‘స్వీట్‌’ కార్ఖానా..హైటెక్‌ జమానా

17 Apr, 2018 10:29 IST|Sakshi

అందులోకి అడుగు పెట్గగానే హెడ్‌ క్యాప్‌ ఇస్తారు. కాళ్లకు ప్లాస్టిక్‌ కవర్‌ తప్పనిసరి. తర్వాత మీరు ఎయిర్‌ ఫిల్టర్లు అమర్చి ఉన్న ద్వారం.. దానికి ఉన్న అత్యంత మందమైన ప్లాస్టిక్‌తెరలను కాసింత బలంగానేచీల్చుకుంటూ లోపలికి అడుగుపెట్టాలి. ఇదంతా చూస్తే అదేదో రీసెర్చ్‌ సైన్స్‌ ల్యాబ్‌ ఏమో అనిపిస్తుంది కదా. కానీ కాదు.. నగరంలోని ఓ మిఠాయి దుకాణం కిచెన్‌. రుచులతో మాత్రమే కాదు.. అత్యాధునిక కిచెన్‌తోనూ నగరవాసుల్ని ఆకట్టుకుంటున్నాయి మిఠాయి షాప్స్‌. కళ్లారా చూసి నమ్మండి అంటూ వినియోగదారులనుకూడా ఆహ్వానిస్తున్నాయి.

సాక్షి, సిటీబ్యూరో  :చవులూరించే స్వీట్లు, హాట్లు సరే. మిరుమిట్లు గొలిపే లైట్లు, ఫ్యాన్సీ ఇంటీరియర్స్, ఎయిర్‌ కండిషనింగ్, యాంబియన్స్‌.. ఇవీ సరే. ‘వీటన్నింటికన్నా ఆ మిఠాయిలు ఎలా? ఎక్కడ? ఏ విధంగా తయారవుతున్నాయి? అనేదే వినియోగదారులకు అత్యంత ప్రధానమైన విషయం’ అంటారు కూకట్‌పల్లిలోని ఆల్మండ్‌ హౌస్‌ నిర్వాహకులు చైతన్య. నగరంలో ఆరు స్వీట్‌షాప్స్‌ నిర్వహిస్తున్న ఆల్మండ్‌ హౌస్‌... 4ఫ్లోర్లలో దాదాపు 20వేల చదరపు అడుగుల్లో విస్తరించిన తమ కిచెన్‌ను అత్యంత ఆధునికంగా తీర్చిదిద్దింది. స్టోర్‌లో అలంకరణతో పాటు కిచెన్‌లో అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నగరంలో ఇంతవరకూ ఏ స్వీట్‌ షాప్‌కు లేని హజార్డ్‌ అనాలసిస్‌ అండ్‌ క్రిటికల్‌ కంట్రోల్‌ పాయింట్స్‌ (హెచ్‌ఏసీసీపీ) సర్టిఫికేషన్‌ సాధించే దిశగా పయనిస్తోంది.  

అత్యాధునికం.. అత్యంత పరిశుభ్రం  
ప్రత్యేక ప్యాకింగ్‌ గదులు, ఎయిర్‌ కండిషన్డ్‌ ఫినిషింగ్‌లతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో వంటశాలను తీర్చిదిద్దుతుండడం విశేషం. అందులో భాగంగా తయారీ విభాగంలోకి సరఫరా అయ్యే గాలిని సైతం శుద్ధి పరచడం, హ్యుమిడిటీ నియంత్రణ, యూవీ లైట్‌తో స్టెరిలైజ్‌ అయిన ఫ్రెష్‌ ఎయిర్‌... లాంటి ఎన్నో ప్రత్యేక విధానాలు ఇక్కడ కనిపిస్తాయి. గాలి నాణ్యతతో పాటు సూక్ష్మజీవుల పరిమాణాన్ని వారానికోసారి పరిశీలిస్తారు. తయారీదారులు, ఉత్పత్తులను హ్యాండిల్‌ చేసే సిబ్బంది ఆరోగ్య పరిస్థితులను మూడు నెలలకు ఒకసారి చెక్‌ చేస్తారు.  

ఎనీటైమ్‌.. తనిఖీ చేసుకోండి  
ఫుడ్‌ అండ్‌ సేఫ్టీ అధికారులు అకస్మాత్తుగా తనిఖీలు చేస్తున్నారంటేనే నగరంలోని పెద్ద పెద్ద రెస్టారెంట్స్‌ సైతం వీలున్నంత వరకు తప్పించుకోవాలని చూస్తాయి. అలాంటిది.. సామాన్య ప్రజలు కూడా తమ కిచెన్‌ను తనిఖీ చేసుకోవచ్చునని ఆఫరిస్తున్నాయి ఆల్మండ్‌ హౌస్‌ లాంటి స్వీట్‌ షాప్స్‌. ‘కొనుగోలుదారుడిని కేవలం వ్యాపార లావాదేవీల వరకే పరిమితం చేయడం మా ఉద్దేశం కాదు. నిజానికి కిచెన్‌ను చెక్‌ చేసుకోవడమనేది వినియోగదారుడి హక్కు అని మేం భావిస్తాం. అందుకే మా కిచెన్‌ను మా కస్టమర్స్‌ ఎవరైనా ఎప్పుడైనా సరే తనిఖీ చేసేందుకు ఓపెన్‌గా ఉంచుతాం’ అంటున్నారీ స్టోర్‌ నిర్వాహకులు. అంతేకాదు.. నగరవాసులు చిన్న చిన్న బృందాలు, సమూహాలుగా ఈ కిచెన్‌ను సందర్శించాలనుకుంటే తాము స్వాగతిస్తామని చెప్పారు. విద్యాసంస్థలు సైతం తమ విద్యార్థులకు టూర్స్‌ నిర్వహించదలిస్తే సహకరిస్తామంటూ కొత్త ట్రెండ్‌కు తెరదీశారు.

మరిన్ని వార్తలు