చేతి రాత.. గుండెకోత

30 Apr, 2017 08:45 IST|Sakshi
చేతి రాత.. గుండెకోత

► వరకట్న వేధింపులకు మహిళ బలి
► భర్త, అత్తమామల వేధింపులే కారణం
► చేతిపై ‘మరణ వాంగ్మూలం’
► తుమకూరు జిల్లా మధుగిరిలో ఘోరం

తుమకూరు(చెన్నై): కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్త, కన్నకూతురిలా ఆదరించాల్సిన అత్తమామలు కట్నం మోజులో మానవత్వాన్ని మరిచారు. కోడలిని రాచిరంపాన పెట్టి పుట్టింటికి తరిమేశారు. ఆశల జీవితాన్ని ఛిద్రం చేసిన వారి అరాచకంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. తన చావుకు భర్త, అత్తమామలే కారణమని చేతిపై మరణ వాంగ్మూలం రాసుకుని ఉరితాడుకు వేలాడింది.

ఈ ఘోరం మధుగిరిలో శనివారం చోటు చేసుకుంది. మృతురాలు హర్షిత (24). వివరాల్లోకి వెళ్తే మధుగిరి పట్టణంలోని రాఘవేంద్ర లేఔట్‌లో ఉండే పాండురంగారావు, ప్రమీళ దంపతుల కుమార్తె హర్షితను రెండేళ్ల కిందట చిత్రదుర్గకు చెందిన మురళీధర్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. అతడు తుమకూరు నగరంలోని కేఎస్‌ఆర్‌టీసీ డిపోలో మెకానిక్‌.

కట్నం కోసం నరకం
పెళ్లయిన కొద్దిరోజుల నుంచే మరిన్ని కట్నకానుకలు తేవాలని భార్యను వేధించేవాడు. అతనికి అత్త, మామ, బావ కూడా వంతపాడుతూ హర్షితను రాచిరంపాన పెట్టేవారు. వారి బాధ పడలేక ఆమె పుట్టింటికి వెళ్ళింది. పోలీసులు, పెద్దమనుషులు కలిసి పంచాయతీ చేసి భర్త వద్దకు పంపించారు. తరువాత షరా మామూలే. మళ్లీ వేధించడంతో పాటు, విడాకులు ఇవ్వాలని బలవంతంగా సంతకం తీసుకున్నారు.

మళ్లీ పుట్టింటికి వచ్చిన హర్షిత కొంతకాలంగా తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. శనివారం ఇంట్లో ఉరి వేసుకుని చనిపోవడానికి ముందు తన చేతి పైన ఆత్మహత్యకు కారణమైన వారి పేర్లను రాసింది. అందులో భర్త మురళీధర్, అత్త మంజుళ, మామ విఠల్, బావ సంతోష్‌తో కలిసి మొత్తం 7 మంది పేర్లను రాసుకుంది. విషయం తెలుసుకున్న మధుగిరి పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
 

>
మరిన్ని వార్తలు