కరోనాతో తమిళనాడు సీఎం పీఏ మృతి

17 Jun, 2020 13:26 IST|Sakshi

ఒకే రోజు 49 మంది మృత్యువాత

ఉత్తర చెన్నైలో మరీ ఎక్కువ

చెన్నైలో తగ్గిన కేసుల సంఖ్య 

మంత్రుల ఉరుకులు, పరుగులు

సరిహద్దుల్లో పోలీసు నిఘా

ఈ–పాస్‌ ఉంటేనే అనుమతి

సాక్షి, చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా సీఎంవో కార్యాలయంలో కరోనా వైరస్‌ కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి పళనిస్వామి వ్యక్తిగత సహాయకుడు దామోదరన్‌ కరోనా వైరస్‌తో బుధవారం మృతి చెందారు. దీంతో మిగతా ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. కాగా.. మంగళవారం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గినా, మరణాలు అమాంతంగా పెరగడం కలవరాన్ని రేపింది. ఈ ఒక్కరోజే 49 మంది మరణించారు. ఉత్తర చెన్నైలో మృత్యువాత పడ్డవారు ఇందులో మరీ ఎక్కువగా ఉన్నారు. నివారణ చర్యల్లో భాగంగా మంత్రులు ఉరుకులు, పరుగులు తీసేపనిలో పడ్డారు. లాక్‌ కఠినం కానున్న నేపథ్యంలో సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌ పోస్టులు ఏర్పాటయ్యాయి. 

రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తేదీ నుంచి పదిహేను వందల నుంచి రెండు వేలకు సమీపంలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇందులో చెన్నై కేసులు 90 శాతం మేరకు ఉంటున్నాయి. మంగళవారం చెన్నైలో కేసుల సంఖ్య తగ్గింది. 919 పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. కాగా మరణాల సంఖ్య అమాంతంగా పెరిగిపోయింది. మూడు రోజులుగా మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మూడు రోజులుగా ఈ సంఖ్య 30, 38, 44గా ఉంది. తాజాగా ఒక్క రోజులో 49 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో 35 మంది ఉత్తర చెన్నై పరిధిలో ఉన్నారు. రాయపురం, తండయార్‌పేట మండలాలు డెంజర్‌ను మించిన జోన్లుగా మారాయి. కోడంబాక్కం, తేనాంపేట, అన్నానగర్‌ మండలాలు ఆ రెండు మండలాలతో పోటీ పడుతున్నాయి. అక్కడి ప్రజల్లో ఉత్కంఠను రేపుతున్నాయి.

మరణాల పరంగా రోజురోజుకీ రికార్డు సృష్టించే విధంగా సంఖ్య పెరుగుతుండడం, ఈ సంఖ్య ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరీ ఎక్కువగా ఉండడంతో మున్ముందు కరోనా మృత్యు పంజా వేగం ఏ మేరకు పెరగనుందో అన్న ఆందోళన తప్పడం లేదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 7 లక్షల 48 వేల 244 మందికి కరోనా పరీక్ష నిర్వహించగా ఇందులో పాజిటివ్‌ కేసుల సంఖ్య 48 వేలు దాటింది. మరో ఒకటి రెండు రోజుల్లో 50 వేలకు పైగా కేసులతో దేశంలో కరోనా పాజిటివ్‌ సంఖ్యలో రెండో స్థానాన్ని రాష్ట్రం పదిలం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.  చదవండి: లాక్‌డౌన్‌ ప్రకటనతో.. కిక్కు కోసం క్యూ

మంత్రుల ఉరకులు  
చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలో పాటు కడలూరు, దిండుగల్, మదురై, నాగపట్నం, రామనాథపురం, రాణిపేట, తెన్‌కాశి, తిరువణ్ణామలై, తిరుచ్చి, వేలూరు, విల్లుపురం, తిరునల్వేలి జిల్లాల్లో రెండు అంకెల మేరకు కేసులు పెరుగుతుండడంతో అక్కడి జిల్లా యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. చెన్నై, శివార్ల నుంచి చడీచప్పుడు కాకుండా వచ్చిన వారి రూపంలోనే కేసులు పెరిగినట్టు గుర్తించారు. ఆయా జిల్లాల ఇన్‌చార్జ్‌ మంత్రులు, అధికారులు సమష్టిగా ఉరుకులు పరుగులు తీసే పనిలో పడ్డారు. చెన్నై, శివార్ల నుంచి వచ్చిన వాళ్లు ఎవరైనా ఉంటే, సమాచారం ఇవ్వాలని, పరిశోధనలు చేసుకోవాలని గ్రామ గ్రామానా ప్రజలకు పిలుపునిచ్చే పనిలో పడ్డారు. కొత్తగా కేసులు నమోదైన ప్రాంతాల్ని, గ్రామాల్ని పూర్తిగా మూసి వేసి వైద్య పరిశోధన, చికిత్స వలయంలోకి తెచ్చే పనిలో పడ్డారు. చెన్నైలో అయితే మంత్రులు జయకుమార్, ఆర్‌బీ ఉదయకుమార్, అన్భళగన్‌ మండలాల పరిధిలోని వార్డుల్లో తిరుగుతూ, శిబిరాల్లో సాగుతున్న వైద్య పరిశోధనలు, చికిత్సల మీద దృష్టిపెట్టారు.  

