ఆనందం.. ఉద్విగ్నం

14 Jun, 2014 04:16 IST|Sakshi
ఆనందం.. ఉద్విగ్నం

అతని సంకల్పం ముందు ఎవరెస్ట్ చిన్నబోయింది..మంచుకొండల మీద ఆయన వేసిన ఒక్కో అడుగు భారతఖ్యాతిని, భద్రాద్రి ప్రతిష్టను ప్రపంచనలుమూలలా చాటింది..ఎముకలు కొరికే చలికి స్పర్శ కోల్పోయిన శరీరం లక్ష్యం గుర్తొచ్చినప్పుడల్లా శక్తిని కూడగట్టి అడుగుముందుకు వేయించింది. అడ్వాన్స్‌బేసిక్ క్యాంప్ మొదలు ఒక్కో క్యాంప్ దాటుతున్నప్పుడు ఆనందంతో అతని మనసు ఉప్పొంగింది. చివరి దశలో పెద్దపెద్ద లోయలు..ఏమాత్రం పట్టుతప్పినా ప్రాణాలకు ముప్పు.. అక్కడే శవాల కుప్పలు..అయినా ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా మరో విజేత పూర్ణతో కలిసి ఆనంద్‌కుమార్ ముందుకెళ్లారు.
 
ఎవరెస్ట్ శిఖరాధిరోహణలో చర్ల మండలం కలివేరు గ్రామానికి చెందిన సాధనపల్లి ఆనంద్‌కుమార్‌కు ఎన్నెన్నో ఒడిదొడుకులు. మొక్కవోని ఆత్మవిశ్వాసం..‘విజయమో వీరస్వర్గమోనన్న’ పట్టుదల..లక్ష్య ‘సాధనే’ ధ్యేయంగా సాగిన ఆ ప్రస్థానంతో 46 రోజుల కఠోర శ్రమ ఫలించింది..తనపై నమ్మకం ఉంచిన వారి ఆశలు..ఆశయాలు నెరవేరుతున్నాయన్న ‘ఆనందం’ ముందు బాధలన్నీ దూరమయ్యాయంటున్న ‘ఎవరెస్ట్’ విజేత మనోగతం...
 
భద్రాచలం టౌన్: ‘భూ భాగానికి 8,848 మీటర్ల ఎత్తున, మైనస్ 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో అత్యంత ఎత్తై శిఖరం ఎవరెస్టును అధిరోహించగానే ఐఏఎస్ ప్రవీణ్‌కుమార్ సార్‌కు ఇచ్చిన మాట గుర్తొచ్చింది. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా శిఖరాన్ని అధిరోహిస్తామని చెప్పిన మాటలు మదిలో మెదిలాయి. ఆనందంతో గుండె నిండిపోయింది.’ అని ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన సాధనపల్లి ఆనంద్‌కుమార్ తెలిపారు. శిఖరం ఎక్కిన తరువాత తొలిసారి జన్మస్థలానికి వచ్చిన ఆయన అనుభూతులను ‘సాక్షి’తో పంచుకున్నారు.
 
అలా నా జీవన గమనం మారింది..
‘నా జీవితంలో కీలక మలుపు అంటే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జాయిన్ కావటమే. ఆరో తరగతి వరకు మా స్వగ్రామం చర్ల మండలం కలివేరులోనే చదువుకున్నాను. అప్పటి వరకు చదువు అంతంతమాత్రంగా సాగింది. మా నాన్న (ఏడుకొండలు) నన్ను రెసిడెన్షియల్ పాఠశాలలో చదవించాలని అనుకున్నారు. దీనికి ఆర్. కొత్తగూడెంకు చెందిన ఇందుల బుచ్చిబాబు సహకరించారు. చండ్రుగొండ మండలం అన్నపురెడ్డిపల్లి రెసిడెన్షియల్ పాఠశాలలో ఏడో తరగతిలో చేరాను. మొన్న ఇంటర్ ప్రథమ సంవత్సరం కూడా అక్కడే పూర్తి చేశాను. ఆటలంటే నాకు ఎంతో ఇష్టం. అన్ని ఆటల్లో ప్రవేశం ఉంది. కళాశాల స్పోర్ట్స్ చాంపియన్‌ను కూడా. బహుషా శిఖర అధిరోహనకు కావాల్సిన శక్తిసామర్థ్యం, పట్టుదల ఆటల వల్లే అలువడి ఉంటుంది.
     
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థుల నైపుణ్యాలను వెలికితీయాలని ఆ శాఖ ఐఏఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సార్ నిర్ణయించుకున్నారు. ఆయన తీసుకున్న ఆ నిర్ణయమే నా జీవితాన్ని మార్చేసింది. 2013లో నల్లగొండ జిల్లా భువనగిరిలో రాక్‌క్లైంబింగ్ శిక్షణ శిబిరం నిర్వహించారు. ఆ శిబిరానికి మా కళాశాల నుంచి నాతోపాటు మరొకరిని పంపారు. మొత్తం ఈ శిక్షణకు 110 మంది హాజరయ్యారు. దానిలో 20 మందిని ఎంపిక చేశారు. అందులో నేనొక్కన్ని.
     
