మిర్చి.. మిర్చి.. మిర్చిలాంటి రైతు

18 Sep, 2018 06:23 IST|Sakshi
పంట చూసి మురిసిపోతున్న రైతు నాగరాజు

బతుకులో తీపి నింపిన మిరపకాయ సాగు

4 నెలల్లో ఖర్చు రూ.5 లక్షలు, ఆదాయం రూ.20 లక్షలు

దొడ్డబళ్లాపురం : హుక్కేరి తాలూకాలో హిరణ్యకేశి, ఘటప్రభా నదులు ప్రవహిస్తున్నా అనేక గ్రామాలకు సాగునీరు అందడంలేదు...ఈ గ్రామాలపైకి రక్షి గ్రామం కూడా ఒకటి. రక్షి గ్రామం హిరణ్యకేశి నదికి కేవలం మూడు కిలోమీటర్ల దూరం ఉంది. అయితే ఈ నది వర్షా కాలంలో మాత్రమే ప్రవహిస్తుంది కాబట్టి ఈ ప్రాంతాల రైతులు సాధారణంగానే కూరగాయలు పండించడానికి సాహసించరు. అయితే రైతు నాగరాజు హుండేకార మాత్రం సాహసించారు. పచ్చి మిరప పండిస్తూ మిగతా రైతులకు ఆదర్శంగా నిలిచారు. నాగరాజుకు మొత్తం 5 ఎకరాల భూమి ఉంది. కానీ ఎత్తైన ప్రదేశంలో ఉంది. అందులో నాలుగు ఎకరాల్లో సోనల్‌ అనే రకం మిరపకాయలు సాగు చేస్తున్నాడు. మిగతా ఎకరా భూమిలో గ్రీన్‌హౌస్‌ నిర్మించి పలు రకాల కూరగాయలు పండిస్తున్నాడు. కూరగాయలు పండించడం కోసమే రైతు నాగరాజు తన భూమిలో బోర్‌వెల్‌ తవ్వించాడు. అయితే నీరు పడలేదు. డబ్బులు మాత్రం ఖర్చయ్యాయి. అయినా ఆత్మస్థైర్యంతో దూరంగా తగ్గు ప్రదేశంలో కాస్త భూమి తీసుకుని బోర్‌వెల్‌ వేయించాడు. అక్కడ నీరు పడడంతో అక్కడి నుండి పైపు లైను ద్వారా పంటకు నీరు కడుతున్నాడు.

పంట వేయడానికి ముందు
మిరపకాయ మొక్కలు నాట్లకు ముందు నాలుగు ఎకరాలకు గాను 10 టన్నుల కొట్టం ఎరువు, మూడు లారీల బూడిద ఎరువు వేయించాడు.  మట్టిలో ఎరువులు బాగా కలిసేలా భూమిని దున్ని, తరువాత ఫాస్పెట్‌ రీచ్, ఆర్గానిక్‌ మెన్యూర్‌ (ఎకరాకు 500 కేజీలు), 40కేజీల సల్ఫ ర్, 60కేజీల వేపపిండి,సూక్ష్మ పోషకాంశాలు గల ఎరువు, వినికామ్‌ (ఎకరాకు 2 కేజీలు) మట్టిలో కలపడం జరిగింది. మొక్కలునాటాక అమోనియం సల్ఫేట్‌ చల్లడం జరిగింది. మొక్కలు పెరిగే కొద్దీ నిత్యం డ్రిప్‌ ద్వారా నీటితో ఎరువు అందించాడు. గత 4 నెలలుగా మిరప పంట కోత కోయిస్తున్నాడు. మొదట కేజీకి రూ.15 నుండి రూ.20 మాత్రమే లభించేది.

అయితే ఇప్పుడు రూ.30ల వరకూ ధర పలుకుతోంది. ఇప్పటి వరకూ మొత్తం రూ.5 లక్షలు ఖర్చుకాగా 80 టన్నుల మిరప పంట దిగుబడి వచ్చింది. రూ.20 లక్షల దాకా ఆదాయం వచ్చిందిట. ఇంకా 20 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందంటున్నాడు నాగరాజు. పంట బాగా పండటంతో వ్యాపారులు తోట వద్దకే వచ్చి ఖరీదు చేస్తున్నారని రైతు సంతోషం వ్యక్తం చేశాడు. 

మరిన్ని వార్తలు