‘టాటు’ తీశారు! | Sakshi
Sakshi News home page

‘టాటు’ తీశారు!

Published Sun, Dec 14 2014 11:29 PM

‘టాటు’ తీశారు! - Sakshi

సమ్‌థింగ్ స్పెషల్
ఎవరి పిచ్చి వారికి ఆనందం. మైఖేల్ బాక్స్‌టేర్ అనే యాభై రెండు సంవత్సరాల ఆస్ట్రేలియన్‌కు  పాపులర్ కార్టూన్ సిరీస్ ‘ది సింప్సన్’ అంటే చాలా పిచ్చి. ఆ పిచ్చిలో నుంచి పుట్టిన ఆనందంలో నుంచి పుట్టిందే ఒంటి నిండా టాటూలు వేయించుకోవడం.

‘ది సింప్సన్’ కార్టూన్ సిరీస్  ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మిస్ కాకుండా చూస్తున్నాడు మైఖేల్. ఒకటి కాదు రెండు కాదు  ఆ కార్టూన్ సిరీస్‌కు చెందిన 203 కారెక్టర్లను ఒంటి మీద పొడిపించుకున్నాడు. రేపో మాపో గిన్నిస్‌బుక్‌లో ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాడు. ‘ది సింప్సన్’లో ‘హోమర్’ పాత్ర అంటే మైఖేల్‌కు ఇష్టం. అంతమాత్రాన తన అభిమానాన్ని హోమర్‌కి మాత్రమే పరిమితం చేయకుండా అన్ని ముఖ్యపాత్రలకు తన ఒంటి మీద చోటు కల్పించాడు మైఖేల్.
 
‘‘నిజానికి ఇలా చేయడానికి ఎవరూ ఇష్టపడరు. ఇష్టం ఉన్న చోట...కష్టం అనేది లెక్కలోకి రాదు. సింప్సన్ కార్టూన్ సిరీస్ మీద నాకు ఉన్న అభిమానాన్ని కొత్తగా వ్యక్తీకరించాలనే ఆలోచనలో నుంచే ఈ ఐడియా పుట్టింది’’ అంటున్నాడు మైఖేల్.
 
‘ది సింప్సన్’ సిరీస్ పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న మాసంలోనే మైఖేల్ గిన్నిస్ రికార్డ్‌కి దగ్గర కావడం యాదృచ్ఛికమే అయినా... అదొక విశేషంగా మారింది. ఈ టాటూల పుణ్యమా అని జైళ్ల శాఖలో అధికారిగా పని చేస్తున్న మైఖేల్... ఇప్పుడు చిన్న పాటి సెలబ్రిటీగా మారాడు. అంతర్జాలంలో ప్రపంచవ్యాప్తంగా అతడి ఫొటోలను లక్షలాది మంది చూశారు. ‘‘ఈ టూటూలు నాకు గుర్తింపు తెచ్చాయి’’ అని సంతోషిస్తూనే- ‘‘ఒంటి నిండా టాటులు వేయించుకోవడం మామూలు విషయం కాదు. ఆర్టిస్ట్‌లు నా తాట తీశారు. పని పూర్తి కావడానికి 130 గంటలు పట్టింది. కళ్లలో నీరు కారుతూనే ఉండేది’’ అంటున్నాడు మైఖేల్.
 
‘‘ఆయన ఓపిక చూసి ఆశ్చర్యానందాలకు గురయ్యాను’’ అని మైఖేల్ గురించి మెచ్చుకోలుగా చెప్పింది ఆండ్రియా అనే టాటూ ఆర్టిస్ట్. మొదట మైఖేల్ తన ఆలోచనను ఆండ్రియాకు చెప్పినప్పుడు ఆమె సీరియస్‌గా తీసుకోలేదు. సరదాగా అంటున్నాడేమో అనుకుంది.ఎవరు ఎలా అనుకున్నా.... మొత్తానికైతే అందరిచేత ‘వావ్’ అనిపించకున్నాడు మైఖేల్!

Advertisement
Advertisement