మరోసారి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సేల్స్‌

19 Jul, 2017 15:10 IST|Sakshi
మరోసారి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సేల్స్‌
ఈ-కామర్స్‌ దిగ్గజాలు అమెజాన్‌ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌లు రెండు ఒకేసారి మరో సేల్స్‌ పండుగకు తెరతీశాయి. ''బ్యాక్‌ టూ కాలేజ్‌ ల్యాప్‌టాప్‌ సేల్స్‌'' పేరుతో ఈ సేల్‌ను నిర్వహిస్తున్నాయి. సమ్మర్‌ సెలవుల తర్వాత కాలేజీలకు వెళ్తున్న విద్యార్థుల కోసం ల్యాప్‌టాప్స్‌పై పలు డీల్స్‌, ఎక్స్చేంజ్‌ ఆఫర్స్‌, నో కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్లను ఈ దిగ్గజాలు ప్రకటించాయి. ఇంటెల్‌తో రూపొందుతున్న లెనోవో, హెచ్‌పీ, డెల్‌ వంటి వాటిపై ఎక్స్చేంజ్‌ ఆఫర్లు, నో కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్లను అమెజాన్‌ ఇండియా తన సైట్‌లో ఆఫర్‌ చేస్తోంది. ల్యాప్‌టాప్‌లను కూడా విద్యార్థుల చదువుకు అనుకూలంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. హ్యుమానిటీస్‌, కామర్స్‌, ఇంజనీరింగ్‌, మెడికల్‌ స్టడీస్‌, ఎంబీఏ, డిజైన్‌, ఆర్కిటెక్చర్‌, గేమింగ్‌ వంటి సెక్షన్లకు అవసరమయ్యే ల్యాప్‌టాప్‌లు ఏమిటో వాటిని ఆయా విభాగాలుగా విభజించింది. దీంతో విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది పడకుండా.. తేలికగా తమకు కావాల్సిన ల్యాప్‌టాప్‌లను కొనుక్కోవచ్చు.
 
ఇక ధరల విషయానికి వస్తే, అమెజాన్‌ ఇండియా సేల్‌లో అత్యంత చౌకగా లిస్టు అయిన ల్యాప్‌టాప్‌ లెనోవో ఐడియాప్యాడ్‌. 15.6 అంగుళాల గల ఈ ల్యాప్‌టాప్‌, నలుపు రంగులో రూ.18,990కి అందుబాటులో ఉంది. పాత ల్యాప్‌టాప్‌తో ఎక్స్చేంజ్‌లో దీన్ని కొనుగోలు చేస్తే రూ.10వేల వరకు తగ్గింపును ఇస్తోంది. ఈ ల్యాప్‌టాప్‌ను కొంటే, రూ.4990 విలువ గల అదనంగా రెండేళ్ల వారెంటీని అమెజాన్‌ ఆఫర్‌ చేస్తోంది. 
 
అదేవిధంగా ఫ్లిప్‌కార్ట్‌ కూడా ఈ బ్యాక్‌ టూ కాలేజ్‌ సేల్‌ను నిర్వహిస్తోంది. మంగళవారం(జూలై 18) నుంచి గురువారం(జూలై 20) వరకు ఇది అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా హెచ్‌పీ ఇంప్రింట్‌ కోర్‌ ఐ3 6వ జనరేషన్‌ విండోస్‌ 10 హోమ్‌ రనింగ్‌ ల్యాప్‌టాప్‌ 35,964 రూపాయలకు లభ్యమవుతోంది. 7000 రూపాయల వరకు దీనిపై ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ ఉంది. దీంతో పాటు ఎలాంటి ఖర్చులు లేని ఈఎంఐ ఆప్షన్లను ఫ్లిప్‌కార్ట్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. అదేవిధంగా ధరల ప్రకారం కూడా ల్యాప్‌టాప్ సెక్షన్లను ఫ్లిప్‌కార్ట్‌ విభజించింది. ఏషర్‌, ఐబాల్‌, లావా వంటి బడ్జెట్‌ ల్యాప్‌టాప్‌లు తక్కువకు రూ.9999కే అందుబాటులో ఉన్నాయి. మైక్రోసాఫ్ట్‌ సర్‌ఫేస్‌ ప్రో 4 ల్యాప్‌టాప్‌పై ఫ్లిప్‌కార్ట్‌ ధరను కూడా తగ్గించింది. ఎక్స్చేంజ్‌లో 15వేల తగ్గింపును ఇస్తోంది. హెచ్‌పీ, డెల్‌, లెనోవో వంటి గేమింగ్‌ ల్యాప్‌టాప్‌లపై ఎక్స్చేంజ్‌ ఆఫర్ల కింద రూ.20వేల వరకు ఆఫర్‌ చేస్తోంది.   
 
మరిన్ని వార్తలు