వడదెబ్బకు విరుగుడు

4 Mar, 2019 04:24 IST|Sakshi

బాధితులకు ఆస్పత్రుల్లో ప్రత్యేక పడకలు

వేసవి కార్యాచరణ ప్రణాళిక ప్రకటించిన ప్రభుత్వం

వీధులలో విరివిగా చలివేంద్రాల ఏర్పాటు

సాక్షి, హైదరాబాద్‌: వడదెబ్బ బాధితులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా పడకలను సిద్ధం చేయాలని వేసవి కార్యాచరణ ప్రణాళిక స్పష్టం చేసింది. వడదెబ్బకు గురై ఆస్పత్రుల పాలయ్యేవారికి అవసరమైన వైద్యం అందించాలని పేర్కొంది. ఈ ఏడాదీ వడగాడ్పులు అధికంగా ఉంటాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో వేసవి ప్రణాళికపై అధికారులు దృష్టి సారించారు. ఏటా ఈ ప్రణాళికను అమలుచేసే బాధ్యతను విపత్తు నిర్వహణ శాఖ చేపడుతుంది. అందులో భాగంగా ఈ ఏడాదికీ వేసవి ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. తీవ్రమైన ఎండల నుంచి ప్రజలను అప్రమత్తం చేయడం, బాధితులకు అవసరమైన సహాయ చర్యలు తీసుకోవడమే ప్రణాళిక ముఖ్య ఉద్దేశం. ఈ విషయంలో వివిధ శాఖలు ఎటువంటి పర్యవేక్షణ చేయాలన్న దానిపై వేసవి ప్రణాళిక కార్యాచరణ రూపొందించింది. 

జిల్లా రాష్ట్ర స్థాయిలో కమిటీలు.. 
వడదెబ్బకు ఎక్కువగా  పేదలే గురవుతున్నారు. పైగా వారిలో ఎక్కువమంది ఆరుబయట కాయకష్టం చేసేవారు, కార్మికులు. వడదెబ్బకు చనిపోయే వారిలో 40–60 ఏళ్ల వయసు వారు ఎక్కువగా ఉంటున్నారు. వారికి ఎండ తీవ్రత నుంచి రక్షణ కల్పించేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులతో కమిటీని ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రస్థాయి కమిటీకి విపత్తు నిర్వహణశాఖ కమిషనర్‌ నోడల్‌ ఆఫీసర్‌గా ఉంటారు. వైద్య, రెవెన్యూ తదితర శాఖల ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయిలో వేసవి ప్రణాళిక అమలుకు కలెక్టర్‌ నోడల్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సంబంధిత కమిషనర్లు నోడల్‌ ఆఫీసర్లుగా ఉంటారు. మార్చి నుంచి జూన్‌ వరకు ఈ ప్రణాళిక అమలు చేస్తారు. తీవ్రమైన వడగాడ్పులు, ఎండలుండే హైరిస్క్‌ ప్రాంతాలను ఈ కమిటీలు గుర్తించాలి. తద్వారా వడదెబ్బకు ప్రజలు గురికాకుండా నివారించాలి. ఆరోగ్య కార్యకర్తలకు, పాఠశాల విద్యార్థులకు, స్థానిక ప్రజలకు వడదెబ్బ నివారణపై శిక్షణ ఇవ్వాలి. వాతావరణ కేంద్రం ద్వారా ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా ఎండల తీవ్రతపై హెచ్చరికలు జారీచేయాలి. మీడియాకు, వివిధ ప్రభుత్వ శాఖలకు వర్క్‌షాప్‌ నిర్వహించాలి. పౌరసంబంధాల శాఖ ద్వారా ముఖ్యమంత్రి బహిరంగ సభల లేఖలను ముద్రించి గ్రామ సభల్లో చదివించాలి. సినిమా హాళ్లలో స్లైడ్లను ప్రదర్శించాలి. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బందికి, ఆశా వర్కర్లు, పారామెడికల్‌ సిబ్బందికి ఎండల తీవ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ కల్పించాలి. వైద్య విద్య సంచాలకుల ద్వారా వైద్య విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి. వైద్య విధాన పరిషత్, వైద్య విద్య సంచాలకుల ఆధ్వర్యంలో సంబంధిత ఆస్పత్రుల్లో వడదెబ్బ బాధితులకు ప్రత్యేక పడకలు ఏర్పాటు చేయాలి.

మధ్యాహ్నం బస్సులు నిలిపివేసేలా..
- నిర్మాణ కార్మికులకోసం సంబంధిత యాజమాన్యాలు తాగునీటి వసతి, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి.  
ఉపాధి హామీ కూలీలకు పనిచేసే చోట టెంట్లు ఏర్పాటు చేయాలి. నీటి వసతి కల్పించాలి.  
పశువులు, కోళ్లకు వడదెబ్బ తగలకుండా తగు చర్యలు తీసుకోవాలి.  
క్యాబ్, ఆటో డ్రైవర్లకు వేసవి తీవ్రతపై అవగాహన కల్పించాలి. 
బస్టాండ్లలో ప్రయాణికులకోసం తాగునీటి వసతి కల్పించాలి. కరపత్రాలు పంచాలి. సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో చల్లని తాగునీరు, ఐస్‌ ప్యాక్‌లు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి. ఈ మేరకు ఆర్టీసీ చర్యలు తీసుకోవాలి.  
వడగాడ్పుల సమయంలో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బస్సులను నిలిపివేయాలి.  
పాఠశాల తరగతి గదుల్లో సీలింగ్‌ ఫ్యాన్లు ఏర్పాటు చేయాలి. తాగునీటి వసతి కల్పించాలి. ఓఆర్‌ఎస్, ఐస్‌ ప్యాక్‌లను అందుబాటులో ఉంచాలి. వడగాడ్పుల సమయంలో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు నిర్వహించకూడదు. అలాగే ఆరుబయట తరగతులను నడపకూడదు.  
ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు పలుచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి.  
వాతావరణశాఖ ఎప్పటికప్పుడు వడగాడ్పులపై సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలి. 

మరిన్ని వార్తలు