ఆ 20 మందికి అర్జున అవార్డు గ్రహీత, ఎవరెస్టు శిఖర అధిరోహకుడు శేఖర్‌బాబు, పరమేశ్వరరెడ్డి శిక్షణ ఇచ్చారు. శేఖర్‌బాబు ఇచ్చిన అనేక సలహాలు, సూచనలు మాకెంతగానే ఉపయోగపడ్డాయి. అప్పటి వరకు ఎవరెస్టు ఎక్కిన వారి వీడియో క్లిప్పింగ్‌లు, ఫొటోలను చూపించి మమ్మల్ని ఉత్తేజపర్చారు. ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నా ఎవరెస్టు విజేతగా నిలవాలని...అప్పటి నుంచి వారి మార్గదర్శకత్వంలో ముందుకెళ్లా. వారి సూచనలను తూ.చ తప్పకుండా పాటించా విజేతనయ్యా.
 
సర్దుకుపోయే తత్వమే నా ఎంపికకు కారణమేమో..
పరిస్థితులను బట్టి నడుచుకోవడం నాకు చిన్ననాటి నుంచి అలవాటు. మారుమూల ప్రాంతం, అదీ పేదరికంలో జన్మించడం..కష్టనష్టాలను ఎదుర్కోవడం వల్లనేమో నాకు సర్దుకుపోయే మనస్థత్వం అలువడింది. నాకున్న ఆ లక్షణమే మా శిక్షకులను మెప్పించి ఉండొచ్చు. నన్ను సెలెక్ట్ చేయడానికి అదే కారణమై ఉంటుందని నా అభిప్రాయం.
     
భువనగిరిలో శిక్షణ తరువాత డార్జిలింగ్, సిక్కిం, హిమాలయ పర్వతాలు తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి ఎవరెస్టు వాతావరణం అలవాటయ్యేలా మాకు తర్ఫీదు నిచ్చారు. ఇక్కడ మైనస్ 20 డిగ్రీల చలిలో శిక్షణ తీసుకున్నాం. ఇవన్నీ అయ్యాక 20 మందిలో తొమ్మిది మందిని ఎంపిక చేశారు. ఫిజికల్ ఫిట్‌నెస్ శిక్షణ ఇచ్చారు. మొత్తం నాలుగుదశల శిక్షణ. దానిలో ఇద్దరం నిలిచాం. శిక్షణలో భాగంగా చల్లదనాన్ని తట్టుకోవడం, ధరించాల్సిన దుస్తులు, తీసుకోవాల్సిన ఆహారం, ఆక్సిజన్ తదితర వాటిపై క్షుణ్ణంగా శిక్షణ ఇచ్చారు. రోజుకు 30 కిలోమీటర్లు జాగింగ్, యోగాసనాలను ప్రాక్టీస్ చేయించారు. ఫైనల్‌గా తొమ్మిది మందిలో నేను, నిజామాబాద్‌కు చెందిన పూర్ణ సెలెక్ట్ అయ్యాం. ఆ తర్వాత కళాశాలకు వచ్చాం. ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసి తిరిగి వెళ్లాం.
 
స్పర్శ లేదు.. శక్తి కోల్పోయాం..
మంచు ప్రభావంతో శరీరానికి స్పర్శలేకుండా పోయింది. ఒట్లో సత్తువకూడా లేదు. అయినా పట్టుదలతో ముందుకుపోయాం. ఏప్రిల్ 6న హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాం. ఢిల్లీ, నేపాల్‌లోని ఖాట్మాండ్ మీదుగా చైనా వరకు బస్సులో వెళ్లాం. అడ్వాన్స్‌బేసిక్ క్యాంప్‌గా భావించే 6,400 మీటర్ల వరకు భారతీయఫుడ్‌ను తీసుకుంటూ వెళ్లాం. అక్కడి నుంచి ప్యాకింగ్‌ఫుడ్‌ను తీసుకోవాల్సి వచ్చింది. ఆ ఫుడ్‌ను నీటిలో వేడిచేసి తినాల్సి వచ్చేది. కష్టంగా ఉన్నా ఆ ఫుడ్‌ను తీసుకున్నాం. అక్కడి నుంచి క్యాంప్ 1- 7,100 మీటర్లు, క్యాంప్ 2- 7,700, క్యాంప్ 3 -8,300 మీటర్లను దాటుకుంటూ ముందుకు వెళ్లాం. మైనస్ 30 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మాత్రమే ఉండటంతో శరీరానికి స్పర్శ లేకుండా పోయింది. ఒంట్లో సత్తువ లేదు. చనిపోయినా ఫర్వాలేదనుకుంటూ ముందుకెళ్లాం.
 
 బస్తాలు మోయడం వల్లనేమో.. బరువు అనిపించలేదు..
పాఠశాలలో చదివే రోజుల్లో సెలవుల్లో కలివేరులో పనులకు వెళ్లే వాడిని. ధాన్యం బస్తాలు మోయటం, తాపీ పనులు చేయటం వంటివి చేసేవాణ్ని. దీనివల్లనేమో 20 కేజీల బరువుండే బ్యాగ్  పర్వతారోహణలో ఎప్పుడూ వీపుపై ఉన్నా పెద్దభారం అనిపించేది కాదు. ఈ బ్యాగ్‌లో రెండు ఆక్సిజన్ సిలిండర్లు, జాకెట్స్, జ్యూస్, చాక్లెట్స్ తదితర సామగ్రి ఉండేది. ఇంతబరువును వీపుపై ఉంచుకొని పగలంతా ప్రయాణించేవాళ్లం. రాత్రి ళ్లు నిద్రపట్టేది కాదు. నిద్రపోయే కొద్ది సమయం లో మాత్రమే ఆ బ్యాగ్‌ను తీసి కిందపెట్టేవాళ్లం.
 
 శవాలను దాటివెళ్లాం..
 చివరి దశలో చాలా కష్టమనిపించింది. తల్లిదండ్రులు, మాపై నమ్మకం ఉంచి డబ్బులు ఖర్చుపెట్టిన సార్లు, శిక్షకులు గుర్తొచ్చారు.  8,300 అడుగులు దాటాక పెద్దపెద్ద లోయలు ఉండేవి. వాటిని దాటేటప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు పోయినట్టే. ఆ సమయంలో అక్కడ చాలా శవాలు కనిపించాయి. వాటిని చూసినప్పుడు గుండెనిబ్బరం కోల్పోకూడదనుకున్నాం. మనోధైర్యంతో ముందుకెళ్లాం.
 
 తొలి అడుగు ఓ మధుర క్షణం
 చివరిగా 8,848 మీటర్లు దాటి ఎవరెస్టు శిఖరంపై తొలి అడుగువేసిన ఆ క్షణం...నా జీవితంలో మర్చిపోలేనిది. ఆ మధుర క్షణం కోసం ఇన్నిరోజులు  నాకు తోడ్పడిన నా తల్లిదండ్రులు, మా కళాశాల ప్రిన్సిపాల్ శివనారాయణ, పీడీ, అధ్యాపకులు, ప్రవీణ్‌కుమార్ సార్, శిక్షకులు శేఖర్, స్నేహితులు ఇలా ప్రతి ఒక్కరూ నా కళ్ల ముందు కదలాడారు. వారందరికీ నా విజయాన్ని అంకితమిస్తూ అక్కడ జాతీయ, తెలంగాణ జెండాలను ఉంచాం. అంబేద్కర్, ఎస్‌ఆర్ శంకర్‌ల ఫొటోలను పెట్టాం. స్పార్సో జెండాను పాతం. భారతదేశం, భద్రాచలం ఖ్యాతిని మరోమారు ప్రపంచశిఖరంపై రెపరెపలాడించటం నాకు గర్వంగా అనిపించింది.
 
 కృషి ఉంటే..
 కృషి, పట్టుదల ఉంటే పేదరికం అడ్డుకాదు. దీనికి నా జీవితమే నిదర్శనం. అతి పేద కుటుంబం నుంచి వచ్చిన నేను..నేడు పదిమందికి ఆదర్శంగా నిలిచాను. మాపై నమ్మకం ఉంచి కోట్లు ఖర్చుపెట్టిన అధికారుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా శ్రమించాం.నాలాంటి పేదలు ఎంతో మంది ఉన్నారు. వారికి చేయూత నందిస్తే విజేతలుగా నిలుస్తారు. పేదవారికి, అట్టడుగు వర్గాల వారికి సాయం, మార్గదర్శకత్వం అందించేలా నేను ఉండాలనేది నా అభిమతం.
 
ఐపీఎస్ సాధనే లక్ష్యం..
ఐపీఎస్‌ను సాధించడమే నా లక్ష్యం. మా స్వగ్రామానికి వెళ్లి వస్తా. ఆ తర్వాత ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుపై దృష్టి పెడతా. ఉన్నతచదువులు చదివి ఐపీఎస్ సాధిస్తా. ఆ తర్వాత నా జిల్లా, మండలం, గ్రామాభివృద్ధిలో పాలుపంచుకోవాలనేదే నా లక్ష్యం. ఆ దిశగా నన్ను ఆశీర్వదించాలని మిమ్మల్నందర్ని వేడుకుంటున్నా.

మరిన్ని వార్తలు