బెంగళూరులో తొలి ఎస్కలేటర్ స్కైవాక్

26 Jul, 2014 03:20 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, బెంగళూరు :  స్థానిక మల్లేశ్వరంలోని రాజ్ కుమార్ రోడ్డులో ఓరియన్ మాల్ ఎదుట నిర్మించిన తొలి ఎస్కలైటర్ స్కైవాక్‌ను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ అశ్వత్థ నారాయణ, సుబ్రమణ్య వార్డు కార్పొరేటర్ శశికళ కృష్ణ గౌడ శుక్రవారం ప్రారంభించారు. రూ.2.5 కోట్ల వ్యయంతో దీనిని బ్రిగేడ్ గ్రూపు నిర్మించింది. ఈ సందర్భంగా గ్రూపు చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ ఎంఆర్. జైశంకర్ మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ పెరిగి పోతుండడంతో రోడ్లు దాటడం కష్టమవుతోందని తెలిపారు.

రద్దీ సమయాల్లో ఈ సమస్య మరీ ఎక్కువ ఉన్నందున, పాదచారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రాజ్ కుమార్ రోడ్డు కూడా దీనికి మినహాయింపు కాదన్నారు. మెట్రో, రోడ్ల విస్తరణ పనులు, వేగంగా సాగే రద్దీ ట్రాఫిక్ లాంటి కారణాల వల్ల పాదచారులు రోడ్లు దాటడానికి ఎంతో సేపు వేచి ఉండాల్సి వస్తోందని తెలిపారు.

దీనిని దృష్టిలో ఉంచుకుని బీబీఎంపీ సహకారంతో ఈ స్కైవాక్‌ను నిర్మించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే డాక్టర్ అశ్వత్థ నారాయణ మాట్లాడుతూ నిత్యం రోడ్లను దాటే పాదచారుల భద్రతను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉందన్నారు. ఈ దిశగా బ్రిగేడ్ గ్రూపు నగరంలోనే తొలిసారిగా ఎస్కలేటర్ స్కైవాక్‌ను ప్రారంభించినందుకు అభినందించారు.
 

మరిన్ని వార్తలు