాజరుకావడం విశేషం. అయితే ‘ఇండియా అగెనెస్ట్ కరప్షన్’ ఆందోళన సమయం నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు ఆప్‌కు వెన్నెముకగా నిలిచిన కాలేజీ విద్యార్థులు , మధ్యతరగతి ఓటర్లు ఆదివారం నాటి ర్యాలీలో కనిపించలేదు.
 
 యూపీఎస్‌ఈ విద్యార్థులు మినహా ఈ సభకు పెద్దగా విద్యార్థులు  హాజరుకాకపోవడం ఆప్‌కు కొంత నిరాశను కలిగించింది. కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసినప్పటినుంచి మధ్య తరగతి వర్గీయుల్లో ఆప్ మద్దతుదారుల సంఖ్య తగ్గిందని పార్టీ నేతలు సైతం అంగీకరించారు. ఏదేమైనప్పటికీ జంతర్‌మంతర్ ర్యాలీకి  జనాలు భారీ సంఖ్యలో రావడం, ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి కేజ్రీవాల్ పొరపాటు చేసినప్పటికీ నిజాయితీపరుడైన కేజ్రీవాల్ మరోసారి అధికారంలోకి తప్పక వస్తారని గట్టిగా చెప్పడం, ధరల పెరుగుదలను అదుపులో పెట్టలేకపోయినందుకు బీజేపీని తప్పుపట్టడం ఆప్‌కు కొత్త బలాన్ని ఇచ్చింది. ఇదిలా ఉండగా, ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీలకు ఈ ర్యాలీ గుబులు పట్టుంచింది.  జనాల ఆదారణ కోల్పోయి బలహీనపడిందనుకున్న ఆప్‌కు పేదలు ముఖ్యంగా ఆటోవాలాలు, రిక్షావాలాలు, రోడ్డుపక్కన సామగ్రి అమ్ముకునేవారి మద్దతు తగ్గలేదన్న విషయాన్ని గుర్తించిన ప్రతిపక్షాలు ఆందోళ చెందాయి.
 
 ఆప్ ర్యాలీకి వచ్చిన వారంతా తమంతట తాము వచ్చిన వారు కాదని, వారిని ఇతర ప్రాంతాల నుంచి బస్సుల్లో తరలించారని కొందరు ప్రతిపక్షనేతలు ఆరోపించారు. ఇల్లు అలికినంత మాత్రాన పండుగ కాదని, ఒక్క సభకు జనం వచ్చినంత మాత్రాన ఆమ్ ఆద్మీ పార్టీకి మంచి రోజులు వచ్చాయనుకుంటే పొరపాటేనని, అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే కేజ్రీవాల్ ఇంకా ఎంతో శ్రమపడాల్సి ఉందని, ఎన్నో వర్గాలను తమవైపు మళ్లీ తిప్పుకోవలసిన అవసరం ఉందని  రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉంటే అనధికార కాలనీ క్రమబద్ధీకరణ కుంభకోణంలో మాజీ సీఎం షీలా దీక్షిత్ పేరును బయటికి వచ్చినా కేంద్రం స్పందించకపోవడంపై ఆప్ మండిపడింది. తక్షణం ఆమెను గవర్నర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది.
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు