ప్రచారం.. కలవరం!

15 Oct, 2018 13:21 IST|Sakshi

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ తేదీకి సుమారు రెండు నెలల గడువు ఉండడంతో ప్రచారం గురించి  రాజకీయ పార్టీలు, అభ్యర్థులు మల్లగుల్లాలు పడుతున్నారు. నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయని నేతలు భావించగా, ఎన్నికల సంఘం మాత్రం పోలింగ్‌ తేదీని డిసెంబర్‌ 7వ తేదీగా నిర్ణయించింది.   దీంతో ఇంతకాలం ప్రచార పర్వాన్ని ముమ్మరంగా కొనసాగించడం అసాధ్యమని భావిస్తున్నారు. ప్రస్తుతానికి పార్టీ కార్యకర్తలతో అంతర్గత సమావేశాలు, గ్రామాల సందర్శనతో సరిపెట్టాలనే యోచనలో ఉన్నారు. 

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర శాసన సభ రద్దు నేపథ్యంలో సెప్టెంబర్‌ మొదటి వారంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను టీఆర్‌ఎస్‌ విడుదల చేసింది. నవంబర్‌ రెండో వారంలో ఎన్నికలు ఉంటాయనే అంచనాల నేపథ్యంలో పార్టీ అభ్యర్థులు హడావుడిగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మండలాలు, నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల సమావేశాలు, ర్యాలీలు వంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. వాయు వేగంతో గ్రామాలను చుట్టి వచ్చేలా షెడ్యూలు రూపొందించుకుని కొంత మేర పూర్తి చేశారు. ఓటరు తుది జాబితా విడుదల, అసెంబ్లీ రద్దుపై కోర్టు కేసులు తదితరాల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది.

ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకారం నవంబర్‌ రెండో వారంలో నామినేషన్ల ప్రక్రియ మొదలై, డిసెంబర్‌ 7న పోలింగ్‌ జరగనుంది. ఎన్నికల తేదీకి సుమా రు 50 రోజుల గడువు ఉండడంతో ప్రచార పర్వా న్ని ప్రస్తుత వేగంతో కొనసాగించడం కష్టమని టీఆర్‌ఎస్‌ పార్టీ అంచనా వేస్తోంది. మరోవైపు బతుకమ్మ, దసరా పండుగలు అడ్డు వస్తుండడం తో గ్రామాల్లో ప్రచారం చేసినా ప్రయోజనం ఉండదనే భావన పార్టీ అభ్యర్థుల్లో కనిపిస్తోంది. ప్రచార పర్వం అత్యంత ఖర్చుతో కూడుకోవడంతో ఇప్పటి నుంచే జరిగే ముమ్మర ప్రచారం ఆర్థికంగా భారమవుతుందనే ఆందోళన నేతల్లో వ్యక్తమవుతోంది. దీంతో వచ్చే 50 రోజుల పాటు చేయాల్సిన ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వ్యూహరచనపై మల్లగుల్లాలు పడుతున్నారు. నవంబర్‌ మొదటి వారం వరకు సుమారు 20 రోజుల పాటు పార్టీ కార్యకర్తలు, వివిధ సంఘాలతో అంతర్గత భేటీలు, సమావేశాలకు పరిమితం కావాలనే యోచనలో ఉన్నారు. వచ్చే నెల రెండో వారం నుంచి సభలు, సమావేశాలతో ప్రచార పర్వాన్ని వేడెక్కించేలా వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారు.

టికెట్ల వేటలో విపక్ష నేతలు బిజీ
ఓ వైపు అధికార పార్టీ ప్రచార వ్యూహం అనుసరించడంపై తర్జనభర్జనలు పడుతుండగా, ప్రధాన విపక్ష పార్టీల నేతలు మాత్రం టికెట్ల వేటలో తిరుగుతున్నారు. శాసన సభను రద్దు చేసి నెలా పది రోజులు కావస్తున్నా కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాపై స్పష్టత రావడం లేదు. టికెట్ల కోసం పోటీ లేని అందోలు, నర్సాపూర్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో మాత్రమే పార్టీ శ్రేణుల సందడి కనిపిస్తోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నర్సింహ, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు.

సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తరపున ఆయన భార్య నిర్మల, కూతురు జయ ప్రచారంలో భాగంగా ఒక దఫా నియోజకవర్గాన్ని చుట్టి వచ్చారు. పటాన్‌చెరు, నారాయణఖేడ్‌లో టికెట్ల కేటాయింపుపై స్పష్టత లేకపోవడంతో ఔత్సాహిక నేతలు పార్టీ అధిష్టానం, ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జహీరాబాద్‌లో మాజీ మంత్రి గీతారెడ్డి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తున్నా, ప్రచారం మాత్రం మొక్కుబడిగా సాగుతోంది.

ఇతర పార్టీల్లోనూ అంతే
జిల్లాలోని అన్ని స్థానాలకు పోటీ చేస్తామని ప్రకటించిన బీఎల్‌ఎఫ్‌ ఇప్పటి వరకు అందోలు, సంగారెడ్డి అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను మాత్రమే ప్రకటించింది. బీజేపీలో అభ్యర్థుల వేట ఇంకా మొదలు కాలేదు. నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యేందుకు మరో నెల రోజుల వ్యవధి ఉండడంతో ఇప్పటి నుంచే ఆర్భాటం అవసరం లేదనే ధోరణి విపక్ష పార్టీల్లో కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారానికి కేవలం 20 రోజుల వ్యవధి సరిపోతుందని, ఎక్కువ రోజులు కొనసాగితే ఖర్చు తడిసి మోపెడవుతుందనే ఆందోళన పార్టీలు, అభ్యర్థులను పీడిస్తోంది. దసరా పండుగ తర్వాత నవంబర్‌ మొదటి వారం వరకు ఆర్భాట ప్రచార జోలికి వెళ్లకుండా, ఆ తర్వాతే వేగం పెంచుతామని అధికార పార్టీ అభ్యర్థి ఒకరు వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు