నింగికేగిన ‘నిధి’

9 Aug, 2018 03:51 IST|Sakshi
బుధవారం చెన్నై మెరీనా బీచ్‌ వద్ద కరుణానిధి అంత్యక్రియలకు హాజరైన జనసందోహం. (ఇన్‌సెట్‌లో) కరుణ పార్థివదేహం

అధికారిక లాంఛనాలతో కరుణ అంత్యక్రియలు

కన్నీటి సంద్రమైన మెరీనా తీరం 

హాజరైన ప్రధాని మోదీ, కేసీఆర్‌ సహా పలువురు సీఎంలు  

లక్షలాదిగా తరలివచ్చిన అభిమానులు

పోటెత్తిన చెన్నై రైల్వే స్టేషన్‌

కలైజ్ఞర్‌ ఇక లేరన్న వార్తను తట్టుకోలేక 20 మంది మృతి 

రాజాజీ హాల్‌ వద్ద తొక్కిసలాటలో ముగ్గురు మృత్యువాత

సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘ఇక సెలవ్‌..’ అంటూ తిరిగిరాని లోకాలకు తరలిపోయిన కలైజ్ఞర్‌ కరుణానిధికి తుదిసారి నివాళులర్పించేందుకు హాజరైన అభిమానులతో మెరీనా తీరం కన్నీటి సంద్రమైంది. అశ్రునయనాలు, బరువెక్కిన గుండెలతో, సైనిక లాంఛనాల మధ్య తమిళనాడు రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి అంతిమ సంస్కారాలు బుధవారం చెన్నైలో పూర్తయ్యాయి. సరిగ్గా సాయంత్రం 4 గంటలకు కరుణ పార్థివదేహం రాజాజీహాల్‌ నుంచి మెరీనాబీచ్‌ వైపు సాగింది. ప్రజలు పెద్దఎత్తున అనుసరించడంతో భౌతికకాయం అంతిమ సంస్కార ప్రాంతానికి 6.15 గంటలకు చేరుకుంది. దారిపొడవునా ప్రజలు కరుణను తలచుకుని విలపించారు. కరుణానిధి ఇక లేరన్న వార్తను తట్టుకోలేక తమిళనాడులో 20 మంది చనిపోగా రాజాజీహాల్‌ వద్ద జరిగిన  తొక్కిసలాటలో మరో ముగ్గురు మృతి చెందారు. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు సహా 26 మంది గాయపడ్డారు. కరుణానిధి మరణవార్త విని తిరువారూరు జిల్లాకు చెందిన గోవిందరాజ్‌ (60) అనే వీరాభిమాని వంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మాహుతి యత్నం చేశాడు. 

బారులు తీరిన అభిమానులు...: సుమారు ఏడాదిన్నరకు పైగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న కరుణానిధి మంగళవారం సాయంత్రం కన్నుమూయటంతో తమిళనాడు యావత్తూ తల్లడిల్లింది. కరుణ పార్థివదేహాన్ని తొలుత బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు రాజాజీ హాల్‌కు తరలించారు. త్రివిధ దళాలకు చెందిన అధికారులు జాతీయ పతాకాన్ని ఆయన భౌతికకాయంపై కప్పారు. కలైజ్ఞర్‌ను తుదిసారిగా చూసేందుకు తమిళనాడు నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, పుదుచ్చేరి, మహారాష్ట్రల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. కిలోమీటర్ల పొడవునా క్యూలో నిల్చుని కరుణకు కడసారి నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి బుధవారం ఉదయం చెన్నైకి చేరుకున్న రైళ్లన్నీ డీఎంకే అభిమానులు, కార్యకర్తలతో నిండిపోయాయి. బుధవారం తమిళనాడులో రాష్ట్రవ్యాప్తంగా వాహనాల రాకపోకలు స్తంభించాయి. వ్యాపార సంస్థలు, సినిమా హాళ్లు, హోటళ్లు, మాల్స్‌ మూతపడ్డాయి. ఆటోలు కూడా ఆగిపోయాయి. 

కన్నీరు మున్నీరైన కరుణ కుటుంబం: కరుణానిధి భౌతికకాయం వద్ద కుటుంబ సభ్యులంతా విషణ్ణ వదనాలతో నిలుచున్నారు. అళగిరి, స్టాలిన్, కనిమొళి తదితరులంతా శాశ్వత నిద్రలో ఉన్న తండ్రిని చూసి కన్నీరు మున్నీరయ్యారు. కొద్ది గంటలపాటు నిబ్బరంగా ఉన్న స్టాలిన్‌ మధ్యాహ్నం సమయంలో దుఃఖాన్ని ఆపుకోలేక విలపించారు. కరుణను కడసారి చూసేందుకు వస్తున్న వివిధ పార్టీల నేతలను ఒకవైపు పలకరిస్తూనే కన్నీటి పర్యంతమయ్యారు. మెరీనా బీచ్‌లో కరుణ సమాధికి స్థలం కేటాయించాలని కోర్టు ఆదేశించినట్లు తెలియగానే అశ్రు నయనాలతో అందరికీ నమస్కరించారు. 

