108కే ఆపద

23 Sep, 2014 01:19 IST|Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ :జిల్లాలోని 108 వాహనాలకు కాంట్రాక్టు ఉన్న ఆయా డీజిల్ బంకుల యజమానులు వారం రోజులుగా డీజిల్ పోయడం లేదు. డీజిల్ నిల్వలు పూర్తిగా తగ్గిపోవడంతో ఎట్టి పరిస్థితుల్లో 10 కిలోమీటర్ల పరిధికి మించి వాహనాలను తీసుకెళ్లొద్దని ఇప్పటికే సిబ్బందికి ఆదేశాలు అందినట్లు సమాచారం. ప్రస్తుతం వాహనాల్లో ఉన్న డీజిల్ నిల్వలు కేవలం రెండు రోజులకు సరిపోవచ్చని, ఇక, ఆ తర్వాత తాము వాహనాలు బయటకు తీయలేమని సిబ్బంది కొందరు పేర్కొన్నారు. ఒక్కో డీజిల్ బంకులో కనీసం రూ.లక్ష చొప్పున బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో బంకుల యజమానులు ససేమిరా అంటున్నారు. గడిచిన మూడు నెలలుగా డీజిల్ బడ్జెట్ నయాపైస విడుదల కాలేదు. దీంతో జిల్లావ్యాప్తంగా సుమారు రూ.30ల క్షల దాకా పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన తర్వాత బడ్జెట్ విడుదల కాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు చెబుతున్నారు.
 
 అయితే, సిబ్బందికి ఇవ్వాల్సిన జీతభత్యాలను పెండింగ్‌లో పెట్టకుండా కొత్త ప్రభుత్వం చెల్లిస్తోంది. 108 సర్వీసుల నిర్వహణ బాధ్యతలు చూస్తున్న జీవీకే, ఈఎంఆర్‌ఐ సంస్థలను పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మరో వైద్యసంస్థతో ప్రభుత్వానికి ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నందున, అప్పటి దాకా 108కు బ్రేకులు తప్పవన్న అభిప్రాయం సిబ్బందిలో వ్యక్తమవుతోంది. గతంలో 150 కిలోమీటర్ల  పరిధి వర కూ వెళ్లి సేవలు అందించిన ఈ వాహనాల పరిధిని 10 కిలోమీటర్లకు కుదించడం గమనార్హం. ఇక్క ఎక్కడి వాహనాలు అక్కడికే పరిమితం కావాలని, సమీపంలోని ఆస్పత్రి వరకే తీసుకువెళ్లాలన్న నిబంధన కూడా పెట్టారని సమాచారం. గతంలో సమీప ఆస్పత్రికే వెళ్లాలన్న నిబంధన ఏదీ ఉండేది కాదు. డాక్టర్లు ఎక్కడికి రిఫర్ చేస్తే, ఆ ఆస్పత్రి దాకా బాధితులను తీసుకువెళ్లే వారు. ఇదంతా ఖర్చులు తగ్గించుకోవడం కోసమేనన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. మొత్తానికి, జరుగుతున్న పరిణామాలు 108 సేవలకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయి.  
 

మరిన్ని వార్తలు