సరిహద్దులో చెక్‌ పోస్టులు.. క్వారంటైన్లకు 
చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లోని సరిహద్దుల్లో పలు చోట్ల అదనంగా చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. చెన్నైలోకి వచ్చేందుకు, వెళ్లేందుకు అనేక చిన్న మార్గాలు ఎక్కువే. ఎక్స్‌ప్రెస్‌ వే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కలిసి వచ్చే మార్గంగా మారింది. ఆయా చిన్న మార్గాలు, ఎక్స్‌ప్రెస్‌ వే మార్గాన్ని పోలీసులు నిఘా వలయంలోకి తెచ్చారు. చెన్నైలోకి బయటి వ్యక్తులు, కొత్త వాళ్లు రాకుండా అడ్డుకునే పనిలో పడ్డారు. చెన్నై నుంచి ఎవరైనా ఇతర జిల్లాలకు వెళ్లాంటే, ఈ పాస్‌ తప్పని సరిచేశారు. ఇది ఉంటే వాహనాలను బయటకు పంపుతున్నారు. కొందరు పోలీసుల కళ్లు గప్పి తప్పించుకునే యత్నం చేసినా, జాతీయ రహదారిలోని అన్ని టోల్‌ గేట్లు, ఆ రహదారికి అనుసంధానంగా ఉన్న అనేక మార్గాల్ని ఆయా జిల్లాలు, ప్రాంతాల పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బయటి వ్యక్తుల రూపంలో తమ ప్రాంతాల్లో కరోనా అన్నది వ్యాపించకుండా, అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. కొన్ని జిల్లాల్లో అయితే సరిహద్దుల్లోనే థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయడం, అవసరం కోరనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు తగ్గ ఏర్పాట్లు చేయడం గమనార్హం. తమ ప్రాంతాలకు కొత్తగా ఎవరు వచ్చినా నేరుగా క్వారంటైన్లకు తరలించేందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకున్నారు.

ఆ దిశగా మంగళవారం వేకువ జామున సింగపూర్‌ నుంచి 175 మందితో చెన్నైకు వచ్చిన విమానంలోని ప్రయాణికుల్ని నేరుగా క్వారంటైన్లకు తరలించారు. 30 మంది మాత్రం తాము హోటల్స్‌లో ఉంటామని పేర్కొనడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. మిగిలిన వారిని ఓ కళాశాలల ఏర్పాటు చేసిన క్వారంటైన్లో ఉంచారు. కత్తార్‌ నుంచి వచ్చిన మరో విమానంలోని 141 మంది రాగా, 137 మంది ప్రభుత్వం ఏర్పాటు చేసినక్వారంటైన్లోకి వెళ్లారు. మిగిలిన వారు హోటల్స్‌లో గదుల్ని తీసుకున్నారు. విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఎంతటి వారు వచ్చినా, ఇక క్వారంటైన్లలోకే అని అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, విదేశాల్లో తమిళులు ఎందరో చిక్కుకుని ఉన్నారని, వారందర్నీ ఇక్కడకు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ తౌఫిక్‌ జమాత్‌ నేతృత్వంలో వినూత్న రీతిలో వీడియో కాన్పరెన్స్‌ ద్వారా పలు చోట్ల నిరసనలు సాగడం గమనార్హం. చదవండి: చెన్నైలో మళ్లీ లాక్‌డౌన్

కేసుల నమోదు.. 
క్వారంటైన్ల నుంచి తప్పించుకుని బయట తిరుగున్న వారిపై కేసుల నమోదుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే హోం క్వారంటైన్లలో ఉన్న వాళ్లు పలువురు రోడ్లపై తిరుగుతున్నట్టు సమాచారం అందుకుని 40మందిపై గత వారం  కేసులు పెట్టారు. ఈ పరిస్థితుల్లో మరో 51 మందిపై మంగళవారం కేసులు నమోదయ్యాయి. అలాగే, తప్పుడు చిరునామాలు ఇచ్చి ప్రైవేటు పరిశోధనా కేంద్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్ష చేసుకుని పాజిటివ్‌ రాకతో పత్తా లేకుండా పోయిన వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఆయా పరిశోధనా కేంద్రాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా ఇప్పటి వరకు రెందు వందల మందిని గుర్తించారు. వీరికి తీవ్ర హెచ్చరికలు ఇవ్వడమే కాకుండా, హోం క్వారంటైన్లకు పరిమితం చేశారు. మరో వంద మందిని గుర్తించాల్సి ఉంది. హోంక్వారంటైన్‌లలో ఉన్న వారు 14 రోజులు ముగిసినా, వెంటనే బయటకు రాకూడదని, వైద్యులను సంప్రదించినానంతరం వారు ఇచ్చే సూచనలు, సలహాల మేరకు నడుచుకోవాలని వైద్య వర్గాలు సూచించాయి.  

మరిన్ని వార్తలు