హాజరైన పలువురు ప్రముఖులు: ప్రధాని మోదీ ఉదయం 11 గంటలకు చెన్నై విమానాశ్రయం నుంచి నేరుగా రాజాజీహాల్‌కు చేరుకున్నారు. కరుణకు నివాళులర్పించిన అనంతరం స్టాలిన్, కనిమొళిలను ఓదార్చారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పొన్‌ రాధాకృష్ణన్, ఏఐసీసీ అధ్యక్షుడు  రాహుల్‌గాంధీ, తమిళనాడు గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్, ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, స్పీకర్‌ ధనపాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, డిల్లీ, కర్నాటక ముఖ్యమంత్రులు చంద్రబాబు, కె.చంద్రశేఖర్‌రావు, నారాయణస్వామి, కేజ్రీవాల్, కుమారస్వామి, మాజీ ప్రధాని దేవేగౌడ, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ తంబిదురై, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్, బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్, తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు  పి.చిదంబరం, రాష్ట్ర అధ్యక్షులు తిరునావుక్కరసర్, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ అజాద్‌ నివాళులర్పించిన వారిలో ఉన్నారు. 

బందోబస్తులో 1.20 లక్షల మంది పోలీసులు
కలైజ్ఞర్‌ అంతిమ సంస్కారాల సమయంలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్రవ్యాప్తంగా 1.20 లక్షల మంది పోలీసులను మోహరించారు. చెన్నై గోపాలపురంలోని కరుణ నివాసం వద్ద పారామిలటరీ దళాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో బస్సుల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, మాల్స్‌ మూతపడ్డాయి. 

‘కాగితం’ ప్లాన్‌కు అనుగుణంగానే..
చెన్నై: మెరీనా బీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలకు మద్రాస్‌ హైకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం ఈ కేసు విచారణ సందర్భంగా డీఎంకే నేత ఆర్‌ఎస్‌ భారతి.. కరుణానిధి అంత్యక్రియలను ఎక్కడ చేయాలనుకుంటున్నారో ఓ కాగితం మీద గీసిన ప్లాన్‌ను న్యాయస్థానానికి అందించారు. డీఎంకే వ్యవస్థాపకుడు సీఎన్‌ అన్నాదురై, మాజీ సీఎం జయలలిత స్మారకాల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో కరుణ అంత్యక్రియలు జరుపుతామని వెల్లడించారు. దీనికి ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. గాంధీ మండపం సమీపంలో కరుణ అంత్యక్రియలతో పాటు స్మారకం ఏర్పాటుకు రెండు ఎకరాల స్థలం కేటాయించామన్నారు. అయితే ద్రవిడ ఉద్యమం, దాని భావజాలానికి సంబంధం లేని వ్యక్తులకు అక్కడ అంత్యక్రియలు నిర్వహించారని డీఎంకే న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కాగితంలో పేర్కొన్నదానికి అనుగుణంగానే కరుణ అంత్యక్రియలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ న్యాయవాది వ్యక్తం చేసిన అభిప్రాయాలను తోసిపుచ్చింది. 

జననంలోనూ మరణంలోనూ ఒకే నక్షత్రం, ఒకే వారం
తిరువొత్తియూరు (చెన్నై): సాధారణంగా మనిషికి వేర్వేరు వారాలు, నక్షత్రాల్లో జనన, మరణాలు సంభవిస్తుంటాయి. లక్షల మందిలో ఏ ఒక్కరికో జననం, మరణం ఒకే వారం, ఒకే నక్షత్రంలో సంభవిస్తుంది. కరుణానిధికి జననంలోనూ, మరణంలోనూ ఒకే నక్షత్రం, ఒకే వారం రావడం విశేషం. ఆయన 1924 జూన్‌ 3న జన్మించారు. ఆ రోజు మంగళవారం కాగా, నక్షత్రం మృగశిర. ఆయన మరణించిన వారం, నక్షత్రం అవే కావడం విశేషం.

పితృ సమానులు: సోనియా
రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి తనకు పితృసమానులని సోనియా గాంధీ పేర్కొన్నారు. అలాంటి గొప్పవ్యక్తిని కోల్పోవడం తనకు వ్యక్తిగతంగా పూడ్చలేని లోటన్నారు. ఈయన మార్గదర్శకత్వం లేకపోతే దేశం మరింత పేదరికంలోకి కూరుకుపోయుండేదని.. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌కు రాసిన లేఖలో సోనియా పేర్కొన్నారు. రాజకీయ ప్రపంచంలో కరుణ ఓ గొప్ప శిఖరమని ఆమె ప్రశంసిచారు. తమిళ ప్రజలకు, భారతీయులకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ఆమె లేఖలో పేర్కొన్నారు. ‘కరుణ మృతి నాకు వ్యక్తిగతంగా పెద్ద లోటు. నాపై ఆయన చూపిన ప్రేమాభిమానాలను ఎన్నటికీ మరువలేను. నాకు ఆయన పితృసమానులు’అని సోనియా ప్రశసించారు. 

