ప్రజానాడి తెలిసిన సర్పంచ్‌.. ఈ డాక్టరమ్మ

6 Jan, 2020 08:16 IST|Sakshi
అశ్వినీ

చిన్న వయసులో భారీ మెజారిటీతో గెలుపు

ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన తెలుగు యువతి

ప్రజలకు సేవ చేయాలనే తపన.. పుట్టిన ఊరికి  ఏదో చేయాలనే ఆశ తనను డాక్టర్‌ వైపు అడుగులు వేయించాయి. అనుకున్న లక్ష్యంతో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేశారు.ఎలాంటి రాజకీయ అనుభవం లేకున్నా ధైర్యంగా బరిలోకి దిగారు. అతి పిన్న వయసులోనేఅశ్విని(22) సర్పంచ్‌గా గెలిచిఅందరి దృష్టిని ఆకర్షించారు.  

తమిళనాడు ,తిరువళ్లూరు: రోగుల నాడి పట్టడానికి ఎంబీబీఎస్‌ చదివిన తెలుగమ్మాయి.. ప్రజల సంక్షేమం కోసం ప్రజానాడి పట్టి సర్పంచ్‌గా భారీ మోజారిటీతో విజయం సాధించింది. తిరువళ్లూరు జిల్లా కొత్తగుమ్మిడిపూండికి చెందిన వ్యాపారి సుకుమారన్, రాజమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె అశ్విని(22) ప్రాథమిక విద్యాభ్యాసాన్ని వేళమ్మాల్‌ పాఠశాలలో పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచే సామాజిక సేవపై ఆసక్తిని కనబరిచే అశ్విని విద్యతో పాటు ఇతర కార్యక్రమాల్లో సైతం చురుగ్గా ఉండేది. ఆమె ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు సైతం ప్రోత్సహించారు. ఈ నేపథ్యంలో వైద్యవిద్యను ఎంచుకుని నలుగురికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఎంబీబీఎస్‌లో చేరారు. తెలంగాణా రాష్ట్రం మహబూబాబాద్‌లోని ఎస్వీఎస్‌ మెడికల్‌ కళాశాలలో గత ఏడాది ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేశారు. తన సమీప ప్రత్యర్థిపై 2,550 ఓట్ల భారీ మోజారిటీతో గెలిచి అందరి దృష్టినీ ఆకర్షించారు. చిన్న వయసులోనే సర్పంచ్‌గా మారిన డాక్టర్‌గా అభినందనలు అందుకుంటున్నారు.

మౌలిక సదుపాయాల కల్పనకుప్రాధాన్యత
స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్తగుమ్మిడిపూండి సర్పంచ్‌గా విజయం సాధించిన డాక్టర్‌ అశ్వినీని సాక్షి పలకరించింది. ఈ సందర్భంగా తన మనోగతాన్ని పంచుకున్నారు. “నా సొంత గ్రామమైన  కొత్తగుమ్మిడిపూండికి ఏదో చేయాలన్న తపనతోనే రాజకీయాల్లోకి వచ్చాను. పంచాయతీ అధ్యక్ష పదవికి నామినేషన్‌ దాఖలు చేసి ప్రచారంలోకి దిగాను. ప్రచారంలోకి వెళ్లిన నాకు అపూర్వ స్వాగతం లభించింది. గ్రామంలోని సమస్యలను వివరిస్తూనే నాపై ఆదరణ చూపి భారీ మోజారీటితో గెలిపించారు. కొత్తగుమ్మిడిపూండిలో రాజకీయ ఉద్దండులను ఓడించి ప్రజలు నాకు ఈ పదవి కట్టబెట్టారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తాను. ఆదర్శ అధ్యక్షుడిగా పేరుతెచ్చుకోవడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తా. ముఖ్యంగా గ్రామంలో రోడ్డు మరమ్మతులు, తాగునీటి సమస్య, రేషన్‌దుకాణంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటలూ డాక్టర్‌లు  అందుబాటులో ఉండేలా చూస్తాను. ప్రజలకు సేవచేస్తూనే పీజీ పూర్తి చేస్తాను. గ్రామస్తులందరికీ ఉచిత వైద్య సేవలు అందిచడానికి కృషి చేస్తానని చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు