31,334 ఎకరాలు పరిశ్రమలకు అనువైన భూములు

27 Aug, 2014 04:12 IST|Sakshi

సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి అంతా వరంగల్ కేంద్రంగానే ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. హైదరాబాద్-వరంగల్-భూపాలపల్లి ప్రాంతాలను కలుపుతూ పారి శ్రామిక కారిడార్ ఏర్పాటు అంశం ఇప్పుడు ప్రతిపాదన దశలో ఉంది. హైదరాబాద్-వరంగల్ నగరాల మధ్య పారిశ్రామిక అభివృద్ధికి వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో పరిశ్రమలకు అనువైన భూముల కోసం రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టింది.
 
ముఖ్యమంత్రి కేసీఆర్ మొదట నిర్వహించిన జిల్లా అధికారుల సమావేశంలో జిల్లాలో పారిశ్రామిక భూములు లేవని మన అధికారులు నివేదిక ఇచ్చారు. ఈ విషయాన్ని గుర్తించిన జిల్లా కలెక్టర్... పారిశ్రామిక భూముల గుర్తింపు ప్రక్రియను మరోసారి చేపట్టారు. పూర్తిగా చదును చేసి నీటి సరఫరా ఉన్న వాటినే కాకుండా... వ్యవసాయానికి పనికిరాని భూములన్నీంటినీ గుర్తించాలని ఆదేశించారు. రెవెన్యూ యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా మరోసారి భూములను పరిశీలించింది. వ్యవసాయానికి యోగ్యంకాని భూములను గుర్తించింది. ఇలా జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్లలో కలిపి 31,334 ఎకరాల పారిశ్రామిక భూములు ఉన్నాయని నిర్ధారించారు.
 
మన జిల్లాలోనే అవకాశాలు..
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత పరిశ్రమల అభివృద్ధికి వరంగల్‌లోనే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గోదావరి నది నుంచి నీటిని, సింగరేణి బొగ్గును వనరులుగా వినియోగించుకోవచ్చని పేర్కొంటోంది. కరెంటు ఉత్పత్తికి సంబంధించి సింగరేణి కొ త్తగా చేపట్టనున్న గనులు జిల్లాలోనే ఉన్నాయి. వీటితో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇలా అన్ని వనరులతో పరిశ్రమల ఏర్పాటుకు జిల్లాలో అనువైన భూ ములను రెవెన్యూ శాఖ గుర్తించింది. ఇప్పటికే ప్రతిపాదన దశలో పలు పరిశ్రమలు ఉన్నాయి.
 
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ జిల్లాలో ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. ఈ పరిశ్రమ మంజూరైతే 500 ఎకరాలు అవసరం ఉంటుంది. రూ.5 వేల కోట్లతో ఏర్పాటయ్యే ఈ పరిశ్రమలో ప్రత్యక్షంగానే ఐదు వేల మందికి ఉపాధి లభిస్తుంది. అలాగే రైల్యే వ్యాగన్ వర్క్‌షాప్ ఏర్పాటుకు భూమి విషయమే అడ్డంకిగా మారింది. 55 ఎకరాల్లో రూ.150 కోట్లతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. వరంగల్-స్టేషన్‌ఘన్‌పూర్ మధ్యలో దీని ఏర్పాటుకు నిర్ణయించారు. టెక్స్‌టైల్ పారిశ్రామిక పార్క్‌ను సైతం ఇదే ప్రాంతంలో  నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇప్పటికే చేపట్టిన లెదర్‌పార్క్ ఉంది.
 
జిల్లాలో భూపాలపల్లి ప్రాంతంలోనే కొత్తగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు చేసే అంశం పరిశీలనలో ఉంది. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు బయ్యారంలో కాకుండా మహబూబాబాద్ పరిసరాల్లో లేదా ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రతిపాదనల దశలో ఉన్న మణగూరు-రామగుండం రైల్వే లైను ఏర్పాటు అయితే బొగ్గు ఆధారిత పరిశ్రమలు మరికొన్ని పరిశ్రమలు జిల్లాలో కొలువుదీరే అవకాశం ఉంది. ఇలా కొత్త పరిశ్రమల ఏర్పాటు ఆవశ్యకత నేపథ్యంలో జిల్లాలోని భూములను గుర్తించారు.

మరిన్ని వార్తలు