ఇండెక్స్‌ రేట్లు మారాయి...పన్నూ తగ్గుతుంది! | Sakshi
Sakshi News home page

ఇండెక్స్‌ రేట్లు మారాయి...పన్నూ తగ్గుతుంది!

Published Mon, Jul 3 2017 12:30 AM

Index rates have changed slowing down

కేంద్రం ఇటీవల క్యాపిటల్‌ గెయిన్స్‌ లెక్కించడానికి కాస్ట్‌ ఆఫ్‌ ఇన్‌ఫ్లేషన్‌ ఇండెక్స్‌ను (సీఐఐ) అమల్లోకి తెచ్చింది. దీని వల్ల గతంలో ఉన్న ఇండెక్స్‌ రేట్లు రద్దయ్యాయి. గతంలో 1981–82 సంవత్సరాన్ని బేస్‌ ఇయర్‌గా తీసుకుని ఇండెక్స్‌ రేట్లు నిర్ణయించారు. ప్రస్తుతం 2001–02 ఆర్థిక సంవత్సరాన్ని బేస్‌ ఇయర్‌గా తీసుకున్నారు. కొత్త ఇండెక్స్‌ రేట్లు 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చాయి. ఏప్రిల్‌ 2017 నుంచి జరిగే క్రయవిక్రయాలకు ఈ రేట్లు వర్తిస్తాయి. రెండు రేట్లనూ పరిశీలిస్తే... అంకెలు మారాయి కానీ విలువలు, ద్రవ్యోల్బ ణం, ప్రభావంలో మార్పు లేదు. కొత్త రేట్ల వల్ల పన్ను భారంలో పెద్దగా మార్పుండదు. 2001–02 సంవత్సరం బేస్‌గా తీసుకోవడం వల్ల మార్కెట్‌ విలువల్లో మార్పు వస్తుంది. పన్ను భారం కొంచెం మారుతుంది. అది ఎలాగో ఈ కింది ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం...

ఒక స్థిరాస్తిని 1980 సంవత్సరంలో రూ.1,00,000 పెట్టి కొన్నాం. 01.04.1981 నాడు దీని మార్కెట్‌ విలువ రూ.2 లక్షలు అనుకోండి. ఈ ఆస్తిని 2017–18లో అమ్మేశారు. అమ్మిన విలువ రూ.80,00,000. ఇందులోంచి 1981నాటి మార్కెట్‌ విలువను పాత ఇండెక్స్‌ ప్రకారం లెక్కించాలి. అలా వచ్చిన విలువ రూ.2,00,000/100్ఠ1160= రూ. 23,20,000. దీన్ని కొన్న ధరగా భావించాలి. ఈ లెక్కల ప్రకారం ఈ వ్యవహారంలో దీర్ఘకాలిక లాభం.. రూ.80,00,000–రూ.23,20,000= రూ.56,80,000. పన్ను భారం 20 శాతం చొప్పున రూ.11,36,000. దీనికి విద్యా సుంకం అదనం.

ఈ వ్యవహారంలో 1981 నాటి మార్కెట్‌ విలువ రూ.2,00,000 అని ఊహించాం. ఈ మేరకు మనం కాగితాల ద్వారా సమర్థించుకోవాలి. రుజువులు సమకూర్చుకోవాలి. ఇలాంటి ఎన్నో సాధకబాధకాలున్నాయి. అందుకే 2001–02ను బేస్‌గా తీసుకున్నారు.

మనం 1980లో రూ.1,00,000కి కొన్న ఆస్తి మార్కెట్‌ విలువ 2001–02 లో చాలా ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా ఈ మేరకు ధ్రువీకరణ పత్రాలు, వేల్యూయేషన్‌ సర్టిఫికెట్లు, లావాదేవీల పత్రాలు సమకూర్చుకోవచ్చు. ఆవిధంగా మార్కెట్‌ విలువ రూ.10,00,000 అనుకోండి. దీనిని కొత్త ఇండెక్సింగ్‌ ప్రకారం లెక్కిస్తే..

రూ.10,00,000/100 272= రూ.27,20,000. అవకాశం ఉంటే, రుజువులుంటే ఎంతైనా విలువ తీసుకోవచ్చు. విలువ ఎంత ఎక్కువ ఉంటే మీకు అంత ఉపశమనం.

ఈ లావాదేవీలో లాభం =రూ.80,00,000–రూ.27,20,000= రూ.52,80,000. 20 శాతం చొప్పున పన్ను భారం రూ.10,56,000. దీనికి విద్యా సుంకం అదనం.

ఏదిఏమైనా కొత్త ఇండెక్సింగ్‌ ప్రకారం మూలధన లాభాలు తక్కువగా ఉంటాయి. పన్ను భారం కాస్త తక్కువవుతుంది. దీనికి ప్రధాన కారణం 2001–02ను బేస్‌ ఇయర్‌గా తీసుకోవడం. అన్ని కాగితాలు సమకూర్చుకుని, వృత్తి నిపుణుల సలహాలతో పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే ట్యాక్స్‌ప్లానింగ్‌ ద్వారా పన్ను భారం నుంచి బయట పడవచ్చు కూడా.
 

Advertisement
Advertisement