చదువు చావుకొస్తోంది! 

16 Nov, 2019 08:37 IST|Sakshi
ఫాతిమా (ఫైల్‌ఫోటో)

చెన్నై ఐఐటీలో కొనసాగుతున్న ఆత్మహత్యల పరంపర 

నాలుగేళ్లలో తొమ్మిది మంది బలి

ఫాతిమా ఆత్మహత్యపై కొనసాగుతున్న ఆందోళన

సీఎంను కలిసిన ఆమె తండ్రి

సాక్షి, చెన్నై:  ఉన్నత విద్యకు నెలవుగా మారాల్సిన చెన్నై ఐఐటీ ఆత్మహత్యలకు కొలువుగా మారింది. 2016 నుంచి ఇప్పటి వరకు ఒక మహిళా ప్రొఫెసర్‌ సహా తొమ్మిది మంది విదారి్థనీ, విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం అందర్నీ కలవరపాటుకు గురిచేస్తోంది. కేరళ రాష్ట్రం కొల్లంకు చెందిన ఫాతిమా లతీఫ్‌ (19) ఈ ఏడాది ఆగస్టులో చెన్నై ఐఐటీలో చేరింది. మూడు నెలల్లోనే మానసిక క్షోభకు గురై ఈనెల 9వ తేదీన హాస్టల్‌ గదిలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ విషయం రాష్ట్రంలో సంచలనానికి దారితీసింది. చెన్నై ఐఐటీలో విదార్థిని, విద్యార్థులు ఆత్మహత్యకు దిగడం ఇది తొలిసారి కాదు. ఇప్పటికే ఎనిమిది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఫాతిమా ఉదంతం తొమ్మిదోది. 2016లో పీహెచ్‌డీ విద్యార్థి, ఇద్దరు డిగ్రీ విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. (చదవండి: అది ఆత్మహత్యే)

కేరళ రాష్ట్రం మలప్పురానికి చెందిన సాహుల్‌గోర్‌నాథ్‌ 2018 సెపె్టంబర్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలేజీ రిజిస్టర్‌లో హాజరీ దినాలు తక్కువయ్యాయనే ఆవేదనతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. 2018 డిసెంబర్‌లో ఐఐటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అథితి సింహ విషం సేవించి ప్రాణాలుతీసుకుంది. కుటుంబ సమస్యలే ఆమె ఆత్మహత్యకు కారణమని భావించారు. ఈ ఏడాది జనవరిలో జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన రంజనాకుమారీ అనే విద్యారి్థని, గోపాల్‌బాబు అనే విద్యార్థి వెంట వెంటనే బలవన్మరణానికి దిగారు. వేధింపుల వల్లనే రంజనాకుమారీ ఆత్మహత్య చేసుకుందని పేరుచెప్పేందుకు ఇష్టపడని సహ విద్యార్థులు తెలిపారు. ఈ కేసు విచారణలో ఇంత వరకు ఎలాంటి పురోగతీలేదు. ఇప్పటికీ ఆమె మరణం మర్మంగానే మిగిలిపోయింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎంటెక్‌ విద్యార్థి గోపాల్‌బాబు మనోవేదనతోనే తన గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

ఇలా వరుసగా ఆత్మహత్య సంఘటనలు జరుగుతున్నా ఐఐటీ యాజమాన్యం చేష్టలుడిగి చూస్తున్నట్లు దుయ్యబడుతున్నారు. ఇటీవలి కాలంలో కొత్త రిక్రూట్‌ అయిన ఉత్తర రాష్ట్రాలకు చెందిన యువ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు దక్షిణాది విద్యార్థుల పట్ల చిన్నచూపు చూస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉత్తరాది విద్యార్థులను చేరదీయడం, దక్షిణాది విద్యార్థుల పట్ల పరుషంగా ప్రవర్తించడం యువ ప్రొఫెసర్లకు పరిపాటిగా మారినట్లు విమర్శలు వస్తున్నాయి. ఐఐటీ యాజమాన్యం మాత్రం ఇదంతా క్రమశిక్షణలో భాగమేనని తేలిగ్గా తీసిపారేస్తోంది. దీంతో ఆత్మహత్యల సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. కాగా ఫాతిమా ఆత్మహత్య కేసుకు సంబంధించి విద్యార్థులు, ప్రొఫెసర్లు కలుపుకుని ఇప్పటి వరకు 24 మందిని పోలీసులు విచారించారు.

సీఎం, డీజీపీలను కలిసిన ఫాతిమా తండ్రి 
ఆత్మహత్యకు పాల్పడిన ఐఐటీ విదార్థిని ఫాతిమా తండ్రి అబ్దుల్‌ లతీఫ్‌ శుక్రవారం ఉదయం కేరళ నుంచి చెన్నైకి చేరుకున్నారు. తన కుమార్తె మరణానికి ముగ్గురు ప్రొఫెసర్లు కారణమని ఫాతిమా తన సెల్‌ఫోన్‌లో నమోదు చేసినట్లు విమానాశ్రయంలో తనను కలిసిన విలేకరులకు ఆయన చెప్పారు. కుమార్తె ఆరోపించిన ముగ్గురు ప్రొఫెసర్లపై కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సాయంత్రం సీఎం ఎడపాడి పళనిస్వామి, డీజీపీ త్రిపాఠీలను కలుసుకుని వినతిపత్రం సమర్పించారు. కుమార్తె మర్మమరణంపై తగిన విచారణ జరిపించాలని వారిని కోరాడు.

Read latest Tamil-nadu News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా