అసెంబ్లీకి ‘గుట్కా’

29 Jun, 2017 03:49 IST|Sakshi
అసెంబ్లీకి ‘గుట్కా’

నిషేధిత మత్తు పదార్థాలు (గుట్కా) అమ్మకాలకు లంచం వ్యవహారం బుధవారం అసెంబ్లీని కుదిపేసింది. చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఒత్తిడి తెచ్చినా, స్పీకర్‌ ఏమాత్రం తలొగ్గలేదు. ప్రతిపక్ష సభ్యులు, స్పీకర్‌ మధ్య తీవ్ర వాగ్వాదం సాగినా, స్పందన శూన్యం. స్పీకర్‌ తీరును నిరసిస్తూ ప్రతిపక్షాలన్నీ వాకౌట్‌ చేశాయి..
చర్చకు పట్టు
ప్రతిపక్షాల ఒత్తిడి
తగ్గని స్పీకర్‌.. వాగ్వాదం
వాకౌట్లతో నిరసన

సాక్షి, చెన్నై :
మంత్రి, అధికారుల అండతో గుట్కా  వ్యవహారంపై అసెంబ్లీలో పెద్ద ఎత్తున వాగ్వాదం చోటుచేసుకుంది. మూడురోజుల సెలవుల అనంతరం బుధవారం అసెంబ్లీ  సమావేశమైంది. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. ఆమేరకు బాణసంచా ధరల తగ్గింపు విషయంగా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామని మంత్రి జయకుమార్‌ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అలాగే, రిజిస్ట్రేషన్‌ చార్జీల తగ్గింపు కోసం అడిగిన ప్రశ్నకు మంత్రి వీరమణి సమాధానం దాటవేస్తూ ప్రసంగించారు. ప్రశ్నోత్తరాలు ముగియగానే, సభలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది.

వాగ్వాదం.. వాకౌట్‌
డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్‌ అసెంబ్లీ ముందుకు ‘గుట్కా’ లంచం వ్యవహారాన్ని తీసుకొచ్చారు. స్పీకర్‌ ధనపాల్‌ అడ్డు పడుతూ,ఇది సమయం కాదని వారించారు. డీఎంకే తరపున పది గంటల సమయంలో తనకు ఈ విషయంగా లేఖ అందిందని, అది పరిశీలనలో ఉన్నట్టు పేర్కొంటూ స్టాలిన్‌  ప్రసంగాన్ని అడ్డుకున్నారు.

ఇందుకు డీఎంకే సభ్యులు తీవ్ర ఆక్షేపణ వ్యక్తంచేస్తూ నినాదాల్ని హోరెత్తించారు. పత్రికల్లో వచ్చిన గుట్కా వ్యవహారాన్ని ప్రదర్శిస్తూ, చర్చకు పట్టుబట్టారు. మంత్రి విజయభాస్కర్, ఇద్దరు డీజీపీలపై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డారు. దీంతో సభలో పరిస్థితి గందరగోళంగా మారింది. తమ గళాన్ని నొక్కవద్దని, మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్టాలిన్‌తో పాటు డీఎంకే శాసన సభా పక్ష ఉపనేత దురై మురుగన్‌ స్పీకర్‌కు విన్నవించారు. అయితే, స్పీకర్‌ ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఇంతలో దురై మురుగన్‌ స్పీకర్‌ పోడియం ముందుకు దూసుకెళ్లారు.

దీంతో స్పీకర్‌ ఆగ్రహంతో డీఎంకే సభ్యుల్ని ఉద్దేశించి స్పందించడంతో సభలో వ్యతిరేక నినాదాలు మిన్నంటాయి. స్పీకర్, డీఎంకే సభ్యుల మధ్య వాగ్వాదం హోరెత్తింది. చివరకు గుట్కా వ్యవహారం అసెంబ్లీ ముందుంచే విధంగా స్టాలిన్‌ ప్రసంగాన్ని సాగించడం, క్షణాల్లో స్పీకర్‌ అడ్డుపడడంతో డీఎంకే సభ్యుల్లో ఆగ్రహం రేగింది. స్పీకర్‌కు వ్యతిరేకంగా నినదిస్తూ సభ నుంచి వాకౌట్‌ చేశారు. తదుపరి కాంగ్రెస్‌ శాసన సభా పక్ష నేత రామస్వామి తన ప్రసంగంలో స్పీకర్‌ తీరును తీవ్రంగా ఖండించారు. ఆయన ప్రసంగాన్ని కూడా స్పీకర్‌ అడ్డుకోవడంతో కాంగ్రెస్‌ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ ఎమ్మెల్యే అబుబక్కర్‌ సైతం సభ నుంచి వాకౌట్‌ చేశారు.

స్టాలిన్‌ ఆగ్రహం
ప్రజా సమస్యలే కాదు, కీలక వ్యవహారాల్ని సభ దృష్టికి తీసుకెళ్లినా, చర్చించే సమయం స్పీకర్‌ లేదని ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్‌ మండిపడ్డారు. ఆరోగ్య మంత్రి విజయభాస్కర్, ఇద్దరు డీజీపీల మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చి ఉంటే, వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని ధ్వజమెత్తారు. ఐటీ దాడులు హోరెత్తినా, అవినీతి ఆరోపణలు ఆధారాలతో బయటపడ్డా, ముడుపుల వ్యవహారం వెలుగులోకి వచ్చినా, ఈ పాలకులు చోద్యం చూస్తున్నారని, తమ ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడే విధంగా లంచం పుచ్చుకుని గుట్కా విక్రయాలకు అనుమతిచ్చిన  వ్యవహారంలో మంత్రిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్‌చేశారు. డీజీపీలు జార్జ్, రాజేంద్రన్‌పై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. కాంగ్రెస్‌ శాసన సభా పక్ష నేత రామస్వామి మాట్లాడుతూ, స్పీకర్‌ ప్ర«తిపక్షాల గళాన్ని నొక్కేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఢిల్లీకి నివేదిక
తమకు లభించిన డైరీలోని అంశాల ఆధారంగా ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి గుట్కా లంచం వ్యవహారాన్ని ఆదాయపు పన్ను శాఖ వర్గాలు పంపించాయి. ఇందులో గుట్కా అనుమతి వ్యవహారంతో పాటు కౌన్సిలర్‌ మొదలు మంత్రి వరకు, ఏసీ నుంచి కమిషనర్, డీజీపీ వరకు సంబంధింత సంస్థ పండుగ మాముళ్ల ఇచ్చి ఉండడాన్ని ప్రస్తావించి ఉన్నారు.

అమ్మకు స్మారక మందిరం
దివంగత సీఎం జయలలిత సమాధి వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో స్మారక మందిరం నిర్మించనున్నామని అసెంబ్లీలో సీఎం పళనిస్వామి ప్రకటించారు. సాయంత్రం ఆరు గంటల వరకు అసెంబ్లీ సమావేశం సాగగా, తన పరిధిలోని ప్రజా పనుల శాఖలో అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపుల గురించి సాయంత్రం సీఎం ప్రసంగించారు. ఇందులో దివంగత సీఎం జయలలిత సమాధి ఉన్న ప్రాంతంలో స్మారక మందిరం నిర్మించనున్నామని తెలిపారు. అలాగే, దివంగత ఎంజీయార్‌ శత జయంతి స్మారకంగా చెన్నైలోని ఓ ప్రధాన మార్గంలో భారీ ఆర్చ్‌ నిర్మించనున్నామని ప్రకటించారు.

మరిన్ని వార్తలు