భర్తను పట్టించిన ‘టిక్‌టాక్’

3 Jul, 2019 15:03 IST|Sakshi

చెన్నై : ‘టిక్‌టాక్’ యాప్‌కు ఉన్న క్రేజ్‌ గురించి అందరికి తెలిసిందే. మారుమూల పల్లెల్లో కూడా టిక్‌టాక్‌ ప్రభావం కనిపిస్తుంది. తాజాగా ఇంటి నుంచి పారిపోయిన వ్యక్తిని టిక్‌టాక్‌ తిరిగొచ్చేలా చేసింది. ఓ మహిళ జీవితాన్ని నిలబెట్టింది. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో చోటుచేసుకుంది. అదేలా అంటే.. కృష్ణగిరికి చెందిన సురేశ్‌కు జయప్రదతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే 2016లో సురేశ్‌ తన కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడు. ఆ తర్వాత తిరిగి రాలేదు. భర్త కనిపించకుండా పోవడంతో జయప్రద తీవ్ర మనోవేదనకు గురయ్యారు. భర్త ఆచూకీ కోసం అతని స్నేహితులను, బంధువులను అడిగిచూసింది. అయినా లాభం లేకపోయింది. దీంతో జయప్రద పోలీసులను ఆశ్రయించారు. జయప్రద ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేపట్టినప్పటికీ పురోగతి కనిపించలేదు.

అయితే ఇటీవల జయప్రద  బంధువు ఒకరు సురేశ్‌ పోలికలతో ఉన్న వ్యక్తిని ఒక టిక్‌టాక్‌ వీడియోలో చూశారు. ఈ విషయాన్ని జయప్రదకు చెప్పగా.. ఆ వ్యక్తి సురేశ్‌ అని ఆమె నిర్ధారణకు వచ్చారు. ఈ విషయాన్ని ఆమె పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు హోసూర్‌లో సురేశ్‌ను గుర్తించారు. ‘సురేశ్‌ కుటుంబ సమస్యల కారణంగా ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం హోసూర్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు, అక్కడ ఒక ట్రాన్స్‌ఉమెన్‌తో కలిసి సురేశ్‌ జీవనం సాగిస్తున్నారు. సదురు ట్రాన్స్‌ ఉమెన్‌తో కలిసి చేసిన టిక్‌టాక్‌ వీడియోలోనే సురేశ్‌ బంధువులు అతన్ని గుర్తించారు. సురేశ్‌కు, జయప్రదకు కౌన్సిలింగ్‌ ఇచ్చి వారి ఇళ్లకు పింపిచామ’ని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు