పుణేకు జల గండం!

6 May, 2014 22:36 IST|Sakshi
పుణేకు జల గండం!

 పింప్రి, న్యూస్‌లైన్: పుణే వాసులకు నీటి గండం రాబోతుంది. నగర పరిధిలోని జలాశయాలు అడుగంటుతుండడంతో రాబోయే రోజుల్లో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని ఆయా ప్రాంతవాసులు ఆందోళన వ్యక్తం  చేస్తున్నారు. పుణే విభాగంలో 57 తాలూకాలలో 27 తాలూకాల భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. రాబోయే రోజుల్లో ఈ తాలూకాలలో తాగునీటి కష్టాలు ఎదురవనున్నాయి.  భూ జలాల పరిశోధన, అభివృద్ధి విభాగం జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 

‘పుణే, సతారా, సాంగ్లీ, షోలాపూర్, కొల్హాపూర్ ప్రాంతాల్లోని 57 తాలూకాలలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. పుణే జిల్లాలో 192 బావుల నీటి మట్టం పరిశీలించాం. అందులో 100 బావులలో భూగర్భ జలాలు అడుగంటాయి. జిల్లాలోని 13 తాలూకాలలోని దౌండ్, పురంధర్, ఇందాపూర్, బారామతి తాలూకాలలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. సతారా జిల్లాలో 106 బావులలో భూగర్భ జలాలను పరిశీలిస్తే 45 బావులలో జలాలు అడుగంటాయి. 11 తాలూకాలలో సతారా, కోరేగావ్, మహాబలేశ్వర్, పాటణ్, తాలూకాలలో భూగర్భ జలాలు అడుగంటాయి.

సాంగ్లీ జిల్లాలో 86 బావులలోని నీటి మట్టాలు పరిశీలించాం. 41 బావుల నీటి మట్టాలు అడుగంటిపోయాయి. పలుస్, కడేగావ్, ఖనాపూర్, శిరాళా, తాలూకాలలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. షోలాపూర్ జిల్లాలో 166 బావుల నీటి మట్టాలను పరీక్షించాం. 68 బావుల జలాలు అడుగంటాయని తేలింద’ని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఉత్తర సోలాపూర్, కరమాళా తాలూకాలలో తాగునీటి కోసం స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. కొల్హాపూర్ జిల్లాలో 58 బావులలో నీటి జలాలు అడుగంటాయి. జిల్లాలోని పన్హాళా, రాధనగరి, గడహింగ్లాజ్, కాగల్, ఆజరా, చంద్‌గడ్, హతకణంగలే తాలూకాలలో నీటి సమస్య అధికంగా ఉందని, వర్షాలు ఎంత తొందరగా కురిస్తే  సమస్య తీరే అవకాశం ఉందని సంబంధిత అధికారి తెలిపారు.

మరిన్ని వార్తలు