పళని తంత్రం, దినకరన్‌ గప్‌చుప్‌!

3 Jul, 2017 08:07 IST|Sakshi
పళని తంత్రం, దినకరన్‌ గప్‌చుప్‌!

పన్నీరు సందిగ్ధం
ఇక, ఆ ముగ్గురే

తనకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న వారి నోళ్లకు తాళం వేయడం లక్ష్యంగా సీఎం పళని స్వామి రాజకీయ తంత్రాన్ని ప్రయోగించే పనిలో పడ్డారు. దినకరన్‌ మద్దతు ఎమ్మెల్యేలు గప్‌చుప్‌మని శనివారం సీఎం ఎదుట కూర్చోవడం ఇందుకు నిదర్శనం. ఇక, వివాదం రాజుకుంటుందని ఎదురుచూసిన పన్నీరు శిబిరం చివరకు సందిగ్ధంలో పడక తప్పలేదు.

సాక్షి, చెన్నై: అమ్మ జయలలిత మరణం తదుపరి అన్నాడీఎంకే ముక్కలైన విష యం తెలిసిందే. మాజీ సీఎం పన్నీరు సెల్వం వెంట కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు కదిలారు. చిన్నమ్మ, తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ ఆదేశాలతో మిగిలిన వాళ్లు సీఎం పళని స్వామి వెన్నంటే ఉన్నా, తదుపరి పరిణామాలతో అక్కడినుంచి జారుకున్న వాళ్లు పెరిగారు.

వీరంతా ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ పక్షాన చేరారు. సీఎం పళని స్వామికి వ్యతిరేకంగా స్వరాన్ని పెంచి మరీ  విరుచుకుపడే పనిలో పడ్డారు. ఈ పరిణామాలు కాస్త సీఎం పళని స్వామిని ఇరకాటంలో పెట్టాయని చెప్పవచ్చు. ఈ సమయంలో రాష్ట్రపతి ఎన్నికలు రావడంతో కేంద్రం మెప్పుపొందే రీతిలో పళని స్వామి అడుగులు వేశారు. బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. మాజీ సీఎం పన్నీరు కూడా కోవింద్‌కే మద్దతు అన్నారు. అయిష్టంగా దినకరన్‌ వర్గం కూడా మద్దతు ప్రకటించింది.

పళని మార్క్‌
పాలనపరంగా తన మార్క్‌ పడే రీతిలో ముందుకు సాగుతున్న పళని స్వామి, పార్టీలోనూ పట్టు సా«ధించే పనిలో ఉన్నారు. అయితే, తనకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు 34 మంది గళం విప్పడంతో వారిని దారిలోకి తెచ్చుకునేందుకు రాజకీయ తంత్రాన్ని ప్రయోగించినట్టున్నారు.

దినకరన్‌కు మద్దతుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలు అడపాదడపా బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలా..? అన్నట్టుగా స్పందిస్తుండటంతో రాత్రికి రాత్రే వారి నోళ్లకు తాళం వేయడం గమనించాల్సిన విషయం. చెన్నైలో మద్దతు సేకరణకు వచ్చిన బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి రామనాథ్‌ కోవింద్‌ సమక్షంలో దినకరన్‌ మద్దతు ఎమ్మెల్యేలు తమ గళాన్ని విప్పే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే, గప్‌చుప్‌మని కూర్చొని సీఎం పళని స్వామి ప్రసంగాలకు చప్పుట్లు కొట్టి ఆహ్వానించడం విశేషం.

అంతా పళని దారికొస్తారా..?
దినకరన్‌ మద్దతు ఎమ్మెల్యేలను అణచివేసే రీతిలో సీఎం తన తంత్రాన్ని ప్రయోగించడంతోనే వారంతా గప్‌చుప్‌ అయ్యారని అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటుండటం ఆలోచించాల్సిందే.  కాగా, కోవింద్‌ సమక్షంలో దినకరన్‌ మద్దతు ఎమ్మెల్యేలు సీఎంకు వ్యతిరేకంగా గళం విప్పతే దాన్ని తమకు అనుకూలంగా మలచుకుని కేంద్రం వద్ద మార్కులు కొట్టే వ్యూహంతో ఉన్న పన్నీరు శిబిరాన్ని ఈ గప్‌చుప్‌ సందిగ్ధంలో పడేసినట్టు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో దినకరన్‌ సీఎం వద్ద శరణు కోరే పరిస్థితులు మున్ముందు వస్తాయని, పన్నీరు శిబిరం ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం తమ వైపునకు వచ్చే సమయం ఆసన్నం అవుతోందంటూ ఓ మంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం.

ఇక ఆ ముగ్గురు ..
తమకు మిత్రపక్షంగా ఉన్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకునేందుకు పళని ప్రయత్నాల్లో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనియరసు, తమీమున్‌ అన్సారీ, కరుణాస్‌ అన్నాడీ చిహ్నం మీద గెలిచారు. ఈ ముగ్గురు  డీఎంకే వైపు తమ చూపును మరల్చేందుకు సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వీరు కోవింద్‌ మద్దతు కార్యక్రమానికి కూడా దూరంగా ఉండటంతో, ఇక, వారిని దారిలో తెచ్చుకునేందుకు పళని తంత్రాన్ని ప్రయోగించబోతున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, తలా ఓ చిన్న పార్టీకి చెందిన ఈ ముగ్గురు తలొగ్గేనా అన్నది వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు