అసెంబ్లీలో అమరవీరుల విగ్రహాలు

23 Mar, 2015 22:01 IST|Sakshi

 త్వరలోనే ఏర్పాటు చేస్తాం- సీఎం కేజ్రీవాల్
 సాక్షి, న్యూఢిల్లీ:షహీద్ దివస్‌ను పురస్కరించుకుని ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ సోమవారం భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, స్పీకర్ రామ్‌నివాస్ గోయల్‌తో కలిసి ఆయన ఢిల్లీ అసెంబ్లీలో అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ, అసెంబ్లీలో అమరవీరుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని స్పీకర్ ప్రతిపాదించారని, దానిని తామంతా బలపరిచామని చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధుల గురించి విద్యార్థులకు తెలియజేయడం ద్వారా దేశభక్తిని పెంపొందించడానికి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ముగ్గురు అమరవీరుల్లో ముఖ్యంగా భగత్‌సింగ్ త్యాగాన్ని విద్యార్థుల పాఠ్యాంశాల్లో చేర్చవలసిందిగా విద్యా శాఖ మంత్రిని కోరినట్లు ఆయన చెప్పారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురును బ్రిటిష్ పాలకులు 1931, మార్చి 23న ఉరితీశారు. వారిని ఉరితీసిన రోజును అంటే మార్చి 23ను ప్రభుత్వం షహీద్ దివస్‌గా ప్రకటించి అమరులకు నివాళులను అర్పిస్తోంది. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరుల త్యాగానికి గుర్తుగా వారు అమరులైన రోజును దేశ్  దివస్‌గా జరుపుకోవాలని కేజ్రీవాల్ కోరారు. అమరవీరులకు పుష్పాంజలి సమర్పిస్తే సరిపోదని దేశాభ్యున్నతి కోసం ఏదైనా చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
 
 అంతకు ముందు ఆయన భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌కు నివాళులు అర్పిస్తూ ట్వీటర్‌లో ట్వీట్ చేశారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు విగ్రహాలను త్వరలోనే అసెంబ్లీలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ ముగ్గురు అమరులు దేశం కోసం చేసిన త్యాగాన్ని రాష్ట్ర పాఠ్యాంశాల్లో చేరుస్తామని తెలిపారు. అమరుల విగ్రహాలను సాధారణ పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో ఏర్పాటుచేయాలని అనుకోవడం లేదని ఆయన చెప్పారు. వీటిని ఏర్పాటు చేయడానికి తమ వేతనాల నుంచి కొంత మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలని ఎమ్మెల్యేలను కోరినట్లు వెల్లడించారు. తద్వారా ఎమ్మెల్యేల్లో కూడా దేశ భక్తి పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. విగ్రహాల ఏర్పాటుకు ఎంత ఖర్చవుతుందో అంచనా వేసి తెలియజేయాల్సిందిగా అసెంబ్లీ అధికారులను కోరినట్లు సిసోడియా చెప్పారు. అధికారులు రూపొందించే అంచనా వ్యయం ఆధారంగా ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత సొమ్ము విరాళంగా ఇవ్వాలనేది నిర్ణయిస్తామని ఆయన తెలిపారు.అసెంబ్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆప్ ఎమ్మెల్యేలు, ఢిల్లీ ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు దేశభక్తి గీతాలు ఆలపించారు.
 

మరిన్ని వార్తలు