సినిమా టికెట్ల ధరలపై విధివిధానాలేమిటి?

7 Jan, 2016 02:11 IST|Sakshi

 ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
 తమిళసినిమా: సినిమా టికెట్ల ధర నిర్ణయంలో అమలు పరుస్తున్న విధి విధానాలేమిటన్నది రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. దేవరాజన్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా వ్యాజ్యం దాఖలు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ సినిమా టికెట్ల ధరలను చట్ట ప్రకారం మహానగరాల్లో అత్యధికంగా 50 రూపాయలు, నగర ప్రాంతాల్లో 40 రూపాయలు, గ్రామపంచాయతీల్లో 25 రూపాయలుగా నిర్ణంచబడిందన్నారు. అలాంటిది వాస్తవంగా ఆ ధరలకు రెండింతలకు పైగా థియేటర్లలో టికెట్ల ధరలను వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.
 
 సమీపకాలంలో తాను ఒక సినిమాను చూశానని అక్కడ టికెట్ ధరను 120 రూపాయలు వసూలు చేస్తున్నారని తెలిపారు.ఈ విషయమై ఆ థియేటర్ నిర్వాహకులను ప్రశ్నించగా వారు సరైన బదులు ఇవ్వలేదన్నారు.ప్రభుత్వానికి పిర్యాదు చేసినా తగిన చర్యలు తీసుకోలేదని అన్నారు.కాబట్టి తన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.ఆ పిటీషన్ చెన్నై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సంజయ్‌కిషన్ కౌల్, పుష్పా సత్యనారాయణల సమక్షంలో బుధవారం విచారణకు వచ్చింది.సినిమా టికెట్ ధరల పట్టిక విషయమై అవలంబిస్తున్న విధి విధానాలేమిటన్నది రెండు వారాల్లో హైకోర్టుకు వివరించాలని రాష్ట్రప్రభుత్వానికి న్యాయమూర్తులు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.         

మరిన్ని వార్తలు