కరుణకు పార్లమెంటు నివాళి
న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి పార్లమెంటు బుధవారం ఘనంగా నివాళులర్పించింది. అనంతరం ఉభయ సభలను ఆయన గౌరవార్థం వాయిదా వేశారు. సాధారణంగా సిట్టింగ్‌ ఎంపీ మరణిస్తేనే సంతాపం తెలిపి సభను వాయిదా వేస్తారు. కరుణానిధి ప్రస్తుత సభలో సభ్యుడు కాకపోగా, గతంలోనూ ఆయన ఎప్పుడూ ఎంపీగా పనిచేసింది లేదు. తన సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని తమిళనాడు శాసనసభకే ఆయన పరిమితం చేసుకున్నారు. అయినా సంప్రదాయాన్ని పక్కనబెట్టి బుధవారం కరుణానిధికి ఉభయ సభల్లోనూ నివాళులర్పించిన అనంతరం పార్లమెంటు వాయిదా పడింది. సభ ప్రారంభానికి ముందే కరుణానిధికి గౌరవ సూచకంగా సభను వాయిదా వేసే విషయమై రాజ్యసభ అధ్యక్షుడు వెంకయ్య వివిధ పార్టీల నేతలను సంప్రదించారు. కరుణానిధి దేశ రాజకీయాల్లోనే ఉద్దండుడంటూ సభను వాయిదా వేసేందుకు నేతలందరూ అంగీకరించారు. ఈ నిర్ణయానికి ప్రభుత్వం అనుకూలంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌ కుమార్‌ కూడా వెల్లడించారు. కరుణానిధి గొప్ప దార్శనికత ఉన్న ప్రజా నేత అని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కొనియాడారు. 

మనస్సాక్షినే నమ్ముతాను..
‘ఎంజీఆర్‌ సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత కూడా  మా మధ్య స్నేహం కొనసాగింది. ఇద్దరం వేరు వేరు పార్టీలకు నాయకులమైనప్పటికీ స్నేహితుల్లా  మసలుకున్నాం. ఎంజీఆర్‌ తర్వాత, ఆ పార్టీ నాయకత్వం మమ్మల్ని ద్వేషించడం మొదలెట్టింది. కామరాజ్‌ – నేనూ దోస్తులమే. మాజీ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి భక్తవత్సలంతోనూ స్నేహం చేశాను. ఆర్‌ వెంకటరామన్‌ ఇప్పటికీ నా స్నేహితుడే (2007 నాటికి). తమిళనాడులో ఏఐఏడీఎంకే అని పిలవబడే పార్టీని మినహాయిస్తే, మిగిలిన వారితో మాకు మంచి స్నేహమే వుంది’ అని 2007లో ఓ వార్తా ్తసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరుణ చెప్పారు. 
‘నా మనస్సాక్షినే నేను నమ్ముతాను. నా దైవం అదొక్కటే’ అంటారు కరుణ. 

కరుణతో వాజ్‌పేయ్‌ బాగుండేవారు. ‘మా బంధం గట్టిగా ఉండడానికి  మురసోలి మారన్‌ ఒకానొక కారణం’ అని కరుణ ఒక సందర్భంలో చెప్పారు. (వాజ్‌పేయ్‌ ప్రభుత్వంలో మారన్‌ కేబినెట్‌ మంత్రి పనిచేశారు. ఇప్పుడు లేరు)) ఈ నేతలిద్దరూ ఎమర్జెన్సీ కాలంలో  ఒకే వేదికపై ప్రసంగాలు చేశారు. 

రాముడు నాకు శత్రువు కాదు..
వాల్మీకి రామాయణాన్నీ, తులసీ రామాయణాన్నీ చదివాను. పలు రామాయణాల్లో మాదిరిగానే తులసీ రామాయణంలో సీత రాముడి  చెల్లెలు. వాల్మీకి రామాయణంలో మాత్రం ఆమె రాముడికి భార్య. ఆర్యులు – ద్రవిడుల మధ్య జరిగిన యుద్ధం ఆధారంగా రామాయణాన్ని రచించారు. రాముడు ఓ కల్పిత పాత్ర.  జవహర్‌లాల్‌ నెహ్రూ కూడా రాముణ్ణి నాయకుడిగానే చూశారు. దేవుడిగా కాదు. సి. రాజగోపాలచారి రచించిన ‘చక్రవర్తి తిరుమగల్‌’ పుస్తకం ప్రకారం – రాముడు యువరాజు. దేవుడు కాదు. రాముడికి నేను శత్రువును కాను.  ముస్లింలు / క్రైస్తవులు పండుగల వేళ ఆహ్వానిస్తే వెళతాం. అలాగే హిందువులూ ఆహ్వానిస్తే ఎందుకెళ్లం? అందులో తప్పేం లేదు కదా!.. 
– 2007లో కరుణానిధి ఇచ్చిన ఇంటర్వ్యూల నుంచి..

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా