రోడ్డు ప్రమాదంలో 9మందికి గాయాలు

14 Dec, 2014 23:28 IST|Sakshi
రోడ్డు ప్రమాదంలో 9మందికి గాయాలు

మహేశ్వరం: కారు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో 9 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డుపై ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. పహాడీషరీఫ్ ఎస్‌ఐ నర్సింగ్ రాథోడ్ కథనం ప్రకారం.. హయత్‌నగర్ మండలం పసుమాముల అనుబంధ కళానగర్‌కు చెందిన 11 మంది ఆటోలో మహేశ్వరం మండలంలో బంధువుల అంత్యక్రియలకు హాజరై తిరిగి స్వస్థలానికి వెళ్తున్నారు. కందుకూరు మండలం పులిమామిడి గ్రామానికి చెందిన కారు బొంగ్లూరు గేటు నుంచి తుక్కుగూడ వైపు వెళ్తోంది.

తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్డు సర్వీసు రోడ్డుపైన కారు, ఆటోలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న రేవెళ్ల జంగమ్మ, మోతి జమ్మక్క, టి. రామస్వామి, మోతి జంగయ్య, మోతి కిష్టమ్మ, మోతి గీరప్ప, రేవెళ్ల జాంగీరమ్మ, రేవెళ్ల మల్లేష్ (ఆటో డ్రైవర్), రేవెళ్ల కోటిలింగం గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం, వాహనంలో పరిమితికి మించి ప్రయాణికులు ఉండడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఆటో రాంగ్‌రూట్‌లో వచ్చి తమ వాహనాన్ని ఢీకొట్టిందని కారు డ్రైవర్ ఆర్. కృష్ణ తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.

బైక్‌ను ఢీకొన్న కారు: ఒకరికి గాయాలు
మొయినాబాద్: యూటర్న్ తీసుకుంటున్న కారు బైక్‌ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది ఎండీ షేక్బ్బ్రాని, శంషోద్దీన్‌ల కథనం ప్రకారం.. నగరంలోని ఎల్‌బీనగర్‌కు చెందిన సాయిబాబా తన బైక్‌పై ఆదివారం వికారాబాద్‌కు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలో హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై మండలంలోని కేతిరెడ్డిపల్లి గేటు వద్దకు రాగానే నగరం నుంచి వచ్చిన ఓ కారు యూటర్న్ తీసుకుంటూ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న సాయిబాబాకు రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది ఆయనను చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

లారీ, కారును ఢీకొన్న ఘటనలో..
ధారూరు: కారును లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. ఎస్‌ఐ నాగభూషణం కథనం ప్రకారం.. కోట్‌పల్లి ప్రాజెక్టు వైపు నుంచి వికారాబాద్ వెళ్తున్న కారును ధారూరు సమీపంలో హైదరాబాద్ నుంచి తాండూరు వైపు వెళ్తున్న లారీ ఢీకొంది. దీంతో కారులో ఉన్న సంతోష్‌కుమార్‌కు గాయాలయ్యాయి. పోలీసులు అతడిని వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

మరిన్ని వార్తలు