ఏడో తరగతి పిల్లోడు.. ఇంజనీరింగ్ మాస్టారు!

1 Nov, 2018 09:29 IST|Sakshi

11 ఏళ్లకే ఇంజనీరింగ్‌ పాఠాలు చెబుతున్న హైదరాబాద్‌ బాలుడు

సాక్షి, హైదరాబాద్ : అతని వయసు 11 ఏళ్లు. ఏడో తరగతి చదువుతున్నాడు. అయితే మాకేంటి అనుకుంటున్నారా? మాములోడు అయితే మనకు అవసరం లేదు. కానీ ఈ బాలుడు సమ్‌థింగ్‌ స్పెషల్‌. పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత ఇతనికి కరెక్ట్‌గా సెట్‌ అవుతుంది. స్కూల్‌ వెళ్లి పాఠాలు వినాల్సిన వయసులో ఇంజనీరింగ్‌ విద్యార్థులకు పాఠాలు చెబుతూ అందరినీ ఆశ్చర్యాని గురిచేస్తున్నాడు.

హైదరాబాద్‌కి చెందిన మహ్మద్‌ హసన్‌ అలీ(11) ఏడో తరగతి చదువుతున్నాడు. అందరిలాగే తను కూడా పాఠశాలకు వెళ్తాడు. అందరితో కలిసి ఆటలు ఆడుతాడు. చదువుతాడు. కానీ సాయంత్రం 6 గంటలకు మాత్రం లెక్చరర్‌ అవతారం ఎత్తి బీటెక్‌ విద్యార్థులకు పాఠాలు చెబుతాడు. అతని కంటే రెండింతల ఎక్కువ వయసులో గల వారికి పాఠాలు భోదిస్తాడు. అతని దగ్గర కోచింగ్‌ తీసుకున్న విద్యార్థులు కూడా మా బుల్లి మాస్టార్‌ చాలా గ్రేట్‌ అని చెబుతున్నారు. అతడు చెప్పే విధానం కూడా ఈజీగా, అందరికి అర్ధమయ్యేలా ఉంటుందంటున్నారు.

అయితే ఇలాంటి ఐడియా, ఇంత మేధాశక్తి ఎలా వచ్చిందని ఈ బుల్లి మాస్టారుని అడిగితే.. తెలుసుకోవాలనే తపనతో నేర్చుకుంటూ ఇతరులకి నేర్పిస్తున్నాను అని చెప్పాడు. ‘ నేను ఇంటర్నెట్‌లో ఓ వీడియో చూశాను. భారతీయులు ఇతర దేశాలకి వలస వెళ్లి కష్టమైన పనులు చేస్తున్నారు. పెద్ద చదువులు చదివిన వారు కూడా హార్డ్‌ వర్క్‌ చేస్తున్నారు. మన దగ్గర లక్షల మంది ఇంజనీరింగ్‌ చేస్తున్నప్పటికి వారికి ఉద్యోగాలు రావడంలేదు. వారికి టెక్నికల్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ లేకపోవడం వల్లే విదేశాల్లో ఉద్యోగాలు రావడం లేదని అర్ధమైంది. దీంతో నా దృష్టి డిజైనింగ్ వైపు మళ్లింది. అప్పటి నుంచి నేర్చుకోవడం, నేర్చుకున్నది బోధించడం మొదలు పెట్టాను. గత ఏడాది నుంచి పాఠాలు చెబుతున్నాను. ప్రతి రోజు ఉదయం స్కూల్‌కి వెళ్తాను. 3 గంటలకు ఇంటికి వస్తాను. హోంవర్క్‌ పూర్తి చేసుకుంటాను. కాసేపు ఆడుకుంటాను. సాయంత్రం కోచింగ్ సెంటర్‌కి వెళ్లి సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానికల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులు పాఠాలు చెబుతాను. 2020నాటికి 1000 మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులకు బోధించడమే నా లక్ష్యం’  అని ఆ బాలుడు చెబుతున్నాడు. నిజంగా ఈ బుడతడి ఆలోచనకి, మేధాశక్తికి వావ్‌.. అనాల్సిందే.

మరిన్ని వార్తలు