ఆగని ఆత్మహత్యలు

27 Jun, 2015 04:49 IST|Sakshi
ఆగని ఆత్మహత్యలు

- మైసూరులో మరో రైతన్న బలవన్మరణం   
- పంట పొలాల్లోనే నేలకొరుగుతున్న అన్నదాతలు
సాక్షి, బెంగళూరు:
నేల తల్లినే నమ్ముకున్న అన్నదాతలు చివరకు ఆ తల్లి ఒడిలోనే కుప్పకూలిపోతున్నారు. ప్రాణానికి ప్రాణంగా కాపాడుకుంటూ వచ్చిన పంటపొలాల్లోనే బలవన్మరణానికి పాల్పడుతున్నారు. అప్పుల బాధలను తాళలేక పంటకు అంటించిన నిప్పుల్లోనే మండ్యకు చెందిన  రైతు నింగేగౌడ గురువారం సజీవదహనం కాగా, మైసూరుకు చెందిన మరో రైతు శివలింగేగౌడ సైతం అప్పుల బాధ తట్టుకోలేక శుక్రవారం మధ్యాహ్న సమయంలో తన పంటపొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

మైసూరు జిల్లా నంజనగూడులోని సిద్దగుండినహుండి గ్రామానికి చెందిన రైతు శివలింగేగౌడ చెరకు, వరి పంటలను పండిస్తున్నారు. వ్యవసాయం కోసం దాదాపు రూ.5 లక్షల వరకు అప్పులు చేశారు. చెరకు పంటకు చెల్లించాల్సిన బకాయిలు చక్కెర ఫ్యాక్టరీల యాజమాన్యాలు చెల్లించకపోవడంతోపాటు, ప్రస్తుతం పండిం చిన చెరకును సరైన ధరకు అమ్ముకునే పరిస్థితులు కనిపించకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో శివలింగేగౌడ ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం తన పంట పొలానికి చేరుకున్న శివలింగేగౌడ పంట కోసం వినియోగించే పురుగులమందును తా గి ప్రాణాలు వి డిచారు. పొలానికి వెళ్లిన శివలింగేగౌడ ఎంతకూ రాకపోవడంతో కంగారు పడ్డ అతని కుటుంబసభ్యులు పొలానికి వెళ్లి చూడగా అక్కడ అచేతన స్థితిలో పడి ఉన్న శివలింగేగౌడను గుర్తించి పోలీసులకు సమాచారాన్ని అందజేశారు.
 
నెలకు ఇద్దరు అన్నదాతలు

ఇక కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో మొత్తం 58 మంది అన్నదాతలు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. అంటే సగటున నెలకు ఇద్దరు అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడినట్లు లెక్క. ఈ గణాంకాలు ఇటీవల జరిగిన విలేకరుల సమావేశంలో స్వయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణబేరేగౌడ వెల్లడించినవే. ఇక రెండేళ్లలో 58 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు.

గత నెల రోజుల్లోనే మొత్తం 19 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు కోడిహళ్లి చంద్రశేఖర్ చెబుతున్నారు. రైతుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోందని అందువల్లే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
నింగేగౌడ కుటుంబానికి నేతల ఓదార్పు
అప్పుల బాధతో చెరుకు పంటకు నిప్పుపెట్టి అదే పంటలోకి దూకిన రైతు నింగేగౌడ నివాసానికి అనేక మంది నేతలు తరలివచ్చారు. మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడతో పాటు మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప తదితరులు శుక్రవారం ఉదయం నింగే గౌడ నివాసానికి చేరుకొని నింగేగౌడ కుటుంబసభ్యులను ఓదర్చారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ మాట్లాడుతూ, ‘చెరకు రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడతాం.

ఇక ముందు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. అంతేకాక రైతులు కూడా తమ కుటుంబ సభ్యుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండాలని కోరుతున్నాను’ అని అన్నారు. ఇదే సందర్భంలో నింగేగౌడ కుటుంబానికి రూ.1లక్ష సహాయాన్ని దేవేగౌడ ప్రకటించారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప మాట్లాడుతూ, నింగేగౌడ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం రూ.5లక్షల నష్ట పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో రైతు సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు